లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

జగన్‌ను ఫాలో అయిన చంద్రబాబు, మాస్టర్ ప్లాన్ సక్సెస్ అయ్యేనా

Published

on

chandrababu follows cm jagan: రాజకీయ చైతన్యం కలిగిన ఆ జిల్లాలో పార్టీ బలోపేతానికి టిడిపి వేసిన మాస్టర్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా. అధికార పార్టీ సామాజిక న్యాయం ముందు ప్రతిపక్ష పార్టీ సామాజిక వర్గ సమీకరణాలు నిలబడతాయా. అధికారంలో ఉన్నప్పుడు విస్మరించిన సామాజిక న్యాయం ప్రతిపక్షంలో అమలు చేస్తే టిడిపి సక్సస్ అవుతుందా. వయోభారంతో సీనియర్లు, ఓటమి భారంతో జూనియర్లు ఉన్న పార్టీలో తాజా నాయకత్వం కొత్త ఉత్సాహాం తెస్తుందా. టిడిపి పార్లమెంట్ ఇన్ చార్జిల నియామకంతో తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్న చర్చేంటి.

సామాజికవర్గ సమీకరణాలకు పెద్ద పీట:
సామాజిక, ఆర్థిక, రాజకీయ చైతన్యం కలిగిన తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ పార్లమెంట్ కమిటీ అధ్యక్షుల నియామకం చర్చనీయాంశంగా మారింది. సామాజికవర్గ సమీకరణాలకు పెద్ద పీట వేస్తూ టీడీపీ అధిష్టానం అధ్యక్షుల నియామకం చేపట్టడమే దీనికి కారణమని అంటున్నారు. జిల్లాలో అధికార పార్టీ అమలు చేస్తోన్న సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని టీడీపీ అధిష్టానం కాకినాడ పార్లమెంట్‌కు ఆ పార్టీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ తనయుడు జ్యోతుల నవీన్‌ను నియమించింది. అమలాపురం పార్లమెంట్‌కు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం సతీమణి రెడ్డి అనంతకుమారి, రాజమహేంద్రవరానికి మాజీ మంత్రి జవహర్‌లను ఇన్‌చార్జీలుగా నియమించింది.

కాపు, బీసీ, ఎస్సీ వర్గాల వ్యక్తులకు పదవులిచ్చిన జగన్:
వారసత్వం, అనుభవం, సామాజిక సమీకరణలు దృష్టిలో పెట్టుకుని ఈ నియామకం చేపట్టింది. పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి టీడీపీ మాస్టర్ ప్లాన్ ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అధికార పార్టీ విషయానికి వస్తే 2019 ఎన్నికల్లో మూడు పార్లమెంట్, 14 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. జిల్లాకు మూడు మంత్రి పదవులను కేటాయించింది. అందులో ఒకటి కాపు, ఒకటి బీసీ, ఒకటి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతలకు ఇచ్చింది. వీటికి తోడు ఇటీవల బీసీ సామాజికవర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు రాజ్యసభ, ఎస్సీ వర్గానికి చెందిన పండుల రవీంద్రబాబుకు ఎమ్మెల్సీ పదవిని కేటాయించింది. తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకు ప్రభుత్వ విప్ కేటాయించారు.

జగన్ ను ఫాలో అయిన చంద్రబాబు:
వీటికి అదనంగా రాజమహేంద్రవరం పార్లమెంట్ పరిధిలో ఉన్న పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే తానేటి వనితకు మరో మంత్రి పదవి కేటాయించారు. ఇప్పుడు టీడీపీ అధిష్టానం కూడా సామాజికవర్గాలకు ప్రాధాన్యం ఇస్తూ ఇన్‌చార్జిల నియామకం చేపట్టింది. అయితే పార్టీ బలోపేతానికి అధిష్టానం వేసిన మాస్టర్ ప్లాన్‌పై టీడీపీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాని సామాజిక న్యాయం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గుర్తు వచ్చిందా అని ఆ పార్టీలోనే కొంతమంది పెదవి విరుస్తున్నారని టాక్‌.

టీడీపీ ఓటమికి జిల్లాకు ఇచ్చిన ప్రాధాన్యమే ప్రధాన కారణం:
2014 ఎన్నికల్లో బీజేపీతో కలిసి 14 అసెంబ్లీ స్థానాలు, మూడు పార్లమెంట్ స్థానాల్లో గెలుపొందిన టీడీపీ… కాపు సామాజికవర్గానికి చెందిన చినరాజప్ప, బీసీ వర్గానికి చెందిన యనమల రామకృష్ణుడుకు మంత్రి పదవులు కేటాయించింది. పశ్చిమగోదావరి జిల్లా కోటాలో కొవ్వూరు ఎమ్మెల్యే జవహర్‌కు మంత్రి పదవి ఇచ్చింది. 2019 ఎన్నికల్లో ఫలితాలు పూర్తిగా తారుమారవ్వడానికి ప్రధాన కారణంగా మంత్రి వర్గ కూర్పులో జిల్లాకు ఇచ్చిన ప్రాధాన్యమే అని పార్టీలో జరుగుతున్న చర్చ. వైసీపీ అధిష్టానం జిల్లాలో అమలు చేస్తున్న సామాజిక న్యాయం చూసి చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా చంద్రబాబు పార్టీ పదవులు కేటాయించారని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.

బీసీ మంత్రం వర్కవుట్ అవుతుందా?
పార్టీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ తనయుడు జ్యోతుల నవీన్‌ను కాకినాడ ఇన్‌చార్జిగా నియమించడం పట్ల పెద్దగా ఎవరికీ అభ్యంతరాలు లేకపోయినా మిగిలిన రెండు నియోజకవర్గాల ఇన్‌చార్జిల నియామకంపై కొంతమంది అసంతృప్తిగా ఉన్నారంటున్నారు. శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన శాసనమండలి డిప్యూటీ చైర్మెన్ రెడ్డి సబ్రహ్మణ్యం సతీమణి రెడ్డి అనంత కుమారిని అమలాపురం పార్లమెంట్ ఇన్‌చార్జిగా నియమించడంపై పార్టీలో పెద్ద చర్చే జరుగుతోంది. అమలాపురం పార్లమెంట్ సెగ్మెంట్‌లో మొదటి స్థానంలో కాపులు, రెండో స్థానంలో ఎస్సీలు ఉండటంతో పాటు మూడు అసెంబ్లీ స్థానాలు ఎస్సీ రిజర్వుడు కావడంతో బీసీ మంత్రం ఎంత వరకు పని చేస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వర్కవుట్ అవ్వడం కష్టమే:
పార్టీలో, ప్రత్యక్ష రాజకీయాల్లో అంతగా యాక్టివ్‌గా లేని రెడ్డి అనంత కుమారిని నియమించడం వల్ల పార్టీకి ఉపయోగం ఏమిటనే వాదన బలంగా వినిపిస్తోంది. సామజికవర్గ రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉండే కోనసీమలో బీసీలకు చెందిన అనంతకుమారి ఎంతవరకు రాణిస్తారనే దానిపై ఆ పార్టీ నాయకులే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాజమహేంద్రవరం పార్లమెంటు ఇన్ చార్జిగా జవహర్ విషయంలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ అనుసరిస్తున్న సామాజిక న్యాయం ముందు టీడీపీ అధిష్టానం సామాజిక వర్గ సమీకరణాలు చెల్లుబాటు కావని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ మాస్టర్ ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందనేది తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *