Categories
Telangana

అమ్మవారి దర్శనానికి భక్తులు రావద్దు.. ఇంట్లోనే బోనాలు సమర్పించుకోవాలి : మంత్రి తలసాని

కరోనా నిబంధనలకనుగుణంగా (జులై 12, 2020) జరిగే సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి జాతరను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తామని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పేర్కొన్నారు. జాతర సందర్భంగా ఆలయంలోకి భక్తులకు అనుమతి లేదని తెలిపారు. ఎవరి ఇళ్లల్లో వారే పండుగ చేసుకోవాలని సూచించారు. వీఐపీ, వీవీఐపీలకు అనుమతి లేదన్నారు. ప్రభుత్వం తరుపున అందించే పట్టు వస్ర్తాలను దేవాలయ సిబ్బందే అమ్మవారికి సమర్పిస్తారని తెలిపారు.

శుక్రవారం (జూలై 3, 2020) సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి దేవాలయ ప్రాంగణంలో దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌, ఉత్తర మండల పోలీస్‌ అధికారులు, ఆలయ ట్రస్టీ, మైత్రీ కమిటీ సభ్యులతో కలిసి జాతరపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహించే జాతరను కరోనా కారణంగా ఈ సంవత్సరం ఆలయం లోపలే జరుపుతామన్నారు. ఆలయ అధికారులు, వేద పండితులు, ట్రస్టీ సభ్యులు మాత్రమే పూజల్లో పాల్గొంటారని తెలిపారు. పరిస్థితిని అర్థం చేసుకొని భక్తులు సహకరించాలని కోరారు.

(జులై 13, 2020) నిర్వహించే రంగం కార్యక్రమాన్ని ప్రతిఒక్కరూ చేసేలా ప్రత్యక్ష ప్రసారం చేస్తామన్నారు. జాతరను పురస్కరించుకొని పకడ్బందీగా బందోబస్తును ఏర్పాటు చేయాలని మంత్రి పోలీసులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్‌జేసీ రామకృష్ణ, ఏసీ బాలాజీ, ఈవోలు అన్నపూర్ణ, మనోహర్‌రెడ్డి, ఆలయ ట్రస్టీ సురిటి కామేశ్‌, మహంకాళి ఏసీపీ వినోద్‌కుమార్‌, ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసులు పాల్గొన్నారు.

కాగా, ఉజ్జయినీ అమ్మవారికి జాతరకు ముందే భక్తులు బోనాలు సమర్పించారు. తలపై బోనంతో శుక్రవారం దేవాలయానికి భక్తులు రాగా.. ఆలయ సిబ్బంది శానిటైజ్‌ చేసి టెంపరేచర్‌ చూసిన తర్వాత లోనికి అనుమతించారు. మహిళలు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది.

Categories
Telangana

కరోనా నుంచి కోలుకున్న తెలంగాణ హోంమంత్రి మహమూద్‌ అలీ

తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఫలితం నెగెటివ్‌గా వచ్చింది. ఆయనతోపాటు తన కుమారుడు, మనువడు కూడా శుక్రవారం (జులై 3, 2020) డిశ్చార్జ్‌ అయ్యారు. ఆదివారం మంత్రి మహమూద్‌ అలీకి కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్‌ రావడంతో ఆయన ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు.

కరోనాతో ఆయన అపోలో ఆస్పత్రిలో చేరిన సంగ‌తి తెలిసిందే. అయితే అంత‌కుముందే స్వ‌ల్ప అస్వ‌స్థ‌త‌తో ఉండ‌టంతో కుటుంబ‌ స‌భ్యులు ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా మహమూద్‌ అలీని ఆస్పత్రికి త‌రలించారు. ఈ నేప‌థ్యంలో శుక్రవారం కోలుకొని ఇంటికి వెళ్లారు. కరోనా బారిన పడిన ఆయన కుటుంబ సభ్యులు కూడా కోలుకొని శుక్రవారం డిశ్చార్జ్‌ అయ్యారు.

అందరి ప్రార్థనలతో తాను త్వరగా కోలుకున్నానంటూ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. తాము త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు అని మంత్రి తెలిపారు. ఇప్పటికే ఆయన సిబ్బందిలో ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. కాగా ఇప్ప‌టికే ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాద‌గిరి రెడ్డి, గ‌ణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్‌, డిప్యూటీ స్పీక‌ర్ టి.ప‌ద్మారావు క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలి‌సిందే.

తాజాగా ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత కరోనా బారిన పడ్డారు. జలుబు, దగ్గు రావడంతో ఆమె యశోద ఆస్పత్రిలో కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకున్నారు. ఈ పరీక్షలో ఆమెకు పాజిటివ్ అని తేలింది. దీంతో సునీత అక్కడే చికిత్స తీసుకుంటున్నారు.

ఆలేరు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని ఆమె కోరారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని..చికిత్స కొనసాగుతుందన్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దయ, ఆలేరు ప్రజల అభిమానంతో కరోనా నుంచి కోలుకుని త్వరలోనే ప్రజల ముందుకు వస్తానని ఆమె తెలిపారు.

Categories
Telangana

3,726 శాంపిల్స్ లో 2,672 మందికి కరోనా పాజిటివ్…ప్రైవేట్ ల్యాబ్ రిపోర్ట్స్ పై తెలంగాణ ప్రభుత్వం సీరియస్

హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ల్యాబ్ రిపోర్ట్స్ పై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రైవేట్ ల్యాబ్ చేసిన పరీక్షలో అత్యధికంగా కరోనా పాజిటివ్ రిపోర్టు వచ్చినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. 3,726 శాంపిల్స్ లో 2,672 మందికి కరోనా పాజిటివ్ ఇచ్చింది. 71.7 శాతం కరోనా పాజిటివ్ రిపోర్ట్స్ ఇచ్చింది.

ఈ ల్యాబ్ ఇచ్చిన ఫలితాలను మరోసారి తెలంగాణ ప్రభుత్వం పరిశీలించనుంది. వెంటనే ల్యాబ్ ను పరిశీలించాలని ఎక్స్ పర్ట్ కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. రిపోర్టులను ఎక్స్ పర్ట్ కమిటీ పరిశీలించే వరకు ఆ ల్యాబ్ ఇచ్చిన ఫలితాలను తాత్కాలికంగా పరిగణనలోకి తీసుకోలేదని ప్రభుత్వం ప్రకటించింది.

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనేవుంది. రాష్ట్రంలో కరోనా కేసులు 20 వేల దాటాయి. రాష్ట్రంలో కొత్తగా 1,892 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయ. ఒక్క జీహెచ్ ఎంసీలోనే 1,658 కేసులు నమోదు కావడం గమనార్హం. శుక్రవారం (జులై 3, 2020) కరోనాతో ఎనిమిది మంది మృతి చెందారు.

తెలంగాణలో కరోనా నుంచి కోలుకుని మరో 1,126 మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 20,462కు చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 283కు చేరుకున్నాయి. రాష్ట్రంలో 9,984 మంది బాధితులు కరోనాతో పోరాడుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 10, 195 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

మరోవైపు ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత కరోనా బారిన పడ్డారు. జలుబు, దగ్గు రావడంతో ఆమె యశోద ఆస్పత్రిలో కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకున్నారు. ఈ పరీక్షలో ఆమెకు పాజిటివ్ అని తేలింది. దీంతో సునీత అక్కడే చికిత్స తీసుకుంటున్నారు.

ఆలేరు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని ఆమె కోరారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని..చికిత్స కొనసాగుతుందన్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దయ, ఆలేరు ప్రజల అభిమానంతో కరోనా నుంచి కోలుకుని త్వరలోనే ప్రజల ముందుకు వస్తానని ఆమె తెలిపారు.

Categories
Telangana

ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతకు కరోనా

తెలంగాణలో మరో ప్రజాప్రతినిధికి కరోనా సోకింది. ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత కరోనా బారిన పడ్డారు. జలుబు, దగ్గు రావడంతో ఆమె యశోద ఆస్పత్రిలో కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకున్నారు. ఈ పరీక్షలో ఆమెకు పాజిటివ్ అని తేలింది. దీంతో సునీత అక్కడే చికిత్స తీసుకుంటున్నారు. ఆలేరు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని ఆమె కోరారు.  తాను ఆరోగ్యంగానే ఉన్నానని..చికిత్స కొనసాగుతుందన్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దయ, ఆలేరు ప్రజల అభిమానంతో కరోనా నుంచి కోలుకుని త్వరలోనే ప్రజల ముందుకు వస్తానని ఆమె తెలిపారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరోనా వైరస్ చాపకింద నీరులాగా వ్యాపిస్తోంది. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతకు కరోనా పాజిటివ్ గా తేలినట్లు ఆమెనే ప్రకటించారు. రెండు రోజుల క్రితం జలుబుతో బాధపడుతున్న సునీత దంపతులు స్వచ్ఛందంగా వారే హైదరాబాద్ లో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి టెస్టులకు శాంపిల్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వారితోపాటు వారి కింద పని చేస్తున్న సిబ్బందికి సంబంధించిన శాంపిల్స్ ను కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.

అయితే శుక్రవారం హైదరాబాద్ నుంచి వెలువడిన ఫలితాలు వచ్చిన సమాచారం ప్రకారం గొంగిడి సునీతతోపాటు ఆమె కింద పని చేస్తున్నవంటి సహాయకులకు ఇద్దరు కలుపుకుని మొత్తం ముగ్గురికి పాజిటివ్ గా తేలింది. మొత్తం తొమ్మిది సహాయకులకు కూడా శాంపిల్స్ సేకరిస్తే అందులో ఇద్దరికీ పాజిటివ్ అని తేలినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆమె భర్త డీసీసీబీ జిల్లా చైర్మన్ గా గొంగిడి మహేందర్ రెడ్డికి ఇంకా ఫలితం రావాల్సివుందని ఆమె ప్రకటించారు.

అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేసింది. అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దు. ఇప్పటికే ప్రారంభ దశలో ఉంది. చికిత్స అందిస్తున్నారు. అలాగే తాను ఆరోగ్యంగా ఉన్నాను. పూర్తి స్థాయి లక్షణాలు లేవు కాబట్టి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో మళ్లీ మీ ముందుకు వస్తానని చెప్పి ఆమె ప్రకటించారు.

అయితే ఇటీవలి కాలంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కేసుల సంఖ్య పెరుగుతోంది. కొంత కాలంగా స్తబ్థదంగా ఉన్నా జిల్లాలో మళ్లీ కేసుల సంఖ్య ఇప్పటివకే వంద దాటింది. జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులతోపాటు ఇతర యంత్రాంగానికి కూడా కేసులు నమోదువుతున్న నేపథ్యంలో ఆందోళన పరిస్థితి కనిపిస్తోంది. అయితే అధికారులు మాత్రం ఆయా ప్రాంతాలను అప్రమత్తం చేశారు.

ముఖ్యంగా శానిటైజర్ కు సంబంధించిన అంశాలు, మాస్క్, సోషల్ డిస్టెన్స్ పై అవగాహన కల్పిస్తున్నారు. అదే సమయంలో చాలా చోట్ల వ్యాపార వర్గాలు స్వచ్ఛందంగా లాక్ డౌన్ ప్రకటించుకున్నారు. సమయాన్ని తమంటకు తాము కుదదించుకుని మధ్యాహ్నానికే షాపులు బంద్ చేస్తూ అప్రమత్తంగా ఉన్నారు.

Categories
Telangana

తెలంగాణలో 20, 462 కరోనా కేసులు…283 మంది మృతి

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనేవుంది. రాష్ట్రంలో కరోనా కేసులు 20 వేల దాటాయి. రాష్ట్రంలో కొత్తగా 1,892 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయ. ఒక్క జీహెచ్ ఎంసీలోనే 1,658 కేసులు నమోదు కావడం గమనార్హం. శుక్రవారం (జులై 3, 2020) కరోనాతో ఎనిమిది మంది మృతి చెందారు. తెలంగాణలో కరోనా నుంచి కోలుకుని మరో 1,126 మంది డిశ్చార్జ్ అయ్యారు.

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 20,462కు చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 283కు చేరుకున్నాయి. రాష్ట్రంలో 9,984 మంది బాధితులు కరోనాతో పోరాడుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 10, 195 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రంగారెడ్డి 56, మేడ్చల్ 44, వరంగల్ రూరల్ 41, సంగారెడ్డి 20, నల్గొండ 13, మహబూబ్ నగర్ 12, మహబూబాబాద్‌ 7, కామారెడ్డి 6, సిరిసిల్ల 6, వనపర్తి 5, భద్రాద్రి కొత్తగూడెం 4 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.

సిద్దిపేట 3, నిజమాబాద్‌ జిల్లాలో 3, మెదక్‌‌ 3, ఖమ్మం 2, నిర్మల్‌ 2, వరంగల్‌ అర్బన్‌ 1, కరీంనగర్‌ 1, గద్వాల 1, వికారాబాద్‌ 1, నాగర్‌కర్నూల్‌ 1, జగిత్యాల 1, ములుగు 1 చొప్పున కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

Categories
Telangana

ప్రైవేట్ కు అప్పజెప్పేలా విద్యుత్ బిల్లు..రాష్ట్రాల హక్కులకు తీవ్ర భంగం : మంత్రి జగదీశ్ రెడ్డి

విద్యుత్ రంగాన్ని ప్రైవేటుకు అప్పజెప్పేలా ఉండటంతో బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. రాష్ట్రాల హక్కులకు కూడా బిల్లుతో తీవ్ర భంగం కలుగుతుందన్నారు. రాష్ట్రాల హక్కులను ప్రైవేటు పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టేలా బిల్లు ఉందని విమర్శించారు. సమాఖ్య ప్రభుత్వం వ్యవహరించాల్సిన విధంగా కేంద్రం తీరు లేదని అసహనం వ్యక్తం చేశారు.

డిస్కమ్ లకు 9.5 శాతం వడ్డీతో అప్పు ఇస్తామన్నారని..8.5 శాతం ఇస్తే బాగుంటుందని తాము సూచించామని తెలిపారు. విద్యుత్ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని.. ఇతర రాష్ట్రాలు కూడా వ్యతిరేకిస్తున్నాయని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్, కేరళ, పంజాబ్, రాజస్థాన్ మన అభిప్రాయాలతో ఏకీభవించాయని చెప్పారు. మార్పులు చేస్తామని కేంద్రం చెప్పింది.. కానీ చేతల్లో కనిపించలేదని విమర్శించారు. సవరించిన ముసాయిదా తమకు అందలేదన్నారు.

విద్యుత్ బిల్లుపై కేంద్ర విద్యుత్ శాఖా మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారని.. వివిధ అంశాలపై అభిప్రాయాలు సేకరించారని జగదీశ్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రానికీ, ప్రజలకూ ఉపయోగపడే విధంగా బిల్లు లేదని సీఎం కేసీఆర్ గతంలోనే ప్రధానికి లేఖ రాశారని గుర్తు చేశారు. రాయితీలు పొందే వారికి, రైతాంగానికి బిల్లుతో తీవ్ర నష్టం వస్తుందన్నారు. చిన్న చిన్న వినియోగాదారులు సబ్సిడీలను కోల్పోతారని పేర్కొన్నారు. విద్యుత్ బిల్లును వ్యతిరేకించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించిందని తెలిపారు.

భద్రాద్రి పవర్ ప్లాంట్ రెండో యూనిట్ కు 270 మెగావాట్లు అనుసంధానించామని తెలిపారు. రెండో ప్లాంటు నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైందని అన్నారు. కొందరు కోర్టుల్లో కేసులు వేయడం వల్ల ఆలస్యమైందని పేర్కొన్నారు. మరో నెలన్నరలో మూడో యూనిట్ ను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. భద్రాద్రిలో పూర్తి స్థాయిలో 1080 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు.

