నాడు నాగవైష్ణవి, నేడు దీక్షిత్ రెడ్డి.. ఈ పసివాళ్లు ఏం తప్పు చేశారు.. ఆందోళన కలిగిస్తున్న చిన్నారుల కిడ్నాప్‌లు, హత్యలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

childrens kidnap and murder: తొమ్మిదేళ్ల చిన్నారి..అమ్మానాన్నలకు ముద్దుల బాబు..ఆడుకుంటానని బైటికి వెళ్లాడు..తెలిసినవాడే కదా అని బైక్ ఎక్కాడు..అంతే చిరునవ్వులు చిందించే ఆ చిన్నారి ఇక రాలేదు.. కరకు గుండెల కసాయి..ప్రాణం తీయడంతో తిరిగిరాని లోకాలకి వెళ్లిపోయాడు. మహబూబా బాద్‌లో విషాదాంతమైన దీక్షిత్ రెడ్డి కథ ఇది..ఇదే కాదు.. పిల్లల చాలా కిడ్నాప్‌ కేసుల్లో ఇదే జరుగుతోంది. కిడ్నాప్ చేసిన రోజే దీక్షిత్‌ని చంపేయడమే కాకుండా, టెక్నాలజీని అడ్డం పెట్టుకుని డబ్బు కోసం నిందితుడు సాగర్ ఆడిన నాటకం ఇప్పుడు ఓ కుటుంబంలో తీరని శోకం మిగిల్చింది.

డబ్బు ఆశతో దీక్షిత్ రెడ్డి దారుణ హత్య:
అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు దారుణ హత్యకి గురవుడంతో దీక్షిత్ రెడ్డి తల్లిదండ్రుల రోదనలకు అంతు లేకుండా పోయింది. ఆదివారం(అక్టోబర్ 18,2020) చిన్నారి దీక్షిత్ రెడ్డిని కిడ్నాప్ చేసిన మందసాగర్ అనే స్థానిక మెకానిక్ ఆ తర్వాత చంపేసినట్లు పోలీసులు నిర్ధారించడంతో..మహబూబాబాద్ మొత్తం షాక్‌కి గురైంది. బాబుని చంపేసిన తర్వాత డబ్బు కోసం కిడ్నాపర్ ఆడిన నాటకం అందరిని మరింత విస్మయానికి గురి చేసింది. ఈ కేసులో 30మంది అనుమానితులను ప్రశ్నించిన పోలీసులు చివరకు కిడ్నాపర్‌ వాడిన టెక్నాలజీతోనే అతన్ని పట్టుకున్నారు.

వీడు మామూలోడు కాదు, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో పోలీసులకు చుక్కలు చూపిస్తున్న కిడ్నాపర్


అడిగినంత డబ్బు ఇస్తామన్నా వదల్లేదు:
తమ కంటిపాప దూరం కావడంతో దీక్షిత్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ బాబుని చంపినవాళ్లని కూడా సజీవదహనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బాబు కన్పించక ముందు ముంచి తీవ్ర ఆవేదనలో మునిగిన తల్లిదండ్రులు మధ్యలో అడిగినంత డబ్బు ఇస్తే వదిలేస్తామని చెప్పడంతో ఎంతో ఆశగా ఎదురుచూసారు. కిడ్నాపర్ ఎక్కడకు రమ్మంటే అక్కడకు డబ్బుతో సహా ఆశగా వెళ్లారు..అదిగో వస్తాడు..ఇదిగో వస్తాడు అని ఆశగా ఎదురుచూస్తున్న దీక్షిత్ తల్లిదండ్రులకు చివరకు గుండెలు పగిలే వార్త తెలీడంతో కుప్పకూలిపోయారు.

పెద్దల మధ్య పంతాలకు చిన్నారులు బలి:
ఈ మధ్యకాలంలో చిన్నారుల కిడ్నాప్‌లు, హత్యలు కలవరం కలిగిస్తున్నాయ్. ఈ నేరాలకు పాల్పడుతున్నది బాధితులకు అతి దగ్గరగా మెలిగిన వారే ఎక్కువగా ఉండటంతో అసలు సమాజం ఎటు పోతోందన్న ఆందోళన కలుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో చిన్నారుల కిడ్నాప్ కేసులు భారీగానే చోటు చేసుకుంటున్నాయ్. వీటి వెనుక మోటో ఏదైనా.. పసి పిల్లల ప్రాణాలు తీయడం తీరని ఆవేదన కలగిస్తోంది.

బాబాయ్ ఆస్తి కోసం తమ్ముళ్ల హత్య:
అనంతపురం జిల్లాలోనూ ఇదే తరహా దారుణం చోటు చేసుకుంది. బాబాయ్ ఆస్తి కోసం ఇద్దరు తమ్ముళ్లని రాము అనే నిందితుడు కిడ్నాప్ చేయడమే కాకుండా హంద్రీనీవా కాలువలో తోసేశాడు. వారిలో శశిధర్ అనే ఆరేళ్ల బాలుడిని పోలీసులు రక్షించగలిగారు.. మోక్షజ్ఞ అనే మూడేళ్ల చిన్నారిని మాత్రంకాపాడలేకపోయారు. ఆస్తి కోసం అన్న కొడుకు చేసిన ఘాతుకాన్ని తెలుసుకున్న చిన్నారుల తల్లిదండ్రులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.

చిన్నాన్న ఇద్దరు కొడుకులు చనిపోతే, చిన్నాన్న వాటా కింద ఉన్న 10 ఎకరాల పొలం కూడా తనకే వస్తుందని ఆశతో రాము ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అసలు ఇలాంటి
ఘటనల్లో కారణం ఎలాంటిదైనా కానీ..బలవుతుంది మాత్రం చిన్నారులే..అతి సన్నిహితంగా మెలిగే వ్యక్తులే ఇలా దారుణాలకు పాల్పడటం సొసైటీలో మారిపోతోన్న ప్రాధామ్యాలకు..కనుమరుగైపోతోన్న విలువలకు
నిదర్శనం.

అతి కిరాతకంగా నాగవైష్ణవి కిడ్నాప్ హత్య, మేనమామే చంపేశాడు:
ఇదే సమయంలో ఉమ్మడి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నాగవైష్ణవి హత్యోదంతం గుర్తుకురాక మానదు. మేనమామ వరసైన వెంకట్రావే వైష్ణవిని కిడ్నాప్ చేయడమే కాకుండా..అత్యంత కిరాతకంగా బాయిలర్‌లో
వేసి మరీ హత్య చేయించాడు. ఈ కేసుతో అప్పట్లో చాలామంది తమ చిన్నారులను బంధువుల దగ్గర వదిలి వెళ్లాలంటేనే ఒకటికి పదిసార్లు ఆలోచించారు. పదేళ్ల క్రితం అంటే 2010, జనవరి 30న నాగవైష్ణవి కారులో స్కూల్ కి వెళ్తుండగా దారిలోనే కారును అడ్డగించిన దుండగులు డ్రైవరును హతమార్చి ఆ చిన్నారిని కిడ్నాప్ చేశారు. పదేళ్ల పసి బాలికను చిత్ర హింసలకు గురిచేసిన కిడ్నాపర్లు.. అనంతరం ఆ చిన్నారిని బాయిలర్‌లో వేసి దారుణంగా హతమార్చినట్టు పోలీసుల విచారణలో తేల్చారు. ఈ కేసులో కోర్టు 79మందిని విచారించిన తర్వాత ప్రధాన నిందితుడు వెంకట్రావ్‌కు జీవితఖైదు విధించింది.

అలానే 2019 జులైలో తూర్పుగోదావరి జిల్లా మండపేటలో జసిత్ కిడ్నాప్ కూడా తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపింది. కిడ్నాప్ చేసిన మూడో రోజుకే బాబు క్షేమంగా తల్లిదండ్రులకు చేరగా..ఆలోపు వారు పడిన టెన్షన్ మాత్రం వర్ణనాతీతం. ఐతే అప్పట్లో బాబు తల్లిదండ్రులకు అత్యంత సన్నిహితులో.. తెలిసిన వారో ఈ కిడ్నాప్ చేసారని ఆరోపణలు వచ్చాయ్.

ఈ సంఘటనలు మాత్రమే కాదు.. తాజాగా చోటు చేసుకుంటున్న సంఘటల్లోనూ దగ్గర బంధువులదో, తెలిసిన వారిదో పాత్ర ఉంటోంది. మొత్తానికి నేరాలన్నీ అలా జరిగాయని..జరుగుతున్నాయని చెప్పలేం. కానీ..90శాతం నేరాలు..ఘోరాలు తెలిసినవారితోనే చోటు చేసుకుంటున్నాయన్నది గణాంకాలు కూడా చెబుతున్న సత్యం. కాబట్టే ..ఎప్పుడేం జరుగుతుందో తెలీని సమాజంలో అనుక్షణం అప్రమత్తంగా ఉండటమే మంచిది.

Related Tags :

Related Posts :