CM jagan review meeting on spandana program

పేదలందరికీ ఇళ్లపట్టాలు..జనవరి 3 నుంచి ఆరోగ్యశ్రీ కార్డులు : సీఎం జగన్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

జనవరి 3 నుంచి ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ ప్రారంభిస్తామని ఏపీ సీఎం జగన్ తెలిపారు. అమరావతిలోని సచివాలయంలో స్పందన కార్యక్రమంపై సీఎం సమీక్ష నిర్వహించారు.

జనవరి 3 నుంచి ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ ప్రారంభిస్తామని ఏపీ సీఎం జగన్ తెలిపారు. మంగళవారం (డిసెంబర్ 31, 2019) అమరావతిలోని సచివాలయంలో స్పందన కార్యక్రమంపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు సీఎం జగన్‌ అధికారులతో చర్చించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఏప్రిల్ నుంచి అన్ని జిల్లాల్లో 2 వేల 59 రోగాలకు ఆరోగ్య శ్రీ సేవలు ప్రారంభం అవుతాయని చెప్పారు. 5 వేల హెల్త్ సబ్ సెంటర్లకు జనవరిలోగా టెండర్లు ఖరారు చేస్తామన్నారు. జనవరి 9న అమ్మఒడి కార్యక్రమం ప్రారంభం అవుతుందని తెలిపారు. ఆర్టీసీ విలీనంతో కొత్త సంవత్సరం ప్రారంభం అవుతోందని చెప్పారు. 50 వేల కార్మికుల కుటుంబాల చిరకాల కోరికను నెరవేరుస్తున్నామని పేర్కొన్నారు. 2020 చారిత్రాత్మక సంవత్సరం కావాలని ఆకాంక్షించారు.

పేదలకు ఇళ్ల పట్టాలతోపాటు ఇళ్ల నిర్మాణం 

పేదలందరికీ ఉగాది నాటికి ఇళ్లపట్టాలు ఇస్తామని స్పష్టం చేశారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా.. ఇళ్లు కూడా కట్టించి ఇస్తామని తెలిపారు. పేదలకు ఇళ్ల పంపిణీ కార్యక్రమం తనకు మాత్రమే కాదు కలెక్టర్లందరికీ నచ్చిన కార్యక్రమం అన్నారు. ఇప్పటివరకూ 22,76,420 మంది లబ్ధిదారులను గుర్తించామని.. ఇంకా 15 వేల ఎకరాలు సేకరించాల్సి ఉందన్నారు. ఉన్న రెండు నెలల సమయంలోనే మొత్తం భూముల గుర్తింపు, సేకరణ పూర్తి కావాలని ఆదేశించారు. ప్రతి జిల్లాలో కనీసం రెండు నుంచి మూడు సార్లు ఉన్నతాధికారులు పర్యటించాలని సూచించారు. జిల్లా అధికారులతో చర్చించి.. ఇళ్లపట్టాలు ఇవ్వడంలో ఉన్న సమస్యలను తీర్చడానికి ప్రయత్నించాలన్నారు. దేవాలయాలు, ఇతర ప్రార్థనా స్థలాలు, విద్య, ఆరోగ్య సంస్థలకు సంబంధించిన స్థలాలు కాకుండా ఇతర భూములను ఇళ్ల పట్టాలకు సంబంధించి పరిశీలన చేయాలని సూచించారు. 

దిశ చట్టం అమలుపై సీఎం జగన్‌ అధికారులకు దిశా నిర్దేశం

దిశ చట్టం అమలుపై సీఎం జగన్‌ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రతి జిల్లాలో మహిళా పోలీస్‌ స్టేషన్‌ను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. మహిళా పోలీస్‌ స్టేషన్‌ ఎక్కడుంది అన్న దానిపై విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు. అందులో సిబ్బందిని బలోపేతం చేయాలని సూచించారు. దిశ చట్టాన్ని అమలు చేయడంలో కలెక్టర్లు, ఎస్పీలు దృష్టిపెట్టాలన్నారు. చిన్నారులపై లైంగిక వేధింపుల లాంటి ఘటనలను తీవ్రంగా పరిగణించాలని అన్నారు. ఉమ్మడి జాబితాలోని అంశం కాబట్టి ప్రభుత్వం చేసిన చట్టాన్ని రాష్ట్రపతి సంతకం కోసం పంపామని.. ఈలోగా మనం తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లా ఎస్పీలు ఓనర్‌షిప్‌ తీసుకుంటే.. మహిళలు, చిన్నారులపై దారుణాలు ఆగుతాయన్నారు. 

READ  తండ్రి వైఎస్ చదివిస్తే..తనయుడు జగన్ జాబ్ ఇచ్చారు

ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో ముగ్గురు ఎస్సైలు, అదనపు ఎస్సైలు

ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో ముగ్గురు ఎస్సైలు, అదనపు ఎస్సైలను పెడుతున్నామని చెప్పారు. బోధనాసుపత్రిలో ఉన్న వన్‌ స్టాప్‌ సెంటర్‌లో ప్రత్యేక ఏర్పాటు చేయాలని… దీనికి పబ్లిసిటీ ఇవ్వాలన్నారు. అందులో కూడా ఒక ఎస్సైని ఉంచుతున్నామని తెలిపారు. పోలీసులు, మహిళా సంక్షేమ అధికారులు కలిసి పనిచేయాలని అన్నారు. దిశ చట్టం అమలు కోసం ఒక ఐపీఎస్‌ అధికారిని ప్రత్యేకంగా పెడుతున్నామని.. అలాగే మహిళా సంక్షేమ శాఖ నుంచి ఐఏఎస్‌ అధికారి, జిల్లాకు ఒక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను ఉంచుతామని చెప్పారు. అలాగే ఫొరెన్సిక్‌ ల్యాబ్‌ల సామర్థ్యాన్నిపెంచుతున్నామని తెలిపారు. విశాఖ, తిరుపతిలో కొత్త ల్యాబ్‌లను నిర్మిస్తున్నామని వెల్లడించారు. ప్రత్యేక కోర్టుల కోసం ఒక్కో కోర్టుకు రూ. 2 కోట్లు చొప్పున రూ. 26 కోట్లు ఇస్తున్నామని.. డబ్బును డిపాజిట్‌ కూడా చేస్తున్నామని చెప్పారు. తప్పులు చేసిన వారిని వెంటనే చట్టం ముందు నిలబెట్టి బాధితులకు న్యాయం కలిగిస్తున్నామన్న విశ్వాసం ప్రజలకు కల్పించాలన్నారు. దిశ కాల్‌ సెంటర్‌, యాప్‌ కూడా ఏర్పాటు చేయాలని.. ఇవన్నీ నెల రోజుల్లోనే సిద్ధం చేయాలని సూచించారు. 

ఇకపై ఇసుక డోర్ డెలివరీ 

ఇకపై ఇసుక డోర్ డెలివరీ చేస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు. ఇసుక డోర్‌డెలవరీపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. కొంతమంది రవాణాదారులు ప్రస్తుత పరిస్థితిని ఆసరాగా తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు సమచారం ఉందని.. వినియోగదారుడికి ఎలాంటి ఇబ్బంది  లేకుండా చూడాలన్నారు. మధ్యవర్తుల ప్రమేయం ఉండకూడదని.. బుక్‌ చేసుకున్న వెంటనే ఇసుక ఇంటికి వచ్చేలా ఏర్పాటు చేయాలని సూచించారు. హైదరాబాద్‌లో మెట్రో వాటర్‌ సప్లై రీతిలో ఇసుక సరఫరా జరగాలన్నారు. కృష్ణా జిల్లాలో జనవరి 2వ తేదీన పైలట్‌ ప్రాజక్టు కింద దీనిని చేపడుతున్నామని చెప్పారు. జనవరి 10న విశాఖ, పశ్చిమ గోదావరి, కడప జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టుగా మొదలుపెడతామని తెలిపారు. జనవరి 20 నాటికి అన్ని జిల్లాల్లో డోర్‌ డెలివరీ ద్వారా ఇసుక అందిస్తామని పేర్కొన్నారు. 

ఇసుక అక్రమ రవాణా, మద్యం అక్రమ రవాణా నిరోధానికి చెక్‌పోస్టుల్లో సీసీ కెమెరాలు

ఇసుక అక్రమ రవాణా, మద్యం అక్రమ రవాణాల నిరోధానికి జనవరి 20 నాటికి 389 చెక్‌పోస్టుల్లో పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు ఉంటాయని తెలిపారు. జూన్‌ 1 నుంచి ఇప్పటివరకూ అక్రమంగా తరలిస్తున్న 50 వేల 348 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 4644 వాహనాలను సీజ్‌ చేశామని చెప్పారు. డిసెంబర్‌లో 2 వేల 159 టన్నుల ఇసుక స్వాధీనం చేసుకుని, 355 వాహనాలను అధికారులు సీజ్‌ చేశారని తెలిపారు. ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి 2వేల 976 కేసులు నమోదు అయ్యాయని చెప్పారు. ప్రతి నెలా 15 లక్షల టన్నుల చొప్పున ఫిబ్రవరి నుంచి 4 నెలల పాటు ఇసుకను రిజర్వ్‌ చేయాలని సూచించారు. జూన్‌లో వర్షాలు ప్రారంభం అయ్యే నాటికి 60 లక్షల టన్నుల ఇసుకను స్టాక్‌ చేయాలని సూచించారు. 
 

READ  జగన్ ను కలిసిన ఆర్ నారాయణమూర్తి: కారణం ఇదే

Related Posts