ఇంకో ప్రమాదం జరగకూడదు… పారిశ్రామిక ప్రమాదాల నివారణకు ఇండస్ట్రియల్‌ సేఫ్టీ పాలసీ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

విశాఖ గ్యాస్‌ దుర్ఘటనలో ఇన్‌హెబిటర్స్‌ (నిరోధం) ఉంటే ఆ ప్రమాదం జరిగేది కాదని సీఎం జగన్ అన్నారు. ఎవ్వరూ పర్యవేక్షణ చేయకపోవడం వల్లే ఈ సమస్య వచ్చిందని చెప్పారు. అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల్లో కాంప్లియన్స్‌ నివేదిక ఇవ్వకపోతే భారీ జరిమానాలు వేస్తారని తెలిపారు. మన దగ్గర ఇక్కడ అలాంటి పరిస్థితి లేదన్నారు. మనం కూడా ఇలాంటి విషయాల్లో కఠినంగా ఉండాలన్నారు. పారిశ్రామిక ప్రమాదాలకు బాధ్యులైన వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఎవరైనా ప్రమాదంలో మరణిస్తే రూ.50లక్షల పరిహారం ఇచ్చేలా విధానంలో పొందుపరచాలని సూచించారు.

పరిశ్రమలు దాఖలు చేసే కాంప్లియన్స్‌ నివేదికలను ఏడాదికి రెండు సార్లు ఇచ్చేలా చూడాలని సీఎం జగన్ అన్నారు. వీటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నామన్న అంశాన్ని సంబంధిత కంపెనీలు బోర్డులపై పెట్టాలన్నారు. థర్డ్‌పార్టీ తనిఖీలు కూడా వీటిపై ఉండాలన్నారు. కేవలం పరిశ్రమల్లోనే కాకుండా ఇండస్ట్రియల్‌ పార్కుల్లో కూడా నిబంధనలు అమలవుతున్నాయా? లేదా? చూడాన్నారు. పర్యవేక్షణ యంత్రాంగం బలంగా ఉండాలని చెప్పారు.

పారిశ్రామిక ప్రమాదాలపై సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో పర్యావరణ శాఖ స్పెషల్‌ చీఫ్‌సెక్రటరీ నీరబ్‌ ప్రసాద్, పరిశ్రమల శాఖ స్పెషల్‌చీఫ్‌ సెక్రటరీ కరికాల వలవన్‌ సహా ఇతర అధికారులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమల్లో తనిఖీలు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. స్పెషల్‌ డ్రైవ్‌ ముమ్మరంగా సాగుతోందని తెలిపారు. వచ్చే రెండు మూడు నెలల్లో ఈ తనిఖీలు పూర్తి చేస్తామన్నారు.

పరిశ్రమల్లో భద్రత, ప్రమాదాలు, కాలుష్య నివారణ అంశాలపై సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. కొత్తగా ఇండస్ట్రియల్‌ సేఫ్టీ పాలసీ తీసుకురావాలని అధికారులు ప్రతిపాదించారు. పరిశ్రమల భద్రత కోసం ప్రస్తుతం ఉన్న రెగ్యులేటరీ వ్యవస్థలన్నీ కూడా ఈ సేఫ్టీ పాలసీ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించారు.

అలాగే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లోని పరిశ్రమలు, ఇండస్ట్రియల్‌ పార్కులను వీటన్నింటినీ సూచిస్తూ ఇండస్ట్రియల్‌ అట్లాస్‌ రూపొందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి పరిశ్రమలు ఏఏ ప్రాంతాల్లో ఉన్నాయన్నదానిపై అట్లాసులో వివరాలు పొందుపర్చారు. పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునేవారు కూడా.. కేటగిరీ ప్రకారం ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలన్నదానిపై ఈ అట్లాస్‌ ద్వారా వివరాలు తీసుకోవచ్చు.

Related Posts