ఆ మూడు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపే ఛాన్స్ ?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఏపీలో మూడు రాజధానుల రగడ మళ్లీ మొదలైంది. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును గవర్నర్‌తో ఆమోదింపజేసుకునేలా ప్రభుత్వం అడుగులు వేయగా.. దాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని ప్రతిపక్షాలు పోరాటానికి దిగాయి. ఈ మేరకు గవర్నర్‌కు లేఖలు రాశారు. అయితే రాజధాని ఏర్పాటు విషయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికే ఉందని అధికార పార్టీ నేతలు వాదిస్తున్నారు. ఇక గవర్నర్ ఎవరి వైపు మొగ్గు చూపుతారన్న సంశయం అధికార, ప్రతిపక్ష నేతల్లో మొదలైంది.

సీఆర్డీఏ రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులు : –
రాజ్యాంగంలోని 197 అధికారణ, క్లాజ్ 2 ప్రకారం గవర్నర్ ఆమోదం కోసం సీఆర్డీఏ రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులను గవర్నర్ కార్యాలయానికి ఏపీ ప్రభుత్వం పంపించిన సంగతి తెలిసిందే. కాగా ఈ బిల్లులను ఆమోదించవద్దని ప్రతిపక్ష టిడిపి, బిజెపిలు గవర్నర్ కు లేఖలు రాశారు. అయితే పాలనా వికేంద్రీకణకు సంబంధించిన బిల్లు, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను గవర్నర్ ఆమోదిస్తే ఆ తర్వాత చట్టం చేసుకోవచ్చని ప్రభుత్వం ఆలోచిస్తోంది.

సెలక్ట్ కమిటీ అంశం : –
అలాగే రాష్ట్ర రాజధాని ఎక్కడ ఉండాలి అన్నది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదే అని.. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో స్పష్టం చేసిన విషయాన్ని అధికార పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఈ బిల్లులకు మండలిలో ఆమోదం లభించకపోవడం, చర్చ జరగకపోవడం, నెల రోజులు పూర్తయినందున బిల్లులను డీమ్డ్ టూబీ పాస్డ్ చేసినట్లుగా ప్రభుత్వం చెబుతోంది. సెలక్ట్ కమిటీకి నిబంధనల ప్రకారం ఇవ్వనందున కమిటీ ఏర్పాటు కాలేదని, కాబట్టి సెలక్ట్ కమిటీ అన్న అంశమే ఉత్పన్నం కాదని ప్రభుత్వం వాదిస్తోంది.

రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి : –
కాగా పాలనా వికేంద్రీకరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ గట్టిగా చెబుతోంది. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలో రాజధాని నిర్మాణానికి ప్రస్థావన ఉందని, మూడు, నాలుగు రాజధానుల ప్రస్తావన లేదని టీడీపీ వాదిస్తోంది. మూడు రాజధానులు ఏర్పాటు చేయాలంటే రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం సవరణ అవసరమని, చట్ట సవరణ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది కాబట్టి కేంద్రం అనుమతి తీసుకోవాల్సిందేనని అంటోంది.

బిల్లులకు ఆమోదం తెలుపవద్దని లేఖలు : –
ఈ బిల్లులను మండలి ఆమోదించలేదని.. హైకోర్టులో కూడా విచారణ జరుగుతోందని గవర్నర్‌కు తెలిపింది. టిడిపితో పాటు, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి కూడా ఈ బిల్లులకు ఆమోదం తెలపవద్దని లేఖలు రాయడంతో పరిస్థితి రసదాయకంలో పడింది. మరోవైపు ఇరువురి వాదనలను గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ పరిశీలిస్తున్నారు.

బిల్లులకు ఆమోదం తెలిపే ఛాన్స్ : –
ఏ బిల్లులు అయినా చట్టం చేసేందుకు హైకోర్టులో విచారణ అడ్డంకి కాబోదన్నంటున్న న్యాయనిపుణులు, రాజకీయ వేత్తలు… బిల్లుల ఆమోదం వైపే గవర్నర్ మొగ్గు చూపే అవకాశం ఉంటుందని అభిప్రాయ పడుతున్నారు. ప్రభుత్వం చెబుతున్న వివరణల మేరకు గవర్నర్ బిల్లులుకు ఆమోదం తెలిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

రాజ్యాంగ విరుద్ధం: –
కాగా శాసన మండలిలో పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, సిఅర్డిఏ చట్టం రద్దు బిల్లులను ప్రవేపెట్టకుడానే ప్రభుత్వం గవర్నర్ ఆమోదం కోసం పంపించడం రాజ్యాంగ విరుద్ధం హై కోర్టు సీనియర్ అడ్వకేట్ డిఎస్ఎన్వీ ప్రసాద్ బాబు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బిల్లులను శాసన మండలిలో ప్రవేశపెట్టే ముందు మంత్రులు, టిడిపి ఎమ్మెల్సీలు గొడవ పడ్డారని.. దీంతో మండలిలో బిల్లులను ప్రవేశపెట్టలేదని, అలాంటప్పుడు బిల్లులను గవర్నర్ ఆమోదం కోసం ఎలా పంపుతారని ప్రశ్నిస్తున్నారు.

న్యాయపోరాటానికి దిగే యోచనలో టీడీపీ : –
ఏపీలో పొలిటికల్ హీట్ పెంచిన ఈ బిల్లులపై గవర్నర్ కూడా త్వరగానే నిర్ణయం తీసుకొనే అవకాశం వుంది. ఇప్పటికే ఏపీలో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వంతో ఆయన చర్చించినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం తీసుకోవడం ద్వారా రాష్ట్ర బిజెపి నేతలకు కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏంటో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పంపించనున్నారు. ఒకవేళ కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకోకపోతే న్యాయ పోరాటానికైనా దిగాలని టీడీపీ యోచిస్తోంది.

Related Tags :

Related Posts :