టీడీపీ నేతలపై పోలీసు కేసులు, అరెస్టులు.. చంద్రబాబు ఫుల్ హ్యాపీ, ఎందుకంటే

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జరుగుతోన్న తాజా రాజకీయ పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నారని అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక టీడీపీకీ చెందిన అనేక మంది నాయకులు, కార్యకర్తలు కేసుల్లో ఇరుక్కున్నారు. పార్టీకి చెందిన దాదాపు 800 మంది కార్యకర్తలు కేసులో ఇరుక్కొని ఇబ్బందులు పడుతున్నారు. వీటిలో ఎక్కువగా సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన కేసులే. అదే విధంగా 33మంది మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలపై కేసులు నమోదయ్యాయి.

ఏడాది కాలంగా తెలుగుదేశం పార్టీలో నిస్తేజం:
ఏడాది కాలంగా తెలుగుదేశం పార్టీలో నిస్తేజం నెలకొని ఉంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో పదవులు ఇవ్వలేదని కార్యకర్తలు, మంత్రి పదవులు ఇవ్వలేదని కొందరు మాజీ ఎమ్మెల్యేలు, ప్రాధాన్యం ఇవ్వలేదని మరికొందరు ఇలా చాలా మంది పార్టీకి దూరంగా ఉంటున్నారు. పదవులు అనుభవించిన నేతలు మాత్రం పత్తా లేకుండా పోయి, హైదరాబాద్ లో తేలారు. పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేయాలని అధిష్ఠానం చెబుతుంటే.. పదవులు అనుభవించిన వాళ్లతోనే చేయించుకోవాలని కొందరు దెప్పిపొడుస్తున్నారట. అందుకే చాలా నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలే అసలు జరగడం లేదు. వీరిని సెట్ చేయటం ఎలా అని చాలా రోజుల నుంచి చంద్రబాబు మదనపడుతున్నారట.

పోలీసు కేసులతో స్ట్రాంగ్ అవుతున్న టీడీపీ:
పార్టీ పునర్నిర్మాణం విషయంలో ఆలోచనలో పడ్డ చంద్రబాబుకు ఇప్పటి పరిస్థితులు కలసి వచ్చాయంటున్నారు. పోలీసులు పెడుతున్న కేసులతో టీడీపీ నేతలు స్ట్రాంగ్ అవుతున్నారనే సమాచారం చంద్రబాబుకు అందింది. మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రల అరెస్ట్‌లతో బీసీ వర్గాలలో అధికార పార్టీపై కొంత వ్యతిరేకత వచ్చిందని, తిరిగి ఆ వర్గాలు తమ పార్టీకి చేరువవుతాయని చంద్రబాబు భావిస్తున్నారట. బలహీనవర్గాలకు చెందిన మాజీ మంత్రి పితాని సత్యనారాయణని కూడా ఈ ప్రభుత్వం టార్గెట్ చేసిందని, ఇది కూడా టీడీపీకి కలసి వస్తుందని భావిస్తున్నారు. అశోక్ గజపతిరాజు మీద కక్ష సాధింపు చర్యలకు దిగడంతో ఆ జిల్లాలో పార్టీకి అనుకూలంగా మారుతుందని టీడీపీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు.

టీడీపీ నేతల సంబరం:
సార్వత్రిక ఎన్నికల తర్వాత పార్టీతో అంటీ ముట్టనట్టు ఉంటున్న నేతలందర్నీ అధికార పార్టీ ఏకం చేసిందని టీడీపీ నేతలు సంబరపడుతున్నారట. దీనికి ఉదాహరణగా గంటా వ్యవహారాన్ని చెబుతున్నారు. నిన్న మొన్నటి వరకూ సైలెంట్‌గా ఉన్న గంటా శ్రీనివాసరావును కూడా అధికార పార్టీ గెలికిందని ఆయన ముఖ్య అనుచరుడు, సన్నిహితుడిని సోషల్ మీడియా కేసులో సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయండంతో గంటా శ్రీనివాసరావు హర్ట్ అయ్యారు. నేరుగా తనపై కేసులు పెట్టుకోవాలని సవాల్ విసిరారు. ఇక, జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిల అరెస్ట్‌తో పెద్దగా సింపతీ రాకున్నా ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న జేసీ కుటుంబం ఇప్పుడు జగన్ ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడుతోంది.

READ  ఖలిస్థాన్‌ ఉగ్రవాది అరెస్టు

నేతల అరెస్టులతో తమకే మంచిదనే భావన:
ఇన్నాళ్లూ పార్టీకి మైనస్‌గా మారిన చింతమనేని ప్రభాకర్‌ వ్యవహారం కూడా ఇప్పుడు అనుకూలంగా మారుతోందని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. వరుస అరెస్టులతో టీడీపీ నేతల్లో కసి ప్రారంభమైందని అధినేత చంద్రబాబు సైతం గుర్తించారు. మరికొంత కాలం ఇదే పద్ధతిని జగన్ ప్రభుత్వం కొనసాగిస్తే, తమకు మంచిదేనన్న అభిప్రాయంలో చంద్రబాబు ఉన్నారంటున్నారు. అందుకే ఆయన రిలాక్సింగ్ మూడ్‌లో ఉన్నారని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన కొందరు నేతలను అరెస్ట్ చేస్తే తమకే మంచిదనే భావనలో ఉన్నారట.

అరెస్టులతో పార్టీకి లాభం జరుగుతుందట:
అధికారంలో ఉన్నప్పుడు కొందరు నేతలు వ్యవహరించిన తీరుని మాత్రం ఇప్పటికీ తెలుగు తమ్ముళ్లు మరచిపోలేక పోతున్నారట. అధికారంలో ఉన్నప్పుడు అత్యుత్సాహం ప్రదర్శించిన కొందరు నేతలపై ఇప్పటికీ ప్రజల్లో వ్యతిరేకత తగ్గలేదని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారు కేసుల్లో ఇరుక్కొని కొన్నాళ్లు జైలుకు వెళితే కొంత వరకూ వారి మీద వ్యతిరేకత తగ్గుతుందని చెబుతున్నారు. దీనివల్ల వారికి, పార్టీకి లాభం జరుగుతుందని కొత్త రకమైన భాష్యాలు చెబుతున్నారు తెలుగు తమ్ముళ్లు. అధికార పార్టీ దెబ్బ రుచి చూసిన వారందరూ ఇప్పుడు టీడీపీ జెండాలు పట్టుకుని బయటకు రావడం ఖాయమని గట్టిగా నమ్ముతోంది టీడీపీ హైకమాండ్. చూడాలి మరి టీడీపీ ఆశలు నెరవేరతాయా? అనుకున్న అంచనాలు చేరుకుంటుందా?

Related Posts