అదే జరిగితే: జియో టారిఫ్ రేట్లు పెంచనుందా?

  • Published By: sreehari ,Published On : November 19, 2019 / 01:07 PM IST
అదే జరిగితే: జియో టారిఫ్ రేట్లు పెంచనుందా?

టెలికం దిగ్గజాలు మొబైల్ సర్వీసు టారిఫ్ రేట్లను పెంచడంపైనే దృష్టిసారించాయి. ఒక్కొక్కటిగా తమ మొబైల్ ఫోన్ కాల్స్, డేటా ప్లాన్లపై ధరలను పెంచాలని నిర్ణయించాయి. ఇప్పటికే వోడాపోన్-ఐడియా, భారతీ ఎయిర్ టెల్  టెలికోలు తమ టారిఫ్ రేట్లను పెంచుతున్నట్టు ప్రకటించాయి.

ఈ రెండు కంపెనీలకు సంబంధించి కొత్త టారిఫ్ రేట్లు డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. టెలికం రంగంలోకి ప్రవేశించి తక్కువ డేటా ఆఫర్లతో యూజర్లను ఆకర్షించి నెంబర్ వన్ స్థాయికి చేరిన రిలయన్స్ జియో కూడా కాల్స్, డేటా టారిఫ్ రేట్లను పెంచే యోచనలో ఉన్నట్టు సమాచారం. 

ప్రస్తుతానికి జియో నుంచి టారిఫ్ పెంపు విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. వోడాఫోన్-ఐడియా, ఎయిర్ టెల్ బాటలోనే జియో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడేళ్ల పాటు ఉచిత వాయిస్ కాల్స్ ఆఫర్ చేసిన రిలయన్స్ జియో గత అక్టోబర్ నెల నుంచి జియోయేతర ఫోన్ నెంబర్లకు ఫోన్ కాల్స్ చేస్తే నిమిషానికి 6పైసలు చొప్పున ఛార్జ్ చేస్తోంది. 

వోడాఫోన్, ఎయిర్‌టెల్ టారిఫ్స్ ప్రకటన కోసం జియో కూడా వేచి చూస్తోంది. ఆ తర్వాతే జియో స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వంతో ఆదాయ భాగస్వామ్యంపై  డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ AGR గణన పద్ధతిని అనుసరించాలని సుప్రీంకోర్టు కోరిన తరువాత.. జనవరి 24, 2020 నాటికి సుమారు రూ.74వేల కోట్లు చెల్లించాల్సిన బాధ్యత పడటంతో వొడాఫోన్, ఎయిర్‌టెల్ టారిఫ్ ఒక్కసారిగా పెంచేశాయి.