Home » చంద్రునిపై విక్రమ్ ఎక్కడ? : ఈ రోజే కీలకం.. ఫొటోలు తీయనున్న నాసా ఆర్బిటర్
Published
1 year agoon
By
sreehariచంద్రునిపై దాగి ఉన్న రహస్యాలను ప్రపంచానికి తెలియజేసేందుకు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం చివరి దశలో స్తంభించిపోయింది. చంద్రునిపై ల్యాండ్ అయిన విక్రమ్ ల్యాండర్ ఒక్కసారిగా అదృశ్యమైపోయింది. విక్రమ్ నుంచి పూర్తిగా సిగ్నల్స్ కట్ అయ్యాయి. విక్రమ్ సేఫ్ గానే ఉందని ఇస్రో బలంగా నమ్ముతున్నప్పటికీ చంద్రుని ఉపరితలంపై ఎక్కడ ల్యాండ్ అయిందో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఇస్రోకు సాయంగా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA) రంగంలోకి దిగింది.
చంద్రయాన్-2 ప్రయోగం అంతిమ దశకు చేరుకున్న తరుణంలో అదృశ్యమైన విక్రమ్ ల్యాండర్ కోసం నాసా విస్తృతంగా గాలిస్తోంది. నాసా పంపిన ఆర్బిటర్ షెడ్యూల్ ప్రకారం.. మంగళవారం (సెప్టెంబర్ 17)న చంద్రుని ఉపరితలానికి చేరుకోనుంది. విక్రమ్ ల్యాండ్ అయిన ప్రాంతానికి నాసా ఆర్బిటర్ ట్రావెల్ చేయనుంది. చంద్రుని ఉపరితలంపై ల్యాండర్ ఉన్న ప్రాంతాన్ని నాసా ఆర్బిటర్ క్యాప్చర్ చేసి ఫొటోలను రిలీజ్ చేయనుంది. సూర్యకాంతి ప్రభావం కారణంగా ల్యాండర్ ఫొటోలను కాస్త మసకగా (అస్పష్టంగా) కనిపించే అవకాశం ఉందని భావిస్తున్నారు. విక్రమ్ ల్యాండింగ్ ప్రాంతానికి అర్బిటర్ ఎగిరి వెళ్లగలదా? లేదా అనేది స్పష్టత లేదు.
నాసా (ల్యూనర్ రీకానాయేషియన్స్ ఆర్బిటర్ (LRO) విక్రమ్ ల్యాండర్ ఫొటోలను షేర్ చేసే అవకాశం ఉంది. చంద్రయాన్-2లో తలెత్తిన లోపం ఏంటో విశ్లేషించి ఇస్రోకు సమాచారం అందజేయనుంది. చంద్రయాన్-2 ప్రయోగంలో ఇస్రో టార్గెట్ చేసిన విక్రమ్ ల్యాండింగ్ ప్రాంతానికి సంబంధించి అంతకుముందు… ఆ తర్వాతి ఫొటోలను నాసా షేర్ చేయనున్నట్టు LRO ప్రాజెక్టు సైంటిస్టు నోహ్ పెట్రో తెలిపారు. సెప్టెంబర్ 7న చంద్రయాన్-2 ల్యాండర్ చంద్రునిపై ఉపరితలంపై దిగుతున్న సమయంలో ఏమైంది అనేదానికి సంబంధించిన డేటాను LRO సేకరించనుంది.
విక్రమ్ ల్యాండర్ దిగే సమయంలో రాకెట్ నిర్గతవాయువు కారణంగా చంద్రుని వాతావరణంలో మార్పులు సంభవించి ఉన్నట్టు LRO అధ్యయంలో తేలిందని NASA అధికారి ఒకరు తెలిపారు. కొన్ని రోజుల క్రితమే నాసా కూడా విక్రమ్ ల్యాండర్ తో కమ్యూనికేట్ అయ్యేందుకు విఫలయత్నం చేసింది. ల్యాండర్ నుంచి కమ్యూనికేషన్ కోసం రేడియో తరంగాలను వరుసగా పంపింది. అయినప్పటికీ కచ్చితమైన విక్రమ్ ఆచూకీ తెలియలేదు. విక్రమ్ ల్యాండర్ సైలంట్ మోడ్ లోకి వెళ్లి 10 రోజులు గడిచాయి. అప్పటి నుంచి ఇస్రో మరో నాలుగు రోజులుగా ల్యాండర్‌తో కమ్యూనికేషన్స్ కోసం ప్రయత్నిస్తూనే ఉంది.