జగన్ బాటలో చంద్రబాబు, వైసీపీ విజయానికి కారణమైన ఆ విధానాన్ని టీడీపీలో అమలు చేసే యోచన

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

పార్లమెంట్‌ నియోజకవర్గ స్థాయిలో కన్వీనర్లను నియమించే ఆలోచనలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ఉందంటున్నారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత జిల్లా పార్టీ కన్వీనర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టిన ఆ పార్టీ… ఆ తర్వాత కాలంలో ప్రశాంత్ కిశోర్ టీం సలహానో, సూచనలో తెలియదు కానీ పార్లమెంట్ స్ధాయిలో కన్వీనర్లను ఏర్పాటు చేసుకుంది. ఇది ఒక రకంగా ఆ పార్టీకి కలసి వచ్చిందనే అభిప్రాయాలున్నాయి. అప్పటి వరకు జిల్లా పార్టీని అధిష్టానం నియమించిన కన్వీనర్ శాసించే వారు. దీనిని పార్టీలోని కొందరు సీనియర్‌ నేతలు జీర్ణించుకోలేక పోవటం, విభేదాల కారణంగా పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ల వ్యవస్థను తీసుకొచ్చింది.

కేసులకు భయపడి టీడీపీని వీడారు:
సీనియర్లకు తలా ఒక పార్లమెంట్ కన్వీనర్ పదవిని కట్టబెట్టి పార్టీ వ్యవహారాలను క్షేత్రస్థాయికి తీసుకువెళ్లడంలో వైసీపీ సక్సెస్ అయ్యింది. ఈ విధానమే 2019 ఎన్నికల్లో ఆ పార్టీ విజయానికి కొంత వరకూ కారణమని రాజకీయ విశ్లేషకుల మాట. మరోవైపు త్వరలో పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయబోతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఇదే విధానాన్ని తీసుకురావాలన్న ఆలోచనలో ఉందంటున్నారు.

ఎన్నికల్లో అధికారం కోల్పోయిన అనంతరం టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆటుపోట్లను చవిచూస్తోంది. టీడీపీ కార్యకర్తలు, నేతలపై అధికార పార్టీ వేధింపులు, కేసులకు భయపడి చాలా మంది పార్టీని వీడిపోగా… మరికొందరు పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు వెనుకడుగు వేస్తున్నారు.

పార్టీకి జవసత్వాలు నింపాలంటే:
జిల్లాల్లో పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్న అధ్యక్షులు చాలా చోట్ల జిల్లా మొత్తం బాధ్యతలను నిర్వహించటంలో విఫలమవుతున్నారు. జిల్లాల్లోని ప్రజా సమస్యలపై పోరాడాలంటే జిల్లా పార్టీ అధ్యక్షుడి అనుమతి తీసుకోవడంలో జాప్యం జరుగుతోంది. పార్టీ నేతల మధ్య కొన్ని అపోహలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్ధితికి చెక్ పెట్టి ఏపీలో పార్టీకి జవసత్వాలు నింపాలంటే పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా కన్వీనర్లను నియమించాలని, వారికి పూర్తి స్థాయి పార్టీ వ్యవహారాలకు సంబంధించిన నిర్ణయాధికారాలు ఇవ్వాలన్న ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉందంటున్నారు.

కన్వీనర్ పదవి కోసం ఆలపాటి రాజా పోటీ:
ఈ నేపథ్యంలో ఇప్పటికే గుంటూరు జిల్లాలోని నేతలు కన్వీనర్ల పదవుల కోసం పావులు కదుపుతున్నారట. గుంటూరు జిల్లాకు సంబంధించి మూడు పార్లమెంట్ స్థానాలున్నాయి. గుంటూరు, నర్సరావుపేట, బాపట్ల పార్లమెంట్ స్థానాలకు పార్టీలోని ఎవరిని కన్వీనర్లుగా నియమించనున్నారన్న దానిపై ప్రస్తుతం చర్చసాగుతోంది. గుంటూరు కన్వీనర్ పదవిని దక్కించుకునేందుకు జిల్లాలోని ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారట. తెనాలి నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన మాజీ మంత్రి ఆలపాటి రాజా గుంటూరు కన్వీనర్ పదవి కోసం పోటీ పడుతున్నారని చెబుతున్నారు.

రేసులో ధూళిపాళ్ల నరేంద్ర:
ఆలపాటి రాజా ఇప్పటికే జిల్లా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. రాజధాని మార్పు నేపథ్యంలో అమరావతి రైతాంగం చేస్తున్న ఉద్యమంలో రాజా అన్నీ తానై వ్యవవహరిస్తున్నారు. అదే క్రమంలో పొన్నూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పేరు సైతం గుంటూరు పార్లమెంట్ కన్వీనర్ పదవి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.

READ  అసెంబ్లీలో కేసీఆర్: ఇద్దరు మహిళలకు మంత్రి పదవులు

నరేంద్ర గతంలో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పని చేసిన అనుభవం ఉండటంతో ఆయనను గుంటూరు పార్లమెంట్ కన్వీనర్‌గా నియమించే ఆలోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. ధూళిపాళ్లను కన్వీనర్‌గా నియమించే విషయంలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది.

రత్తయ్య అయితే బెటర్:
మరోవైపు టీడీపీ సీనియర్ నేత, పత్తిపాడు మాజీ ఎమ్మెల్యే మాకినేని పెదరత్తయ్య పేరు సైతం గుంటూరు పార్లమెంట్ కన్వీనర్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. రత్తయ్యకు కూడా గతంలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. రత్తయ్య అయితే గ్రూపులను సమన్వయం చేసుకుని క్రమశిక్షణతో పార్టీని ముందుకు నడపగలరని పార్టీలోని నేతలు భావిస్తున్నారట. ఇక నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం విషయానికి వస్తే… అక్కడ ఎవరిని కన్వీనర్‌గా నియమించాలన్న దానిపై పార్టీలో తర్జనభర్జనలు పడుతున్నారట.

చంద్రబాబుకి పెద్ద సవాల్:
గతంలో నియోజకవర్గ పరిధిలో ఏం చేయాలన్నా పార్టీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ నిర్ణయానికి అధినేత చంద్రబాబు విలువిచ్చేవారు. ఆయన మరణానంతరం ఎవరిని కన్వీనర్ గా నియమించాలన్నది టీడీపీ అధిష్టానానికి పెద్ద సవాల్‌గా మారింది. గత ఎన్నికల్లో ఎంపీగా పోటీచేసి ఓటమి పాలైన రాయపాటి సాంబశివరావు ప్రస్తుతం టీడీపీలోనే కొనసాగుతున్నప్పటికీ

వయోభారంతో రాజకీయాల్లో అంత చురుకుగా పాల్గొనలేకపోతున్నారు. ఆయన కుమారుడు రంగారావు తన తండ్రి హయాంలో ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ఎలాంటి అవసరం ఉన్నా అందుబాటులో ఉంటూ వ్యవహారాలన్నీ చక్కబెట్టేవారు. కానీ, రంగారావు నరసరావుపేట పార్లమెంట్ కన్వీనర్ పదవి కన్నా సత్తెనపల్లి ఇన్‌చార్జి పదవి ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది.

పదవిని ఆశిస్తున్న వారిలో జీవీఎస్:
ప్రస్తుతం గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జీవీఎస్ ఆంజనేయులు పేరు సైతం నరసరావుపేట కన్వీనర్ పదవి రేసులో కీలకంగా వినిపిస్తోంది. తన నియోజకవర్గం నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోనే ఉండటం, ఆర్థికంగా బలమైన వ్యక్తి కావటంతో ఆంజనేయులుకు ఆ భాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో అధిష్టానం ఉందంటున్నారు. బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం కన్వీనర్ పదవి విషయానికి వస్తే ఇది ఎస్సీ రిజర్వ్‌డ్ పార్లమెంట్ కావటంతో ఇక్కడ పార్టీలోని ఎస్సీ నేతలకే దీనిని కట్టబెట్టాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం.

మాల్యాద్రి పార్టీలో ఉన్నారా? లేదా?
గతంలో బాపట్ల నుంచి పోటీ చేసి ఓటమిపాలైన మాల్యాద్రిని పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్‌గా నియమించాలన్న ఆలోచన చేస్తున్నా.. గత కొంతకాలంగా ఆయన పార్టీ కార్యకలాపాల్లో అంత చురుకుగా పాల్గొనటం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీలో ఉన్న కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి అనుయాయుడిగా మాల్యాద్రి ముద్ర పడ్డారు.

READ  కరోనా కేసుల్లో తెలంగాణను ఏపీ దాటిపోనుందా?

మాల్యాద్రి గత కొంత కాలం నుంచి మౌనంగా ఉండటంతో అసలు పార్టీలో ఉన్నారా? లేదా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధిష్టానం బాపట్ల కన్వీనర్‌గా మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు పేరును పరిశీలిస్తోందంట. ఆయన అయితేనే బెటర్ అని పలువురు పార్టీ సీనియర్లు సైతం చంద్రబాబుకు సూచించినట్లు చెప్పుకుంటున్నారు.

ఎస్సీ కోటాలో పదవిని ఆశిస్తున్న తాడికొండ శ్రావణ్ కుమార్:
తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన తాడికొండ శ్రావణ్ కుమార్ పేరు సైతం బాపట్ల పార్లమెంట్ కన్వీనర్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. శ్రావణ్ ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న తాడికొండ ఈ పార్లమెంట్ పరిధిలో లేనప్పటికీ ఎస్సీ సామాజికవర్గం కావటంతో ఆయనను నియమించే విషయంపై అధిష్టానం ఆలోచన చేస్తోందని అంటున్నారు.

మొత్తానికి తెలుగుదేశం పార్టీ చేస్తున్న సరికొత్త కన్వీనర్ల వ్యవస్ధతో గుంటూరు జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు ముగ్గురు కన్వీనర్లు రానున్నారని పార్టీ నేతలు అనుకుంటున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే పార్టీ పరుగులు పెట్టటం ఖాయమని టీడీపీ శ్రేణులు సంబరపడుతున్నాయట.Related Posts