Categories
Andhrapradesh Latest Telangana

తెలుగు రాష్ట్రాల్లో కరోనా ‘కొవాగ్జిన్’ టీకా క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతి

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కు గ్రీన్ సిగ్నల్స్ వచ్చేసింది. తెలంగాణలో నిమ్స్ ఆస్పత్రికి ఏపీలో విశాఖ కేజీహెచ్ ఆస్పత్రికి క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు ICMR పర్మిషన్ ఇచ్చేసింది. అనేక వ్యాధులకు వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహించిన అనుభవం ఉండటంతో నిమ్స్, కేజీహెచ్‌కు ఐసీఎంఆర్ అనుమతినిచ్చింది. కరోనా చికిత్సకు సంబంధించి ఆగస్టు 15వ తేదీన కొవాగ్జిన్ అనే వ్యాక్సిన్ రాబోతోంది.

భారత్ బయోటెక్, ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో టీకా రాబోతుంది. దీనిపై త్వరితగతిన పరిశోధనలు కూడా జరగాల్సి ఉంది. క్లినికల్ ట్రయల్స్ కూడా జరగాలి. ఇది మనుషులపై ప్రయోగించి సక్సెస్ అయితే మాత్రం ఆగస్టు 15 నుంచి కరోనా వ్యాక్సిన్ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురావాలని ఐసీఎంఆర్, భారత్ బయోటెక్ ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి.
IMCR gives green signal for Covid-19 Vaccine Clinical Trails in Telugu Statesఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 12 సెంటర్లలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు ఐసీఎంఆర్ పర్మిషన్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో నిమ్స్, ఏపీలో విశాఖ కేజీహెచ్ లో అనుమతులు ఇచ్చింది. కేజీహెచ్ ఆస్పత్రిలో వాసుదేవా అనే వైద్యున్ని నోడల్ ఆఫీసర్ గా నియమించగా, హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో నోడల్ ఆఫీసర్‌గా వైద్యుడు ప్రభాకర్ రెడ్డిని నియమించడం జరిగింది.

అనుకున్న సమయంలో క్లినికల్ ట్రయల్స్ పూర్తిగా విజయవంతమై.. వచ్చే నెల 15లోగా ఈ ట్రయల్స్ పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత కరోనా వ్యాక్సిన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతున్నట్టు ఐసీఎంఆర్ ప్రకటించింది.

Read:కరోనా వ్యాక్సిన్ కు అడుగు దూరంలో భారత్.. ప్రపంచ దేశాల చూపు మనవైపే

Categories
Latest Telangana

ఖైరతాబాద్ గణేశ్‌పై కరోనా ఎఫెక్ట్.. మరోసారి విగ్రహం ఎత్తులో మార్పు

ఖైరతాబాద్‌ గణేష్‌డు అంటేనే భారీ రూపం. కానీ కరోనా మహమ్మారి చివరికి ఖైరతాబాద్‌ గణేష్‌డిపైనా పడింది. దీంతో ఈ ఏడాది 27 అడుగులకే ఏకదంతుడు పరిమితం కానున్నాడు. 27 అడుగుల మట్టి విగ్రహాన్ని తయారు చేయాలని ఉత్సవ కమిటీ నిర్ణయించింది. ఈసారి భక్తులకు ఆన్‌లైన్‌ దర్శన ఏర్పాట్లను కూడా చేస్తున్నట్టు ఉత్సవ కమిటీ ప్రకటించింది.

ప్రస్తుతం తెలంగాణలో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. ముఖ్యంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో రోజూ పెద్ద ఎత్తున పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు వైరస్‌కు భయపడి పల్లెలకు తరలిపోతున్నారు. బతికుంటే బలుసాకు తినొచ్చంటూ హైదరాబాద్‌ను ఖాళీ చేసేస్తున్నారు. మరోవైపు కరోనా కట్టడికి ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపట్టింది. జనాలు గుడిగూడకుండా చూస్తోంది.

జీహెచ్‌ఎంసీలో కరోనా ప్రతాపం చూపుతుండడంతో… ఖైరతాబాద్‌ గణేష్‌డు కూడా తన రూపాన్ని తగ్గించుకున్నాడు. ఈ ఏడాది 27 అడుగులకే పరిమితం కానున్నాడు. గత ఏడాదితో పోల్చితే 38 అడుగులు విగ్రహ ఆకారం తగ్గింది.

