శ్రీశైలం పవర్ హౌజ్ ప్రమాదంపై సీఐడీ విచారణకు సీఎం కేసీఆర్ ఆదేశం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

శ్రీశైలం పవర్ హౌజ్ అగ్ని ప్రమాదంపై తెలంగాణ సీఎం కేసీఆర్ సీఐడీ విచారణకు ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలను వెలికితీయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విచారణ అధికారిగా అడిషనల్ డీజీపీ గోవింద్ సింగ్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అగ్నిప్రమాదంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో ప్రాణ నష్టంపై సీఎం తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.



శ్రీశైలం పవర్ హౌజ్ లో సెర్చ్ ఆపరేషన్ ముమ్మరంగా జరుగుతోంది. పవర్ హౌజ్ ప్రమాద ఘటనలో ఆరుగురు మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆరుగురి మృతదేహాలను రెస్క్యూ టీమ్ బయటకు తీసుకొచ్చింది. చనిపోయిన వారిలో అధికారులు ఐదుగురిని గుర్తించారు. ఏఈ మోహన్ కుమార్, ఏఈ ఉజ్మా ఫాతిమా, ఏఈ సుందర్ నాయక్, డీఈ శ్రీనివాస్ గౌడ్, అమరాన్ బ్యాటరీ కంపెనీ ఉద్యోగి మహేశ్ ఉన్నారు.

నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంటలోని శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో నిన్న రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. అర్ధరాత్రి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మొదటి యూనిట్ లో పెద్ద పెద్ద శబ్దాలతో పేలుడు సంభవించింది. తొలుత ప్యానెల్ బోర్డులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి జల విద్యుత్ కేంద్రం మొత్తం వ్యాపించాయి.



సిబ్బందిలో కొంతమంది సొరంగ మార్గం ద్వారా బయటపడగా 9 మంది లోపలే చిక్కుకుపోయారు. తెల్లవారుజాము నుంచి సహాయక చర్యలు కొనసాగుతుండగా మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఏఈ సుందర్ నాయక్ మృతదేహాన్ని గుర్తించారు. ఆ తర్వాత ఐదుగురి మృతదేహాలను రెస్క్యూ టీమ్ గుర్తించింది.

భారీగా మంటలు చెలరేగడం, దట్టంగా పొగలు అలుముకోవడంతో పని చేస్తున్న ఉద్యోగులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలు రక్షించుకోవడానికి బయటకు పరుగులు తీశారు. ప్రమాద సమయంలో 17 మంది సిబ్బంది ఉన్నారు. ఇందులో కొంతమంది మహిళా ఉద్యోగులున్నట్లు సమాచారం. సొరంగమార్గం ద్వారా 8 మంది సురక్షితంగా బయటకు వచ్చారు.


Related Posts