బీజేపీ రూపాయి ఇవ్వలేదు.. సాయం చెయ్యనివ్వట్లేదు: కేసిఆర్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

వరద బాధితులకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా సాయం చెయ్యలేదని ముఖ్యమంత్రి కేసిఆర్ అన్నారు. సాయం చెయ్యకపోగా.. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న వరద సాయం ఆపెయ్యాలంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిందని కేసిఆర్ విమర్శించారు. కరోనా వచ్చి, డబ్బులు లేక, ఇబ్బందులు ఉన్నా, మన జీఎస్టీ ఇవ్వకపోయినా ఉన్నంతలో పేదలను ఆదుకుందామని ప్రయత్నం చేస్తుంటే దానికి కూడా బీజేపీ అడ్డుపడిందని ఆయన అన్నారు.బీజేపీ పేదల నోటికాడి కూడు లాక్కుంటుందని కేసిఆర్ అన్నారు. రూపాయి ఇవ్వకుండా బురద రాజకీయం చేస్తుందని, బీజేపీ చేస్తున్న చిల్లర రాజకీయాల్ని గమనించాలని కేసిఆర్ నగర ప్రజలకు పిలుపునిచ్చారు.బీజేపీ ప్రభుత్వం ఇప్పటిదాకా ప్రజలు, రైతులు, దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, కార్మికుల కోసం ఒక్కటంటే ఒక్క పని చేయలేదని, చెప్పుకోవడానికి వారికి ఒక్క మంచి పని లేదని, ఎన్నికలప్పుడు రాజకీయ లబ్ది పొందడానికి మాత్రం పాకిస్తాన్‌, కశ్మీర్‌, పుల్వామా అంటూ ఉంటారని మండిపడ్డారు.ప్రజల భావోద్వేగాలను రెచ్చగొడుతూ వారిని మతపరంగా విభజించే ప్రయత్నం బీజేపీ చేస్తుందని అన్నారు. దేశం కోసం, ప్రజల కోసం వారు ఏ ఒక్క పని చేయలేదని, సరిహద్దుల్లో యుద్ధం తామే చేసినట్లుగా బీజేపీ తప్పుడు ప్రచారం మాత్రం జోరుగా చేసుకుంటుందని విమర్శించారు కేసిఆర్.వరద సాయం కింద తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఇంటికి రూ.10వేలు ఇవ్వాలని నిర్ణయించుకోగా.. ఎన్నికల సంఘం అందుకు ఒప్పుకోకుండా ఉత్తర్వులు విడుదల చెయ్యగా.. దీనిపై కేసిఆర్ స్పందించారు.ఇదే విషయమై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. పేదప్రజలకు 10వేల రూపాయల ఆర్ధిక సహాయం పంపిణీని అడ్డుకున్న ప్రతిపక్షాలకు పేదల ఉసురు తప్పక తగులుతుందని అన్నారు. కరోనా మహమ్మారితో తీవ్ర ఇబ్బందులలో ఉన్న పేద ప్రజలకు భారీ వర్షాలతో మరిన్ని సమస్యలు తోడైతే కష్టాలలో ఉన్న పేద ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే అడ్డుకుంటారా? అని ఆయన ప్రశ్నించారు.

Related Tags :

Related Posts :