వాస్తవానికి కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ఒక్క అడుగు విగ్రహమే పెట్టాలని ఖైరతాబాద్‌ గణేష్‌ ఉత్సవ కమిటీ నిర్ణయించింది. దీంతో విగ్రహ పనులేమీ మొదలుపెట్టలేదు. అయితే భక్తుల నుంచి ఉత్సవ కమిటీ సభ్యులపై ఒత్తిడి పెరిగింది. భారీ స్థాయిలో కాకపోయినా… కొంచెం తగ్గించైనా గణేష్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న వినతులు వస్తున్నాయి. మరీ ఒక్క అడుగు వద్దని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో ఖైరతాబాద్‌ గణేష్‌ ఉత్సవ కమిటీ ఈ ఏడాది 27 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

గతేడాది 65 అడుగులతో ద్వాదశాదిత్య మహా గణపతిగా ఖైరతాబాద్‌ గణేష్‌డు పూజలు అందుకున్నాడు. ఈ ఏడాది మాత్రం కరోనా నేపథ్యంలో 27 అడుగులకే పరిమితంకానున్నాడు. 27 అడుగులే కనుక పూర్తి మట్టి వినాయకుడిని ఏర్పాటు చేయాలని ఉత్సవ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ 27 అడుగులతో ధన్వంతరి వినాయకుడిని ఏర్పాటు చేయనుంది. భక్తులు భౌతికదూరం పాటిస్తూ దర్శనాలు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తామని ఉత్సవ కమిటీ సభ్యులు చెబుతున్నారు. అంతేకాదు.. ఆన్‌లైన్‌ ద్వారా కూడా దర్శనానికి ఏర్పాట్లు చేయనున్నారు. జులై పది నుంచి మట్టి విగ్రహ నిర్మాణం మొదలు కానుంది.

Read:ప్రగతి భవన్ లో కరోనా కలకలం

Categories
Latest Telangana

ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కరోనా చికిత్స.. ఒక్కో పేషెంటుపై ఖర్చు ఎంతంటే?

తెలంగాణలో కరోనా రోజురోజుకు విస్తరిస్తోంది. బాధితులు అంతకంతకూ పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలతో పాటు ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లోనూ చికిత్స అందించాలని డిసైడ్‌ అయ్యింది. ఒక్కో పేషెంట్‌పై పదివేలు ఖర్చు చేయనుంది. నేటి నుంచే ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో ట్రీట్‌మెంట్‌ ప్రారంభం కానుంది. తెలంగాణలో కరోనా బాధితులకు ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లోని బోధనాసుపత్రుల్లో చికిత్స ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది.

కరోనా చికిత్సకు అవసరమైన మందులు, పీపీఈ కిట్లు, ఇతర అన్ని సౌకర్యాలను సర్కరే ఆయా హాస్పిటల్స్‌కు ఇవ్వనుంది. ట్రీట్‌మెంట్‌కు అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరించనుంది. పేషెంట్ల నుంచి ఒక్క రూపాయి కూడా చేయవద్దని, వాళ్లకు పెట్టే ఆహారానికి డబ్బులు కూడా సర్కారే చెల్లిస్తుందని హాస్పిటల్స్‌కు ఇచ్చిన గైడ్‌లైన్స్‌లో వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.

కరోనా పేషెంట్లకు అవసరమైన మందులు, ఇతర వస్తువుల కోసం ఇండెంట్‌ పెట్టాలని హాస్పిటల్స్‌ సూపరింటెండెంట్లకు సూచించింది. ప్రైవేటులో కరోనా ట్రీట్‌మెంట్‌కు అవసరమైన ప్రోటోకాల్‌ను ఫీవర్‌ హాస్పిటల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ శంకర్‌ తయారు చేస్తున్నారు. అవసరమైన సలహాలు, సూచనల కోసం గాంధీ , నిమ్స్‌ డాక్టర్లను సంప్రదించాల్సిందిగా టీచింగ్‌ హాస్పిటళ్లకు సూచిస్తున్నారు. ఇక కరోనా ట్రీట్‌మెంట్‌కు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చేస్తోన్న ఏర్పాట్లను ఆరోగ్యశాఖ మంత్రి ఈటల పరిశీలించారు. హైదరాబాద్‌లోని కామినేని హాస్పిటల్‌, ఓవైసీ హాస్పిటల్‌ సహా పలు ప్రైవేట్‌ టీచింగ్‌ హాస్పిటల్స్‌ను ఆయన పరిశీలించారు.

