అన్నదాతలందరికీ రైతు బంధు సాయం అందాలి : సీఎం కేసీఆర్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

రాష్ట్రంలో అన్నదాతలందరికీ రైతు బంధు సాయం అందాలని సీఎం కేసీఆర్ అన్నారు. ఈమేరకు శనివారం (లై 11, 2020)సీఎం అధికారులను ఆదేశించారు. ఎవరైనా రైతు బంధు రాని రైతులుంటే వెంటనే గుర్తించి ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం సూచించినట్లు వానాకాలంలో రైతులు వందకు వంద శాతం నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేస్తుండటం శుభసూచికమన్నారు.

ఇది భవిష్యత్ లో సాధించే గొప్ప విజయానికి నాంది అని సీఎం అన్నారు. సీడ్ డెవలప్ కార్పోరేషన్ ఉత్పత్తి చేసే విత్తనాలను నిల్వ చేసేందుకు రూ.25 కోట్ల వ్యయంతో అతి పెద్ద కోల్డ్ స్టోరేజ్ నిర్మించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణాలను దసరా నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.

రైతుబంధు సాయం ఎంత మందికి అందింది? ఇంకా ఎవరైనా మిగిలిపోయారా? అనే విషయాలపై వెంటనే నివేదిక సమర్పించాలన్నారు. క్లస్టర్ల వారీగా ఎంఈవోల నుంచి నివేదికలు తెప్పించాలని, రైతుబంధు సమితుల ద్వారా కూడా వివరాలు తెప్పించాలని సూచించారు. రైతు బంధు రాకుండా ఇంకా ఎవరైనా మిగిలిపోతే వారికి వెంటనే సాయం అందించాలన్నారు. భూముల క్రయ విక్రయాలు జరిగితే ఆ వివరాలను కూడా వెంటనే నమోదు చేయాలని సీఎం ఆదేశించారు.

రైతులు పండించిన పంటలకు మంచి ధర రావడమే లక్ష్యంగా ప్రభుత్వం నియంత్రిత సాగు పద్ధతిని సూచించిందన్నారు. రాష్ట్రంలోని రైతులంతా ప్రభుత్వం సూచించిన మేరకే వానాకాలం పంటల సాగు చేస్తున్నారని పేర్కొన్నారు. మక్కల సాగు వద్దంటే ఎవరూ వేయలేదని.. ఇది గొప్ప పరివర్తన అన్నారు. నియంత్రిత సాగు పద్ధతి వందకు వంద శాతం విజయవంతం కావడం గొప్ప పరిణామమన్నారు.

రైతుల్లోని ఈ ఐక్యత, చైతన్యం భవిష్యత్తులో సాధించబోయే గొప్ప విజయాలకు నాంది పలికిందని.. ఇది శుభసూచకం అన్నారు. తెలంగాణ రైతులందరికీ శుభాకాంక్షలు. రైతుల స్పందన ప్రభుత్వానికి ఎంతో స్ఫూర్తినిస్తుందన్నారు. రైతు సంక్షేమం-వ్యవసాయాభివృద్ధి కోసం మరింతగా పనిచేయడానికి ఇది ప్రేరణగా నిలుస్తున్నదన్నారు.

రైతులు పరస్పరం చర్చించుకోవడానికి, వ్యవసాయాధికారులతో సమావేశం కావడానికి దేశంలో మరెక్కడా లేని రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. వేదికల నిర్మాణాలు కూడా ప్రారంభమయ్యాయని తెలిపారు. దసరాలోగా ఈ వేదికల నిర్మాణం పూర్తయ్యేలా కలెక్టర్లు చొరవ చూపించాలన్నారు. ఒకసారి రైతు వేదికల నిర్మాణం పూర్తైతే, అవే రైతులకు రక్షణ వేదికలు అవుతాయన్నారు.

రైతు బంధు సాయం, ఇతర వ్యవసాయ అంశాలపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్ష సమావేశానికి మంత్రులు నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రధాన కార్యదర్శి సోమేశ్వర్ శర్మతోపాటు పలువురు వ్యవసాయ శాఖ ముఖ్య అధికారులు హాజరయ్యారు.

READ  ప్రగతి భవన్ లో కరోనా కలకలం

Related Posts