టార్గెట్ కుప్పం, చంద్రబాబు మరో నియోజకవర్గానికి తరలిపోయేలా జగన్ మాస్టర్ ప్లాన్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కొడితే కుంభస్థలాన్ని కొట్టాలన్నది అధికార వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. 151 సీట్లతో రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుని, టీడీపీని చావు దెబ్బ తీసిన వైసీపీ… ఇప్పుడు కొత్త వ్యూహంతో ముందుకెళుతోందట. టార్గెట్ కుప్పం పేరిట ఓ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తోంది. కుప్పంలో టీడీపీ ముఖ్య నేతలను ఆకర్షించడం, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందేలా చూడటం, సంస్థాగతంగా బలపడడం ద్వారా… ప్రతిపక్షాన్ని అక్కడ బలహీనపరచాలన్న వ్యూహాత్మక ఎత్తుగడతో వైసీపీ ముందుకెళుతోందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నుంచి మరో నియోజకవర్గానికి తరలిపోయేలా చేయడమే ఈ యాక్షన్ ప్లాన్‌ అసలు లక్ష్యం అంటున్నారు. విషయం తెలుసుకున్న చంద్రబాబు కుప్పం నేతలతో తరచుగా ఫోన్ లో టచ్‌లోకి వస్తున్నారట. కుప్పం కేంద్రంగా జరుగుతున్న టీడీపీ, వైసీపీ గేమ్ ప్లాన్ ఇప్పుడు సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది.

గట్టిగా ప్రయత్నిస్తే చంద్రబాబుని దెబ్బకొట్టడం కష్టమేమీ కాదు:
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం అంటే టీడీపీ అధినేత చంద్రబాబుకు కంచుకోట. గడచిన ఏడు మార్లు వరుసగా కుప్పం నుంచే బాబు గెలుస్తూ వస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో చంద్రబాబు మెజారిటీ కాస్త తగ్గినా… ఇక్కడ పసుపు జెండా ఎగరడం మాత్రం ఖాయం. ఈ కోటకు బీటలు వేయాలన్నది వైసీపీ తాజా వ్యూహంలా కనిపిస్తోంది. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో కుప్పం ఫలితాల మొదటి రౌండ్లో చంద్రబాబు కాస్త వెనుకబడ్డ అంశం వైసీపీ నేతల మైండ్‌లో బాగా ఫిక్స్ అయిందట. గట్టిగా ప్రయత్నిస్తే బాబును దెబ్బ కొట్టడం పెద్ద కష్టమేమీ కాదని ఇప్పటికీ వైసీపీ నేతలు బలంగా నమ్ముతున్నారట. అందులో భాగంగానే టార్గెట్ కుప్పం అమలు చేస్తున్నారని ఇన్నర్ టాక్.

పట్టున్న టీడీపీ నేతలను లాగేస్తున్నారు:
తమ ప్లాన్ అమల్లో భాగంగా తొలుత పలువురు స్థానిక టీడీపీ నేతలను వైసీపీలోకి లాక్కుంటున్నారట. టీడీపీతో 30 ఏళ్ల అనుబంధం ఉన్న కుప్పం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ ఇటీవలే ఆ పార్టీకి రాంరాం చెప్పి వైసీపీలో చేరారు. ఆయన భార్య ఎంపీపీగా కూడా పని చేశారు. ఇది టీడీపీలో పెద్ద కుదుపుగానే చెబుతున్నారు. జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ శ్యామరాజు సైతం టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఇక మాజీ జడ్పీ చైర్మన్ సుబ్రమణ్యం రెడ్డి త్వరలోనే టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని అంటున్నారు. కుప్పం నియోజకవర్గం ఓ రకంగా బీసీలదే. వన్నెకుల క్షత్రియ, కురబ కులస్తులు గణనీయంగా ఉన్నారు. వీరిపై వైసీపీ దృష్టి సారించిందని అంటున్నారు.

కుప్పంలో బాబుకు మంచి మెజారిటీ కట్టబెట్టే మండలంపై వైసీపీ ఫోకస్:
నియోజకవర్గ పరిధిలోని గుడిపల్లె నుంచి 150 నాయీ బ్రాహ్మణ కుటుంబాలు, కుప్పంలోని సుమారు 150 ముస్లిం కుటుంబాలు ఇటీవలే వైసీపీలో చేరాయి. కుప్పంలో బాబుకు మంచి మెజారిటీ కట్టబెట్టేది గుడిపల్లె మండలం. ఈ మండలం టీడీపీకి పట్టుగొమ్మ. ఇక్కడ నుంచే వలసలు మొదలెట్టడం వైసీపీ అనుసరిస్తున్న వ్యూహాత్మక ఎత్తుగడ. స్థానిక పోరు మొదలైన సమయంలో ఈ ప్లాన్‌కు రూపకల్పన చేసిన వైసీపీ ముఖ్య నేతలు ఇప్పుడు అమలు చేస్తున్నారు. కుప్పం టీడీపీ ఇన్‌చార్జ్‌ చంద్రమౌళి మరణంతో ఆయన తనయుడు భరత్ నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్నారు. కుప్పం అబ్జర్వర్‌గా ఉన్న చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప తరచుగా కుప్పం వస్తున్నారు. ఈ మొత్తం స్కెచ్ వెనుక మంత్రి పెద్దిరెడ్డి ఉన్నారని అంతా అనుకుంటున్నారు.

కేడర్ ను కాపాడుకునేందుకు టీడీపీ నేతల తంటాలు:
స్థానిక టీడీపీ నేతలు రాజీనామా బాట పట్టడంతో జిల్లా టీడీపీ నాయకత్వం కొంత డైలమాలో పడింది. ఎప్పటికప్పుడు సమాచారాన్ని స్థానిక నేతలు చంద్రబాబుకు చేరవేస్తున్నారు. వైసీపీ దూకుడు గ్రహించిన చంద్రబాబు స్థానిక నేతలతో ఫోన్ లో తరచు మాట్లాడుతున్నారట. కుప్పంలో ఏం జరుగుతోందో చెప్పాలని… జిల్లా నాయకులను అడిగి తెలుసుకుంటున్నారట. జూమ్ యాప్ ద్వారా కూడా ఇటీవల స్థానిక నేతలతో చంద్రబాబు మాట్లాడారు. ఈ వ్యవహారాన్ని చక్కదిద్దాలని చంద్రబాబు ఆదేశాలతో కుప్పానికి చేరుకున్న కొందరు జిల్లా స్థాయి నాయకులకు టీడీపీ శ్రేణులు ముఖం చాటేసినట్లు చెబుతున్నారు.

కుప్పం వ్యవహారాలు చూస్తున్న టీడీపీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు కేడర్ ను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారట. వాళ్ల ఇళ్లకు వెళ్లి మరీ పార్టీ మారద్దని కోరుతున్నారట. మరి భవిష్యత్‌లో పరిస్థితులు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.

Related Posts