దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని ఖరారు చేసిన సీఎం కేసీఆర్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. రామలింగారెడ్డి భార్య సుజాత పేరుని ఎమ్మెల్యే అభ్యర్థిగా కేసీఆర్ ఖరారు చేశారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నారు. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత లేదా కుమారుడు సతీష్‌రెడ్డికి టికెట్‌ దక్కడం దాదాపు ఖాయమనే ప్రచారం జరిగింది. చివరికి రామలింగారెడ్డి భార్య సుజాత పేరుని కేసీఆర్ ఖరారు చేశారు.

సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికపై టీఆర్‌ఎస్‌ దృష్టి సారించింది. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సిన అనివార్యత ఏర్పడింది. దుబ్బాక నియోజకవర్గంలో ఇప్పటికే ఎన్నికల రాజకీయం వేడెక్కింది.

జర్నలిస్టుగా పనిచేసిన రామలింగారెడ్డి 2004, 2008లో దొమ్మాట నుంచి, 2009, 2014, 2018 ఎన్నికల్లో దుబ్బాక నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. 2009 మినహా అన్ని ఎన్నికల్లోనూ రామలింగారెడ్డి గెలుపొందారు. 2018 మినహా అన్ని ఎన్నికల్లోనూ మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి ఆయనకు ప్రత్యర్థిగా పోటీ చేశారు.

2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ముత్యంరెడ్డి గత ఏడాది సెప్టెంబర్‌లో అనారోగ్యంతో మరణించారు. 2018 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీమంత్రి చెరుకు ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాస్‌రెడ్డి కూడా టికెట్‌ కోసం ప్రయత్నాలు సాగించారు.

సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్, మంత్రి హరీశ్‌రావు ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్దిపేట నియోజకవర్గాలకు దుబ్బాక పొరుగునే ఉంది. మంత్రి హరీష్‌రావు దుబ్బాక నియోజకవర్గంలో మండలాలవారీగా విస్తృతంగా పర్యటించి కార్యకర్తలతో భేటీ అయ్యారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల పంపిణీ, చెరువుల్లో చేపలు వదలడం వంటి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

పార్టీ కేడర్‌ చెక్కు చెదరకుండా చూడటంతోపాటు అసంతృప్తుల బుజ్జగింపు, ఇతర పార్టీల నుంచి చేరికలు తదితరాలపై ప్రత్యేక దృష్టి పెట్టి పావులు కదుపుతున్నారు. ఉప ఎన్నికల్లో తనకు కేసీఆర్‌ ఎక్కడ బాధ్యత అప్పగించినా గెలిపించిన విషయాన్ని గుర్తు చేస్తూ కార్యకర్తల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తున్నారు.

Related Posts