Cinema halls may not open in India until June end

థియేటర్‌లో బొమ్మ పడేదెప్పుడు : సినీ లవర్స్ ఆశలపై నీళ్లు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

సినిమా థియేటర్లు ఇప్పట్లో ఓపెన్‌ అయ్యేలా కనిపించడం లేదు.. దేశవ్యాప్తంగా సినిమా హాళ్లను తెరిచే అంశాన్ని జూన్‌ తర్వాత పరిశీలిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అన్‌లాక్‌-1లో థియేటర్లు ఓపెన్‌ చేస్తారని భావించిన… సినీ లవర్స్‌ ఆశపై నీళ్లు చల్లినట్లైంది. జూన్‌ నెలకు సంబంధించి కొవిడ్-19 కేసుల సంఖ్యను, పరిస్థితిని పరిశీలించిన అనంతరం మాత్రమే సినిమా హాళ్లను ఎప్పుడు తెరిచేదీ నిర్ణయిస్తామని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తెలిపారు.

జూన్‌లోనే థియేటర్లు ప్రారంభించేందుకు అనుమతివ్వాలని.. ప్రభుత్వ నిబంధనల్ని అనుసరిస్తూ జాగ్రత్తగా నడుపుతామని.. చిత్ర నిర్మాతలు, ఎగ్జిబిటర్లు తదితర సంఘాలు ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించాయి. కానీ దేశంలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతుండటంతో.. కేంద్ర ప్రభుత్వం థియేటర్లకు అనుమతివ్వలేదు.. దీంతో ఇప్పట్లో సినిమా హాళ్లు తెరుచుకునే అకాశం లేనట్టే కనిపిస్తుంది. 

దేశవ్యాప్తంగా 9 వేల 500 సినిమా హాళ్లలో కేవలం టికెట్ల అమ్మకం ద్వారా రోజుకు 30 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని.. భారీగా సష్టపోయినప్పటికీ లాక్‌డౌన్‌ నిర్ణయంపై సినీ రంగం సంఘీభావంగా ఉండటాన్ని జవదేకర్‌ ప్రసంసించారు. అయితే లాక్‌డౌన్‌తో నష్టపోయిన థియేటర్ యాజమాన్యాలను ఆదుకోవాలని.. సినీ సంఘాల ప్రతినిధులు మంత్రిని కోరారు.. వేతనాల్లో సబ్సిడీలు, రుణాలపై మూడు సంవత్సరాల పాటు వడ్డీ మాఫీ, పన్నులు, సుంకాల మినహాయింపు, విద్యుత్‌ బిల్లుల కనీస డిమాండు ఛార్జీల మాఫీ తదితర డిమాండ్లను సినీ సంఘాల ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

అయితే వీటిని నెరవేర్చేందుకు ప్రభుత్వంపై అధిక భారం పడుతుందని అన్న మంత్రి, వారి డిమాండ్లను సంబంధిత శాఖల దృష్టికి తీసుకువస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కొవిడ్‌ లాక్‌డౌన్‌ నిబంధనలను దశలవారీగా సడలిస్తూ వస్తోంది. ఈ క్రమంలో కరోనా అన్‌లాక్‌-1 కు సంబంధించి మార్గదర్శకాలను హోంశాఖ ఇటీవల ప్రకటించింది. దీనిలో భాగంగా… ప్రార్థనా స్థలాలు, దేవాలయాలు, హోటళ్లు, రెస్టారెంట్లు మొదలైనవి తెరిచేందుకు అనుమతి నిచ్చింది. కాగా, షాపింగ్‌ మాల్స్‌ జూన్‌ 8 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇక థియేటర్లు, స్విమ్మింగ్‌పూల్‌లు, ఎంటర్‌టైన్‌మెంట్‌ పార్కులు, బార్లు, సమావేశమందిరాలు వంటివి తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు మూసే ఉంచాలని ప్రభుత్వం ప్రకటించింది.  

Read: సోనూసూద్ దేవుడు..అంటూ పూజలు చేస్తున్న అభిమాని

Related Posts