లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

బైడెన్ ప్రమాణం : డ్రాగన్ కంట్రీ కీలక నిర్ణయం

Published

on

China bans Trump cabinet : అమెరికా కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన జో బైడెన్.. చైనా పట్ల ఎలా వ్యవహరించబోతున్నారన్న చర్చ జరుగుతుండగానే డ్రాగన్ కంట్రీ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌లోని మొత్తం 28 మందిపై చైనా నిషేధం విధించింది. ఇందులో మాజీ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో సహా ట్రంప్ జాతీయ భద్రతా సలహాదారు ఓబ్రెయిన్ కూడా ఉన్నారు. ఈ జాబితాలో ఉన్న వ్యక్తులు, వారి కుటుంబ సభ్యులకు ఇకపై చైనా ప్రధాన భూభాగంలోకి ఎంట్రీని నిషేధించారు. హాంకాంగ్, మకావ్, చైనా భూభాగాల్లోకి వీరికి ప్రవేశం ఉండకుండా ఆంక్షలు విధించారు.

అమెరికా-చైనా సంబంధాలను దెబ్బతీసే… చైనా సార్వభౌమత్వానికి విఘాతం కలిగించే చర్యలకు పాల్పడినందుకు వీరిపై నిషేధం విధించినట్లు చైనా ప్రకటించింది. వీరందరినీ యాంటీ చైనా పొలిటీషియన్లుగా అభివర్ణించింది. ఈ 28 మంది తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంతో పాటు తమ ప్రయోజనాలకు భంగం కలిగించారని చైనా ఆరోపించింది. అంతేకాదు చైనా ప్రజలను వీరు అవమానించారని.. కించపరిచారని డ్రాగన్‌ ఆరోపణలు చేసింది.

చైనా నిషేధం విధించిన వారిలో పాంపియో, పీటర్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాతీయ భద్రతా సలహాదారు సి ఓబ్రెయిన్, డేవిడ్ ఆర్ స్టిల్వెల్, మాథ్యూ పాటింగర్, స్టీఫెన్ కె బన్నన్ ఉన్నారు. వీరంతా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అధికారులే. వైట్ హౌస్‌ను వీడే ముందు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ బీజింగ్‌పై చేసిన ప్రకటనే ఈ నిషేధానికి కారణమన్న చర్చ జరుగుతోంది. చైనాలోని ఉగర్ ముస్లింలను అక్కడి ప్రభుత్వం ఊచకోత కోస్తోందని… మారణహోమానికి పాల్పడుతోందని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. దీనికి ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ టీమ్‌ కూడా మద్దతు తెలిపింది.

ఉగర్ ముస్లింల ఊచకోతకు సంబంధించిన సమాచారాన్ని సేకరించాలని… దానిపై విచారణ కొనసాగించాలని విదేశాంగ శాఖను ఇటీవల మైక్ పాంపియో ఆదేశించారు. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని చైనా వాదించడానికి బహుశా ఇదే కారణం కావొచ్చు. ఉగర్ ముస్లింలపై చైనా మారణహోమానికి సంబంధించి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చేసిన ప్రకటనతో తాజా అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ కూడా ఏకీభవించారు. దీన్నిబట్టి చైనా పట్ల ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వ్యవహరించిన తీరుకు బైడెన్ టీమ్‌ వ్యవహరించబోయే తీరుకు పెద్ద తేడా ఏమీ ఉండకపోవచ్చు. ఒకరకంగా ఉగర్ ముస్లింల విషయంలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌ది, తమది ఒకే వాదన అని బైడెన్ టీమ్ స్పష్టం చేసినట్లయింది. అలాంటప్పుడు తాజా చైనా నిర్ణయంపై కొత్త ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది.