CM KCR Decided To Privatize The RTC

ఆర్టీసీ ఇక చరిత్రేనా : సీఎం కేసీఆర్ నిర్ణయంపై ఉత్కంఠ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తెలంగాణలో నెల రోజులకు పైగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెతో… ప్రజా రవాణా వ్యవస్థపై తీవ్రంగా ప్రభావం పడింది. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో సమ్మెకు దిగిన కార్మిక సంఘాలకు ప్రభుత్వం తన ప్రాధాన్యతలను ముందునుంచి స్పష్టం చేస్తూనే వస్తుంది. కార్మికులు లేవనెత్తిన డిమాండ్లు తీర్చడం సాధ్యం కాదని సీఎం కేసీఆర్ చాలాసార్లు తేల్చిచెప్పారు. ప్రతియేటా సంస్థ నష్టాల బారిన పడుతుండటంతో సంస్థను ఆదుకోవడం ప్రభుత్వానికి సాధ్యం కాదని స్పష్టం చేశారు. కార్మికులు బేషరతుగా విధుల్లోకి హాజరైతే వారందరినీ కాపాడుకుంటామని హామీ ఇచ్చారు.

సమ్మెనే ఆర్టీసీకి ముగింపు అనే హెచ్చరించారు. అయినా కార్మికులు ఉద్యోగాల్లో చేరేందుకు పెద్దగా ముందుకు రాలేదు. 2019, నవంబర్ 05వ తేదీ మంగళవారం అర్ధరాత్రి నాటికి ప్రభుత్వం విధించిన గడువు పూర్తికావడంతో ఇక సీఎం కేసీఆర్ నిర్ణయం ఎలా ఉంటుందన్న ఉత్కంఠ నెలకొంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీరియస్‌గా ఉన్న కేసీఆర్… సంస్థ తరపున నడుస్తున్న 10 వేల బస్సుల్లో 5 వేల ఒక వంద రూట్లకు ప్రైవేట్‌ పర్మిట్లు ఇవ్వాలని నిర్ణయించారు. కార్మికుల సమ్మె వీడకపోతే అన్ని రూట్లను ప్రైవేటు అప్పగిస్తామని నాలుగు రోజుల క్రితమే సీఎం తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే.

కార్మికులు సమ్మెకు దిగిన నాటి నుంచి ప్రత్యామ్నాయ రవాణా మార్గాల వైపు ఆసక్తి చూపిస్తున్న ప్రభుత్వం… ప్రాథమికంగా ఐదువేల రూట్లను ప్రైవేటుపరం చేసింది. ఇప్పుడు అన్ని రూట్లలో ప్రైవేటు సంస్థలకే బాధ్యతలు అప్పగించే అంశంపై దృష్టి సారించే అవకాశముంది. ప్రభుత్వం విధించిన గడువులోపు కనీసం పది వేలమంది కార్మికులైనా విధుల్లో చేరతారని అధికార వర్గాలు అంచనా వేశాయి. కానీ.. అతి తక్కువ సంఖ్యలో మాత్రమే కార్మికులు విధుల్లో చేరారు. దీంతో రాష్ట్రంలో వందశాతం ప్రైవేటు బస్సులకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వానికి అవకాశం వచ్చింది. ఇదే నిర్ణయాన్ని ప్రభుత్వం అమలు చేస్తే ఆర్టీసీ రహిత రాష్ట్రంగా తెలంగాణ మారిపోనుంది. ఈ వ్యవహారం ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉండడంతో… నవంబర్ 07వ తేదీ గురువారం ప్రభుత్వ నిర్ణయం అధికారికంగా వెలువడే ఛాన్స్ కనిపిస్తోంది.
Read More : ముగిసిన డెడ్ లైన్ : ఆర్టీసీ ఫ్యూచర్‌పై అయోమయం

Related Posts