CM KCR Focus On Parliamentary Secretary Posts

మళ్లీ పార్లమెంటరీ కార్యదర్శులు : పదవుల పంపకాలపై ఫోకస్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

హైదరాబాద్ : పార్లమెంటరీ కార్యదర్శుల వ్యవస్థకు మళ్లీ పురుడు పోయాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. మంత్రివర్గంలో అందరికీ స్థానం కల్పించే అవకాశం లేదు. దీంతో కేబినెట్‌ హోదా ఉన్న పార్లమెంటరీ కార్యదర్శులుగా కొందరికి అవకాశం కల్పించాలన్న ఆలోచనలో కేసీఆర్‌ ఉన్నారు. గతంలో కోర్టు అభ్యంతరాలతో ఈ వ్యవస్థ రద్దుకావడంతో.. ఈసారి న్యాయపరమైన సమస్యలు ఎదురుకాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. పదవుల పంపకాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టి పెట్టారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఒక్కో పదవి ఇచ్చేవిధంగా సమాలోచనలు జరుపుతున్నారు.
* సీఎం సహా 18 మందికే మంత్రివర్గంలో స్థానం
* కేబినెట్‌లో మరో 16మందికి చోటు
* పార్లమెంటరీ కార్యదర్శులుగా 12 మందికి చాన్స్‌
* స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌, ప్రభుత్వ చీఫ్‌ విప్‌, విప్‌లు
* మొత్తం 35మందికి పదవులు దక్కే అవకాశం
12మందికి ఆల్టర్‌నేట్ పదవులు:
మంత్రివర్గంలో స్థానం కల్పించాలని చాలామంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కి విన్నవిస్తున్నారు. చట్టప్రకారం ముఖ్యమంత్రి సహా 18 మందికే మంత్రివర్గంలో అవకాశం ఉంటుంది. ఇప్పటికే కేసీఆర్‌తోపాటు హోంమంత్రి మహమూద్‌ అలీ కేబినెట్‌లో ఉన్నారు. మరో 16మందికి మంత్రివర్గంలో స్థానం కల్పించే చాన్స్‌ ఉంది. దీంతో 12మందిని పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించే అంశాన్ని కేసీఆర్‌ పరిశీలిస్తున్నారు. స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌, ప్రభుత్వ చీఫ్‌ విప్‌, విప్‌ పదవులు కొందరికి కట్టబెట్టాలని భావిస్తున్నారు. ఈ విధంగా మొత్తం 35 మందికి పదవులు దక్కే అవకాశం ఉంది. పదవుల పంపకంలో అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం ఉండేలా చూడాలని కేసీఆర్‌ ఆలోచిస్తున్నారు.
లీగల్‌గా ముందుకు:
గతంలో ఆరుగురు పార్లమెంటరీ కార్యదర్శుల నియామకాన్ని హైకోర్టు రద్దు చేయడంతో ఈసారి న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా కేసీఆర్‌ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఢిల్లీ సహా మరికొన్ని రాష్ట్రాల్లో పార్లమెంటరీ కార్యదర్శులు కొనసాగుతున్నారు. ఈ విషయంలో హైకోర్టులో రివ్యూ పిటిషన్‌ వేసే అంశాన్ని కేసీఆర్‌ పరిశీలిస్తున్నారు. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లాలని కూడా కేసీఆర్‌ ఆలోచిస్తున్నారు.
విధేయుల, పనిమంతులకే పదవులు:
ఆశావహులు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చుట్టూ తిరుగుతూ మంత్రివర్గంలో అవకాశం కల్పించే విధంగా చూడాలని కోరుతున్నారు. అయితే పార్టీకి విధేయులుగా ఉన్నవారి పేర్లను పరిగణలోకి తీసుకుని.. పనితీరు ఆధారంగా పదవులకు అవకాశం ఉంటుందని ఎమ్మెల్యేలకు కేటీఆర్ స్పష్టం చేసినట్లు టీఆర్‌ఎస్‌లో ప్రచారం జరుగుతోంది.

Related Posts