ఏపీ ప్రభుత్వానికి కేంద్రం శుభవార్త, త్వరలోనే రూ.3,805 కోట్లు విడుదల

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం విడుదల చేయాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని వైఎస్సార్సీపీ ఎంపి విజయసాయిరెడ్డి కోరారు. రాజ్యసభ సమావేశాల్లో మాట్లాడిన విజయసాయిరెడ్డి..పోలవరం ప్రాజెక్టుని 2021 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనే సంకల్పం పెట్టుకున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాల్సి ఉన్నా..జాప్యాన్ని నివారించేందుకే రాష్ట్రమే సొంత నిధులతో ప్రాజెక్టు కడుతుందన్నారు.

ఇందుకోసం కేంద్రం బకాయి పడిన రూ.3,805 కోట్లు వెంటనే విడుదల చేయాల్సిందిగా కోరారు. ఇందుకు సభలోనే ఉన్న ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ వెంటనే స్పందించారు. ఏపీ ఆర్థికమంత్రితో టచ్‌లో ఉన్నామని చెప్పారు. తొందర్లోనే సమస్యకి పరిష్కారం దొరుకుతుందని బదులిచ్చారు.

రాజ్యసభ సమావేశాల సందర్భంగా మంగళవారం(సెప్టెంబర్ 15,2020) విజయసాయిరెడ్డి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధులపై ప్రస్తావించారు. జాతీయ ప్రాజెక్ట్ పోలవరం ఆంధ్రప్రదేశ్ జీవనాడి అన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ను త్వరగా పూర్తి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కేంద్రం నుంచి నిధుల కోసం చూడకుండా ప్రభుత్వం సొంతంగా ఖర్చు చేస్తోందన్నారు.

కేంద్రం నుంచి రూ. 3,805 కోట్లు బకాయిలు రావాల్సి ఉందని, దీనికి సంబంధించి కాగ్ ఆడిట్ కూడా పూర్తయిందన్నారు. పోలవరంకు సంబంధించి బకాయిలు విడుదల చేయాలని సీఎం జగన్‌ ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశారని తెలిపారు. కేంద్రం నిధులు విడుదల చేస్తే 2021 చివరి నాటికి పోలవరం పూర్తి చేస్తామన్నారు.

వెంటనే పోలవరంకు సంబంధించిన బకాయిలు విడుదల చేయాలని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై నిర్మలా సీతారామన్‌ స్పందిస్తూ.. రాష్ట్ర ఆర్ధిక మంత్రితో బకాయిల చెల్లింపులపై చర్చలు జరుపుతున్నామన్నారు. కాగ్ సర్టిఫికేషన్ వల్ల నిధుల విడుదల ఆలస్యమైందన్నారు. వీలైనంత త్వరగా పోలవరం బకాయిలను విడుదలయ్యేలా చేస్తామని హామీ ఇచ్చారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం ఖర్చు చేస్తున్న మొత్తాన్ని కేంద్రం అన్ని లెక్కలు పరిశీలించాక తిరిగి చెల్లిస్తోంది. కానీ ఈ బకాయిలు ఎప్పటికప్పుడు విడుదల కాకపోవడంతో పనులపై ప్రభావం పడుతోంది. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిల కోసం ఇప్పటికే పలుమార్లు సంప్రదింపులు జరిపిన వైసీపీ ఎంపీలు.. తాజాగా రాజ్యసభలో ఈ అంశాన్ని లేవనెత్తారు.

Related Posts