cm jagan on visakha gas leak incident

విశాఖ గ్యాస్‌ లీక్ బాధితుల ఖాతాల్లోకి రూ.20 కోట్లు, ఎల్జీ పరిశ్రమకు అనుమతి ఇచ్చింది చంద్రబాబే

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

విశాఖ గ్యాస్‌ లీకేజీ బాధితులకు సీఎం జగన్ పరిహారం విడుదల చేశారు. సోమవారం(మే 18,2020) బాధితులతో

విశాఖ గ్యాస్‌ లీకేజీ బాధితులకు సీఎం జగన్ పరిహారం విడుదల చేశారు. సోమవారం(మే 18,2020) బాధితులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాంప్ ఆఫీస్ లో బటన్ నొక్కిన సీఎం జగన్…. ఒకేసారి సుమారు 20వేల మంది గ్యాస్‌ లీకేజీ బాధితుల అకౌంట్లలో రూ.10 వేల చొప్పున మొత్తం రూ.20 కోట్లు జమ చేశారు. 

గ్యాస్ లీక్ బాధ్యులను వదిలిపెట్టేది లేదు:
ఎల్జీ పాలిమర్స్‌ దుర్ఘటనకు బాధ్యులను వదలిపెట్టే ప్రసక్తే లేదని సీఎం జగన్ చెప్పారు. నివేదికలకు అనుగుణంగా చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఎంతటి వారైన విడిచిపెట్టబోమని తేల్చిచెప్పారు. ఎల్జీ పాలిమర్స్ ఘటనపై వేగంగా స్పందించారని.. రెండు గంటల్లోనే ప్రభావిత గ్రామాల నుంచి తరలించామని అధికారులను ఆయన ప్రశంసించారు. మృతులకు కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇచ్చామని.. అవసరమైతే వారికి గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో అవకాశం ఇవ్వాలన్నారు సీఎం జగన్. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం చాలా బాధాకరమన్నారు సీఎం. విశాఖ వంటి దుర్ఘటనలు జరిగితే గత ప్రభుత్వాలు ఎలా స్పందించాయో చూశానన్నారు.

2 గంటల్లోనే గ్రామాల నుంచి ప్రజలను ఖాళీ చేయించారు:
ఎల్జీ పాలిమర్స్‌ ఘటనపై ప్రభుత్వం స్పందించిన తీరు గురించి సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి ఘటన జరిగినప్పుడు ప్రభుత్వం ఎలా స్పందించాలో..  నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చెప్పాను. ఓఎన్జీసీ గ్యాస్ లీకై 22 మంది చనిపోయారు. ఆ ప్రమాదంలో ప్రమాదంలో సంస్థ రూ. 20 లక్షలు,.. కేంద్రం రూ.3 లక్షలు, రాష్ట్రం 2 లక్షలు అందించాయి. ఘటన జరిగినప్పుడు కఠినంగా చర్యలు తీసుకుంటామని.. కంపెనీలకు హెచ్చరిక ఉండేలా ప్రభుత్వాలు స్పందించాలి. ఓఎన్జీసీ ఘటనలో బాధితులకు రూ.కోటి ఆర్థికసాయం ఇవ్వాలని కోరాను. ఎల్జీ పాలిమర్స్ ఘటనలోనూ నాకు అదే గుర్తొచ్చింది. అందుకే ఎక్కడా జరగని విధంగా ప్రభుత్వం వేగంగా స్పందించింది. కలెక్టర్, కమిషనర్‌తో పాటు 110 అంబులెన్స్‌లు కూడా ఘటనా స్థలికి చేరుకున్నాయి. 2 గంటల్లోనే గ్రామాల నుంచి ప్రజలను ఖాళీ చేయించారు. అధికారులు స్పందించిన తీరును అభినందనీయం’’ అని ప్రశంసించారు.

ఏ ప్రభుత్వం కూడా ఇలా స్పందించలేదు, రూ.కోటి పరిహారం ఎక్కడా ఇవ్వలేదు:
”మన ప్రభుత్వం స్పందించినంత వేగంగా ఎక్కడా స్పందించి ఉండరు. బాధితులకు రూ.కోటి పరిహారం ప్రకటించడం కూడా ఎక్కడా జరగలేదు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేలా కమిటీలు వేశాం. కేంద్ర ప్రభుత్వం నుంచి మరో మూడు కమిటీలు వచ్చి పరిశీలించాయి. కంపెనీని ప్రశ్నించాల్సిన అంశాలన్నీ తయారు చేసి వారం సమయం ఇస్తాం. కంపెనీ నుంచి కూడా పూర్తి వివరాలు తీసుకుని కమిటీలు ఇచ్చిన నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటాం. బాధితులకు ప్రత్యేక హెల్త్‌ కార్డులు ఇవ్వాలని సూచించాం. ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీకి సంబంధించి ఈ ప్రభుత్వం ఒక్క అనుమతి కూడా ఇవ్వలేదు. గత ప్రభుత్వమే ఈ కంపెనీకి అనుమతులు ఇచ్చింది. ఘటనకు బాధ్యులైన ఏ ఒక్కరినీ వదలిపెట్టేది లేదు” అని జగన్ అన్నారు.

READ  NCERT Report : ఈస్ట్ ఆర్ వెస్ట్..English is the బెస్ట్

మే 7న విశాఖలో మహా విషాదం:
మే 7న విశాఖ నగరంలో మహా విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ కెమికల్ ప్లాంట్ నుంచి స్టైరీన్ అనే గ్యాస్ లీక్ అయ్యింది. ఈ విషవాయులు కారణంగా 12 మంది చనిపోయారు. వందలాది మంది అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. విషవాయువును పీల్చడంతో స్థానికులు ఎక్కడికక్కడే కుప్పకూలిపోయారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. విషవాయువు ధాటికి పశుపక్షాదులు సైతం చనిపోయాయి. చుట్టుపక్కల ఉన్న పలు చెట్లు మాడిపోయాయి. గ్యాస్ లీకేజ్ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం రూ. కోటి ఎక్స్‌గ్రేషియా అందజేసింది. వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్న వారికి రూ.10 లక్షలు, రెండు మూడు రోజులు చికిత్స అవసరం ఉన్న వారికి రూ. 25 వేలు ఇస్తామని సీఎం జగన్ ప్రకటించారు. గ్యాస్ ప్రభావిత గ్రామాల్లోని ప్రతి కుటుంబానికి రూ.10వేలు ఆర్థిక సాయం చేయడంతో.. పశువులు పోగొట్టుకున్న వారికి రూ.20వేల సాయం అందజేస్తామని తెలిపారు.

Read : ఆర్టీసీ బస్సులు నడపాలని సీఎం జగన్ నిర్ణయం, ప్రైవేట్ ట్రావెల్స్ కూ అనుమతి, కొత్త నిబంధనలు ఇవే

Related Posts