ఆ కారణంతో దిశ బిల్లును వెనక్కి పంపిన కేంద్రం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

disha bill: మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దిశ బిల్లు-2019ని కేంద్రం వెనక్కి పంపింది. రాజ్యాంగానికి లోబడి బిల్లు లేదని కేంద్రం చెప్పింది. పార్లమెంటులో చట్టసవరణ అవసరమని సమాచారం. ఏపీలో మాత్రమే వర్తించేలా చట్టం చేయలేమని కేంద్రం చెప్పినట్టు తెలుస్తోంది.

దిశ బిల్లులో కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయని.. వాటిని సరి చేయాలని కేంద్రం సూచించినట్లు తెలుస్తోంది. సరిచేసి పంపాలని కేంద్రం సూచనలు చేసినట్లు సమాచారం. ఈ చట్టాన్ని వ్యతిరేకించకపోయినా.. బిల్లు రూపకల్పనలో కొన్ని అంశాలు ఇబ్బందిగా మారినట్లు తెలుస్తోంది. ఐపీసీ, సీఆర్‌పీసీలో మార్పులు చేయకుండా అమలు చేసే పరిస్ధితి లేదంటున్నారు.

ఏపీ అసెంబ్లీలో ఆమోదం సందర్భంగా దిశ బిల్లు.. రాష్ట్రానికి మాత్రమే వర్తించేలా ఐపీసీలో కొత్తగా 354ఈ, 354ఎఫ్‌, 354జీ సెక్షన్లను చేర్చారు. ఐపీసీలో చేసే మార్పుల ప్రకారం ఏపీకి మాత్రమే వర్తింపజేయాలి. నిందితులకు కఠిన శిక్షల కోసం ఐపీసీలో కేవలం ఏపీ వరకే వర్తించేలా సెక్షన్లు మారిస్తే మిగతా రాష్ట్రాలు మార్పులు కోరవచ్చు. అప్పుడు మొత్తం ఐపీసీ అమలే ప్రశ్నార్ధకంగా మారుతుందట.. అంతిమంగా ఐపీసీనే ప్రక్షాళన చేయాల్సి వస్తుంది. అందుకే ఈ బిల్లును తిరస్కరించారనే చర్చ జరుగుతోంది.

కేంద్రం వెనక్కు పంపిన ఈ బిల్లులో తగిన సవరణలు చేసి తిరిగి అసెంబ్లీలో ఆమోదిస్తే కానీ కేంద్రానికి పంపే అవకాశం ఉండదు. దీని కోసం ముసాయిదా సవరణ బిల్లును తీసుకొచ్చి అసెంబ్లీ ఆమోదం పొంది కేంద్రానికి పంపాల్సి ఉంటుంది. అప్పుడు కేంద్రం ఓకే అంటేనే చట్టం అవుతుంది.. లేకపోతే మళ్లీ కథ మొదటికి వచ్చినట్లే.

ఈ బిల్లు ప్రకారం పక్కా ఆధారాలు ఉంటే.. అత్యాచార కేసుల దర్యాప్తును వారం రోజుల్లో పూర్తి చేయడంతోపాటు.. 14 రోజుల్లో కోర్టు విచారణ పూర్తి చేసి.. 21 రోజుల్లోనే శిక్షలు ఖరారవుతాయి. మొన్నటి వరకు ఈ కేసుల విచారణకు 4 నెలల సమయం పడుతుండగా.. ఇక నుంచి మూడు వారాల్లోనే తీర్పు వెలువడుతుంది. అలాగే మహిళలు, చిన్నారులపై నేరాలకు సంబంధించిన కేసుల విచారణ కోసం జిల్లాకో కోర్టు చొప్పున ఏర్పాటు చేయనున్నారు. ఈ న్యాయస్థానాలు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లా పని చేస్తాయి. మహిళలు, చిన్నారులపై జరిగిన నేరాలను మాత్రమే ఈ కోర్టుల్లో విచారణ జరుగుతాయి. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే దిశ పోలీస్ స్టేషన్లు కూడా ప్రారంభమైన సంగతి తెలిసిందే.

దిశ బిల్లు-2019:
* మహిళలు, చిన్నారులను కించపరుస్తూ.. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటారు.
* మొదటిసారి తప్పు చేస్తే రెండేళ్లు, రెండోసారి తప్పు చేస్తే నాలుగేళ్లు జైలుశిక్ష.
* చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడితే ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం గరిష్టంగా ఐదేళ్ల శిక్ష మాత్రమే పడుతుంది.
* కాగా.. నేరాల్లో తీవ్రతను బట్టి వారికి గరిష్టంగా జీవిత ఖైదు విధించేలా బిల్లు రూపొందించారు.
* అసెంబ్లీలో దిశ బిల్లుకు ఆమోదం
* చట్ట రూపం ఇచ్చేందుకు కేంద్రానికి పంపిన జగన్ ప్రభుత్వం

READ  లాక్ డౌన్ : గుజరాత్ లో చిక్కుకుపోయిన తెలుగు జాలర్లు

Related Posts