బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్, ఏదైనా వ్యూహం ఉందా

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

kcr bihar elections: బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. జేడీయూ, ఆర్జేడీ, బీజేపీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. స్థానికంగా జేడీయూ, ఆర్జేడీలు బలమైన ప్రాంతీయ పార్టీలు కావడంతో జాతీయ పార్టీలు సైతం ఆ పార్టీలతో పొత్తు పెట్టుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆ ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా బిహార్‌ ఎన్నికలపై దృష్టి పెట్టారని అంటున్నారు. ఎప్పటికప్పుడు అక్కడి అప్‌డేట్స్‌ తెలుసుకుంటున్నారని చెబుతున్నారు.

నాలుగోసారి అధికార పీఠాన్ని దక్కించుకోవాలని నితీశ్ పావులు:
మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన నితీశ్‌ కుమార్ నాలుగోసారి అధికార పీఠాన్ని దక్కించుకోవాలని పావులు కదుపుతున్నారు. సీనియర్ నేత లాలూప్రసాద్ తనయుడు తేజస్వి యాదవ్ కాంగ్రెస్ పార్టీ పొత్తుతో ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోవాలని ప్రణాళికలను అమలు చేస్తున్నారు. కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే సర్కార్ ఇటీవల కాలంలో పలు కీలక సంస్కరణలు అమలుకు నిర్ణయం తీసుకుంది. కేంద్ర తీసుకున్న విద్యుత్ సంస్కరణల నిర్ణయంపై తీవ్ర చర్చ జరుగుతోంది.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలపై బిహార్ ప్రజల స్పందన ఏంటి?
వ్యవసాయంపై కేంద్రం తెచ్చిన బిల్లులను తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రాలకు చట్టపరంగా రావాల్సిన నిధులు కేటాయించడం లేదంటూ కేంద్ర వైఖరిపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలపై బిహార్ ప్రజల స్పందన ఎలా ఉంటుందో అన్న అంశంపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. జాతీయ రాజకీయ పరిశీలకులతో బిహార్ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకుంటున్నట్లు సమాచారం. ఢిల్లీలో తనకు సన్నిహితంగా ఉండే మీడియా మిత్రులతో కేసీఆర్ స్వయంగా మాట్లాడుతూ పరిస్థితులు అంచనా వేస్తున్నట్లు చెబుతున్నారు.

బిహార్ అసెంబ్లీ ఫలితాలకు అనుగుణంగా కేసీఆర్‌ వ్యూహాలు:
ఎన్నికల ఫలితాల ఆధారంగా ఎన్డీయే సర్కార్ తదుపరి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. బీజేపీతో కలసి మరోసారి నితీశ్‌ అధికార పగ్గాలు చేపడితే దేశంలో మరిన్ని సంస్కరణలు చేసేందుకు బీజేపీ కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు కేసీఆర్‌ ఆలోచనలు చేస్తున్న నేపథ్యంలో బిహార్‌ ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారని టీఆర్ఎస్‌ నాయకులు అంటున్నారు. అక్కడి ఫలితాలను పరిశీలించిన తర్వాత అందుకు అనుగుణంగా కేసీఆర్‌ వ్యూహాలు సిద్ధం చేస్తారని చెబుతున్నారు.

Related Tags :

Related Posts :