Home » కోడెల మృతిపై సీబీఐ దర్యాప్తు చేయించాలి : చంద్రబాబు
Published
1 year agoon
By
veegamteamమాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ భౌతికకాయానికి చంద్రబాబు నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..పల్నాడులో పులిలా బతికిన కోడెల ప్రభుత్వం చేసిన అవమానాలు భరించలేక ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారని ఆవేదన వ్యక్తంచేశారు. కోడెల శివప్రసాద్ మృతిపై సీబీఐతో విచారణ జరిపించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
దేశ చరిత్రలో సీనియర్ నాయకుడిని ఇలా వేధించటం ఎక్కడా జరగలేదన్నారు. కక్ష సాధింపుచర్యలతోనే కోడెల ఆత్మహత్యచేసుకున్నారన్నారు. తప్పు చేసినవారు తప్పించుకుని తిరుగుతుంటే తప్పు చేయనవారిని తప్పు చేశారనే ముద్ర వేసి వేధించి చనిపోయేలా చేశారని ఆరోపించారు. కోడెల మృతిపై తీవ్ర ఆవేదన వ్యక్తంచేసిన చంద్రబాబు ఇంత క్షోభను తానెప్పుడు అనుభవించిలేదన్నారు.
అసెంబ్లీ ఫర్నీచర్ గురించి కోడెల ప్రభుత్వానికి నాలుగు లేఖలు రాశారనీ..కానీ వాటిని ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని..ఆయనపై కేవలం రెండు నెలల్లో 19 కేసులు పెట్టి మానసికంగా కృంగుబాటుకు గురయ్యేలా చేసి ఆఖరికి ఆత్మహత్య చేసుకునేలా చేశారని అన్నారు. జగన్ పాలనలో దుర్మార్గాలు, దోపిడీలు పెరిగిపోయాయనీ..రాష్ట్రంలో హత్యలు, అరాచకాలు నిత్యకృత్యంగా మారిపోయాయన్నారు.
కోడెల ఆత్మహత్య ప్రభుత్వం చేసిన హత్య అంటూ ఆరోపించారు. సీఎం జగన్ వంద రోజుల పాలనలో ఏపీ భ్రష్టుపట్టిపోయిందని విమర్శించారు.