ఒక్కో పేషెంట్‌కు రూ. 10వేలు ఖర్చు
గ్రేటర్‌ హైదరాబాద్‌ చుట్టుపక్కలనున్న ప్రైవేట్‌ టీచింగ్‌ హాస్పిటల్స్‌లో కరోనా చికిత్స ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ టీచింగ్‌ హాస్పిటల్స్‌ అందుబాటులోలేని దగ్గర ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ను వినియోగించుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ వైద్యులు రిఫర్‌ చేసిన పేషెంట్లకు మాత్రమే ప్రైవేట్‌లో ట్రీట్‌మెంట్‌ అందించనున్నారు.

ఇందుకోసం ఒక్కో పేషెంట్‌కు కనీం పదివేల వరకు ఆయా హాస్పిటల్స్‌కు చెల్లించాలని ప్రభుత్వం చూస్తోంది. అయితే ఈ అమౌంట్‌పైన ప్రైవేట్‌ యాజమాన్యాలు సుముఖంగా లేనట్టుగా తెలుస్తోంది. పేషెంట్‌ కండిషన్‌ను బట్టి చెల్లించాలని ప్రైవేట్‌ హాస్పిటల్‌ యాజమాన్యాలు కోరుతున్నట్టుగా సమాచారం. త్వరలో ఇదే అంశంలో పూర్తి స్థాయిలో మార్గదర్శకాలను ఇచ్చేందుకు తెలంగాణ ఆరోగ్యశాఖ సన్నద్ధం అవుతోంది.

Read:తెలంగాణలో Rapid Tests..ఇక అరగంటలోనే రిజల్ట్

Categories
Latest Telangana

ప్రగతి భవన్ లో కరోనా కలకలం

తెలంగాణ రాష్ట్రాన్ని కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. సామాన్యుడి నుంచి మొదలుకొని ప్రముఖుల వరకు వైరస్ బారిన పడుతున్నారు. నేతలను కూడా వదలడం లేదు. పాజిటివ్ లక్షణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొంతమంది నేతలు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

తాజాగా ప్రగతి భవన్ లో పనిచేసే సిబ్బందికి కరోనా వైరస్ సోకడంతో కలకలం రేపుతోంది. 2020, జులై 03వ తేదీ గురువారం నలుగురు సిబ్బందికి వైరస్ ఉందని తేలింది. వీరే కాకుండా..ప్రగతి భవన్ లో పనిచేసే మరికొంతమందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 30 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారించారు.

కొంతమందికి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా..మరికొంతమందికి హోం క్వారంటైన్ లో ఉంచారు. ప్రస్తుతం ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు వెల్లడించారు. కరోనా వైరస్ ఉందని తేలడంతో..అధికారులు, వైద్య సిబ్బంది ప్రగతి భవన్ ను శానిటైజ్ చేశారు.

తెలంగాణలో కరోనాతో పాజిటివ్ కేసులు ఎక్కువవుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ప్రధానంగా ghmc పరిధిలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. వైరస్ ను మరింత వ్యాప్తి చెందకుండా కంటైన్ మెంట్ జోన్లను ఏర్పాటు చేయడం, తదితర చర్యలు తీసుకున్నా సత్ఫలితాలు ఇవ్వడం లేదు. రాష్ట్రంలో నమోదయ్యే కేసుల్లో ఎక్కువగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదవుతున్నాయి. మరోవైపు సాధారణ ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు సైతం కరోనా భారిన పడటం ఆందోళన కలిగిస్తోంది.

Read:తల్లి ఫేస్ బుక్ ప్రియులు బిడ్డ ప్రాణాలు తీశారు..వివాహేతర సంబంధమే కారణమా?