ఉచ్చు బిగుస్తున్న జగన్, టీడీపీ నేతలను జైలుకి పంపేందుకు స్కెచ్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఒకప్పుడు ఏపీలో చక్రం తిప్పిన టీడీపీ నేతలంతా ఇప్పుడు అవినీతి ఆరోపణల కేసులు ఎదుర్కొంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడ్డారనే విమర్శలు ఎదుర్కొంటున్న వారిపై వైసీపీ అధికారంలోకి రాగానే అవినీతి కేసులు నమోదు చేసింది. ముఖ్యంగా మైనింగ్ మాఫియా పేరుతో అప్పట్లో గుంటూరు జిల్లా గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మీద కేసులు నమోదయ్యాయి. ఆ కేసును దర్యాప్తు చేసిన సీఐడీ… పలు కీలక ఆధారాలను సేకరించిన తర్వాత ఏపీ ప్రభుత్వం 2019 డిసెంబర్ 24న ఆ కేసును సీబీఐకి అప్పగించింది. ఇప్పడు సీబీఐ ఈ కేసు గురించి కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు సీఐడీ నుంచి సేకరించినట్లు సమాచారం. దీన్ని బట్టి యరపతినేని మీద ఉన్న మైనింగ్ కేసులపై సీబీఐ వేగం పెంచినట్లు చెబుతున్నారు.

మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కీలక టీడీపీ నేతలను జైలుకి పంపేందుకు రంగం సిద్ధం:
ప్రభుత్వం మారిన తర్వాత బయటకు వస్తున్న అవినీతి ఆరోపణల్లో ఇప్పటికే కొందరు ముఖ్య నేతలను కేసులు వెంటాడుతున్నాయి. వారందరినీ కటకటాల వెనక్కి పంపించడానికి ప్రస్తుత ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందట. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కొందరు టీడీపీ కీలక నేతలు సైతం ఇప్పటికే కేసులు ఎదుర్కొంటున్న పరిస్థితులున్నాయి. వారిలో ముఖ్యంగా ఈఎస్ఐ స్కామ్‌లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు చిక్కుకున్నారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఏకంగా వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక మొన్నే జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన జేసీ ప్రభాకర్ రెడ్డి… దివాకర్ ట్రావెల్స్ విషయంలో ఫోర్జరీ, నకిలీ పాత్రలు సృష్టించారంటూ కేసులు నమోదైన విషయం తెలిసిందే.

తమ దారికి రానివారి చుట్టూ ఉచ్చు బిగుస్తున్న వైసీపీ:
ఇలా చెప్పుకుంటూ పోతే యనమల రామకృష్ణుడు, అయ్యన్నపాత్రుడు, చింతమనేని ప్రభాకర్ వంటివారితో పాటు కోడెల శివప్రసాదరావుపైన సైతం కొన్ని అవినీతి ఆరోపణ కేసులు నమోదయ్యాయి. మరోపక్క, తమ దారిలోకి రాని టీడీపీ నేతల చుట్టూ ఉచ్చు బిగించేందుకు వైసీపీ సర్కారు నిర్ణయించిందని అంటున్నారు. ప్రకాశం జిల్లాలో మైనింగ్‌ వ్యాపారాలు చేస్తున్న వారిపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే శిద్దా రాఘవరావు లాంటి నేతలు వైసీపీలో చేరిపోయారు. ఇంకా తమ దారిలోకి రాని గొట్టిపాటి రవికుమార్‌ లాంటి నేతల వ్యాపారాలకు సంబంధించిన లైసెన్స్‌లు రద్దు చేసేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోందని అంటున్నారు.

జగన్‌ని వదిలేసి చంద్రబాబుని ఎక్కువగా టార్గెట్ చేశారు.. ఇక బీజేపీ, టీడీపీ దోస్తీ కుదరని పనేనా?


భయపెట్టి వైసీపీలోకి లాక్కుంటున్నారు:
ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టే వారినే టార్గెట్‌ చేస్తూ చర్యలకు ఉపక్రమిస్తోందని టీడీపీ వర్గాలు దుయ్యబడుతున్నాయి. టీడీపీ నేతలను బెదిరించడం ద్వారా తమకు ఎదురు లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని అంటున్నాయి. వివిధ కేసుల్లో ఇరుక్కున్న వారితో పాటు.. మరికొందరిని కేసుల బూచి చూపించి ఇప్పటికే దారిలోకి తెచ్చుకుందని చెబుతున్నాయి. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌, ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే మద్దాల గిరిని కూడా ఇలానే లైన్‌లోకి తెచ్చుకుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మునుముందు ఈ జోరు మరింత తీవ్రం కానుందని అంటున్నారు.

అరెస్ట్ భయంతో టీడీపీ నేతల వెనుకంజ:
ఈ కేసులతో పాటు ఒత్తిళ్ల నేపథ్యంలో టీడీపీ నేతలు చాలా మంది ప్రభుత్వాన్ని విమర్శించేందుకు వెనుకంజ వేస్తున్నారని చెబుతున్నారు. కేసుల్లో ఇరుక్కున్న నాయకులు ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్నారు. మరికొందరు నాయకులైతే పోలీసులు ఎప్పుడు అరెస్ట్ చేస్తారోనన్న భయంతో న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. ఈ విషయంలో టీడీపీ ఎలాంటి ఎత్తుగడలు వేస్తుందో చూడాలి. ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో చాలా సీరియస్‌గానే ఉన్నట్టుగా కనిపిస్తోంది. టీడీపీ నేతలే లక్ష్యంగా జోరు పెంచిందని అంటున్నారు. మరి ప్రభుత్వ ఒత్తిళ్లకు ఇతర నాయకులు కూడా వైసీపీ సర్కారుకు సరెండర్‌ అవుతారో? లేక న్యాయ పోరాటం చేస్తారో? అన్నది వేచి చూడాలి.

Related Tags :

Related Posts :