లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

సీఎం జగన్ ఢిల్లీ పర్యటన, ఏం మాట్లాడారు ? ఎలాంటి వినతులు ఇచ్చారు

Published

on

CM Jagan’s visit to Delhi : ఏపీ సీఎం జగన్ హస్తిన పర్యటన ముగిసింది. 2021, జనవరి 19వ తేదీ మంగళవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన సీఎం.. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సమావేశమయ్యారు. సుమారు ఒకటిన్నర గంటపాటు జరిగిన సమావేశంలో సీఎం జగన్ అమిత్‌ షాతో ఏం మాట్లాడారు? రాష్ట్రం కోసం ఎటువంటి వినతులను ఇచ్చారు?

రావాల్సిన నిధులు : –
రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరం ప్రాజెక్టు అంశం, రాష్ట్ర పునర్విభజన చట్టంలోని పలు అంశాలను సీఎం జగన్‌ అమిత్‌ షా దృష్టికి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. సీఎం జగన్‌ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి వెళ్లారు. ప్రాంతాల వారీగా అభివృద్ధిలో సమతుల్యతను సాధించడం కోసం అధికార వికేంద్రీకరణకు ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని అమిత్‌ షాకు తెలిపారు సీఎం జగన్‌. రాజధాని కార్యకలాపాలను వికేంద్రీకరించాలని.., విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధానిని, అమరావతిలో శాసన రాజధానిని, కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేయాలని ప్రణాళిక వేసిందని తెలిపారు. ఆగస్టులో దీనికి సంబంధించిన ఏపీ అన్ని ప్రాంతాల వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధి చట్టం 2020 చేసిందని గుర్తు చేశారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు రీ నోటిఫికేషన్‌ జారీచేయాలని విజ్ఞప్తి చేశారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు అంశాన్ని 2019 ఎన్నికల్లో బీజేపీ తన మేనిఫెస్టోలో పెట్టిన విషయాన్ని కూడా అమిత్‌ షా దృష్టికి తీసుకువెళ్లారు సీఎం జగన్.

ప్రత్యేక హోదా ఇవ్వాలి:-
విజయనగరం జిల్లా సాలూరులో ట్రైబల్‌ యూనివర్శిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 250 ఎకరాలను గుర్తించిందన్నారు. ఈ ప్రాంతం సబ్‌ప్లాన్‌ ఏరియాలో ఉందని, ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ట్రైబల్‌ యూనివర్శిటీ ఏర్పాటుకు తగిన చర్యలను సంబంధితశాఖ తీసుకునేలా చూడాలని అమిత్‌ షాను కోరారు సీఎం. అలాగే, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. ఆర్థికంగా సవాళ్లు ఎదుర్కొంటున్న రాష్ట్రానికి ప్రత్యేక హోదా చాలా అవసరమని, ప్రత్యేక రాష్ట్రానికి ప్రత్యేక హోదా కారణంగా కేంద్రం నుంచి గ్రాంట్లు లభిస్తాయని కోరారు సీఎం జగన్‌. దీనివల్ల ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక భారం క్రమంగా తగ్గుతుందని, కొత్త పరిశ్రమలు రావడంతో పాటు ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపారు.

నిధులు విడుదల చేయాలి :-
ఏపీకి 2014-15 నాటికి 22వేల 948 కోట్ల 76 లక్షల రూపాయల రెవిన్యూ లోటు ఉందని హోం మంత్రికి తెలిపారు సీఎం జగన్‌. కేంద్రం 4వేల 117కోట్ల 89లక్షల రూపాయలను మాత్రమే గుర్తించిందని, అందులో 3వేల 979 కోట్ల 5లక్షల రూపాయలు మాత్రమే విడుదల చేసిందని తెలిపారు. బకాయిలతో పాటు రాష్ట్ర ఆర్ధికశాఖ తెలిపిన 18వేల 830కోట్ల 87లక్షల రూపాయలను విడుదలచేయాలని హోంమంత్రిని కోరారు ఏపీ సీఎం.
ఏపీలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ను లేఖలో వివరించిన సీఎం జగన్‌.. జనవరి 16 నుంచి 332 కేంద్రాల్లో ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు వచ్చే 10 రోజుల్లో ఆరోగ్య సిబ్బంది అందరికీ వాక్సినేషన్‌ పూర్తి చేసే దిశగా రాష్ట్రం చర్యలు తీసుకుంటోందని హోం మంత్రికి తెలిపారు. రాష్ట్రంలో ప్రజారోగ్య రంగాన్ని పటిష్టం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని, నాణ్యమైన వైద్య సేవల కోసం వైద్యులు, నర్సుల సిబ్బంది సంఖ్యను పెంచాల్సి ఉందని తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 13 మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లారు ఏపీ సీఎం వైఎస్ జగన్‌. ఇప్పటికే మూడు కాలేజీలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని, మిగిలిన 13 కాలేజీలను, వాటికి అనుబంధంగా నర్సింగ్‌ కాలేజీలను మంజూరుచేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వాటికి కావాల్సిన ఆర్ధిక సాయం కూడా అందించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.

రైతులకు కనీస మద్దతు ధరలు :-
ఏపీ స్టేట్‌ సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు కేంద్రం చెల్లించాల్సిన 4వేల 282 కోట్ల రూపాయల బకాయిల గురించి అమిత్‌ షాకు తెలిపారు సీఎం జగన్‌. రైతులకు కనీస మద్దతు ధరలను చెల్లింపునకు.. ఆ బకాయిలను విడుదల చేయాలని కోరారు. రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను తిరిగి బలోపేతం చేయాల్సి ఉందని, ఉపాధిహామీ కింద ప్రస్తుతం ఉన్న పనిదినాలు 100 రోజుల నుంచి 150 రోజులకు పెంచాలని కోరారు సీఎం జగన్‌. జాతీయ విపత్తు నిధికింద నివర్‌ సైక్లోన్‌ బాధిత ప్రాంతాల్లో చర్యలకు ఆర్థిక సహాయం చేయాలని సీఎం జగన్‌ కేంద్ర హోంమంత్రిని కోరారు. కేంద్ర బృందం కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిందని, వాటి పునరుద్ధరణ పనులకోసం 2వేల 255కోట్ల 7లక్షల రూపాయలను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

విద్యుత్ రంగం :-
ఏపీ విద్యుత్‌రంగం పునరుత్తేజానికి కేంద్రమే తగిన అందించాలని హోం మంత్రి అమిత్‌ షాను కోరారు సీఎం జగన్. డిస్కంల ఆర్థిక పరిస్థితి సరిగా లేదని, విద్యుత్‌ రంగంలో తీసుకుంటున్న విప్లవాత్మక మార్పులు, సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం తగిన విధంగా సహాయ సహకారాలు అందించాలని కోరారు. కుడిగి, వల్లూరు థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లతో డిస్కంలు 2040 వరకూ ఒప్పందాలు చేసుకున్నాయని, ఇతర విద్యుత్‌ ప్లాంట్లతో పోలిస్తే… ఈ ప్లాంట్ల రేట్లు చాలా అధికంగా ఉన్నాయని తెలిపారు సీఎం జగన్‌.

రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా :-
రాష్ట్రంలో కొత్తగా తీసుకువచ్చిన దిశ బిల్లు, ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టానికి అనుమతి ఇవ్వాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు విజ్ఞప్తి చేశారు సీఎం జగన్‌. దిశ బిల్లుకు, ప్రత్యేక కోర్టుల ఏర్పాటు బిల్లుకు ఆమోదం తెలిపేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం పొందేలా తగిన చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అనుమతులు ఇవ్వాలని సీఎం జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు విజ్ఞప్తి చేశారు. రాయలసీమలోని నాలుగు జిల్లాలు దుర్భిక్ష ప్రాంతాలుగా ఉన్నాయని, వర్షాలు, కృష్ణా నీల్లే వీటికి ఆధారమని తెలిపారు. ప్రజలు వలసల దారిపడుతున్నారని, దీనికోసం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిందని తెలిపారు సీఎం జగన్‌. దీనివల్ల ఆయకట్టు పెరగడం కానీ, కేటాయించిన దానికన్నా ఎక్కువ నీటిని వాడుకోవడం జరగదని హోం మంత్రికి తెలిపారు. పర్యవరణ అనుమతులు వచ్చిన విషయాన్ని కూడా సీఎం జగన్‌ కేంద్రమంత్రి ముందు ఉంచారు. మొత్తమ్మీద.. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా సీఎం జగన్ ఢిల్లీ పర్యటన సాగింది. మంగళవారం రాత్రి అమిత్‌ షాతో సమావేశమైన సీఎం జగన్‌.. బుధవారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌కు పయనమయ్యారు.