ఎట్టకేలకు, అపహరించిన భారతీయులను అప్పగించిన చైనా

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఉత్కంఠకు తెరపడింది. ఆ ఐదుగురు భారతీయులు క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు. అపహరణకు గురైన భారతీయ పౌరులను ఎట్టకేలకు చైనా విడుదల చేసింది. వారిని భారత్ కు అప్పగించింది. ఈ మేరకు భారత భద్రతా దళాలు ప్రకటించాయి. అప్పగింత ప్రక్రియ శనివారం(సెప్టెంబర్ 12,2020) ఉదయం చైనా భూభాగంలోనే చోటుచేసుకుంది. విడుదలైన వారు కిభిథు సరిహద్దు పోస్టు గుండా భారత్‌లోని అరుణాచల్‌ ప్రదేశ్‌కు చేరుకున్నారు. ఇందుకు సుమారు గంట సమయం పట్టింది.

అడవిలో వేటకు వెళ్లి చైనాకి చిక్కారు:
అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన ఐదుగురు యువకులు అడవిలో వేటకు వెళ్లారు. సెప్టెంబర్ 1 నుంచి కనిపించకుండా పోయారు. పొరపాటున వారంతా సెప్టెంబర్‌ 2న వాస్తవాధీన రేఖను దాటి చైనాలోకి ఎంటర్ అయ్యారు. దీంతో చైనా సైన్యం ఆ ఐదుగురిని అదుపులోకి తీసుకుంది.

ముందు తెలీదంది, ఆ తర్వాత ఒప్పుకుంది:
ఇండో టిబెటన్‌ భద్రతా దళాలు స్థానికులను సహాయకులుగా, గైడ్లుగా వినియోగించుకుంటాయి. తమకు అవసరమైన సామగ్రిని, మెక్‌ మోహన్‌ రేఖ వెంబడి ఉన్న సైనిక స్థావరాలకు చేర్చేందుకు కూడా వీరి సాయం తీసుకుంటాయి. ఈ క్రమంలో అరుణాచల్‌ ప్రదేశ్‌లో సుబన్‌సిరి జిల్లా కేంద్రం నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాచో ప్రాంతానికి చెందిన కొందరు దారి తప్పిపోయారు. సరిహద్దుల వెంట వారిని చైనా సైన్యం అపహరించింది. వారు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు భారత సైన్యానికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై భారత ఆర్మీ సంప్రదించగా.. చైనా భద్రతాదళం పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ తొలుత తమకేమీ సంబంధం లేనట్టు వ్యవహరించింది. ఆ తర్వాత ఆ ఐదుగురు తమ ఆధీనంలోనే ఉన్నట్టు మంగళవారం(సెప్టెంబర్ 8న) ప్రకటించింది.

ఇదే విధంగా దారితప్పి భారత భూభాగంలోకి వచ్చిన చైనీయుల పట్ల భారత రక్షణ దళాలు మానవతా దృష్టితో వ్యవహరించటమే కాకుండా.. వారికి వెచ్చని దుస్తులు, ఆహారం అందించి మరీ తిరిగి వెళ్లేందుకు దారి చూపించాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ వేదికలపై మరింత విమర్శలకు గురవుతామనే ఆలోచనతో చైనా దిగి వచ్చినట్టు పలువురు భావిస్తున్నారు.

పార్ట్ టైమ్‌గా ఆర్మీకి సాయం చేస్తుంటారు:
తప్పిపోయిన వారంతా 18-22 ఏళ్ల మధ్య యువకులే. చదువుకుంటూ పార్ట్ టైమ్‌గా ఆర్మీకి సాయం చేస్తుంటారు. ఇందుకుగాను ఆర్మీ వీరికి కొంత మొత్తం చెల్లిస్తుంది. నిర్దిష్ట వ్యవధి ప్రకారం జవాన్లు ఈ క్లిష్ట ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తారు. అంటే కొండ పైకి వెళ్లిన ఒక బృందం తిరిగి రావాలంటే.. మరొక బృందం అక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. ఆయా ప్రాంతాలపై అవగాహన ఉన్న స్థానికులు ఈ కొండల్లో నిర్దిష్ట ప్రాంతాలకు చేరుకోవడంలో ఇండో-టిబెటన్ బోర్డర్ సైనికులకు సహకరిస్తారు. జవాన్లతో కలిసి కిలోమీటర్ల మేర నడిచి, ఎత్తైన కొండలను ఎక్కి.. వారిని అక్కడికి చేర్చిన తర్వాత తిరిగొస్తారు. ఇందుకుగాను ఇండియన్ ఆర్మీ నగదు అందజేస్తుంది. స్థానికంగా చాలా మంది యువకులు దీన్నో పార్ట్ టైమ్ జాబ్‌గా ఎంచుకుంటారు.

వేట, వన మూలికల సేకరణ కోసం వెళ్తుంటారు:
అంతేకాదు, ఫార్వర్డ్ పోస్టుల దగ్గర సరుకును వదిలివేసిన తర్వాత పోర్టర్లు, గైడ్‌లు తరచూ ముసుగు జింకలను వేటాడటానికి, మూలికలను సేకరించడానికి ఎక్కువ ఎత్తుకు వెళతారు. సాంప్రదాయ ఔషధాలైన ముసుగు జింక, గుంబాలకు అంతర్జాతీయ విపణిలో భారీ డిమాండ్ ఉంది. వేట లేదా మూలికలను సేకరించడానికి ప్రయత్నించే క్రమంలో ఈ ఐదుగురు భారత్ భూభాగం దాటి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. మొత్తంగా ఐదుగురు భారతీయులను చైనా తిరిగి అప్పగించింది. దీంతో వారి కుటుంబసభ్యుల్లో ఆనందం వెల్లివిరిసింది.

Related Tags :

Related Posts :