అదిగో యాదాద్రి..అద్బుతం..ప్రత్యేకతలు, విశేషాలు తెలుసుకోండి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ యజ్ఞం.. ఓ అద్భుతం ఆవిష్కరించబోతోంది. 500 మందికిపైగా శిల్పులు చేతిలో.. అందరూ ఆశ్చర్యపడేలా యాదాద్రి సాక్షాత్కరించబోతుంది. మాడ వీధులు, రాజగోపురాలతో యాదాద్రీశుని క్షేత్రం ఆధ్యాత్మిక, ఆహ్లాదకర, పర్యాటక సముదాయంగా రూపుదిద్దుకుంటోంది.

అంతర్జాతీయ స్థాయిలో ప్రజలందరినీ ఆకర్షించేంత హంగులతో నారసింహుని కోవెల నిర్మాణం జరుగుతోంది. అందుకోసం నిష్ణాతులైన స్తపతులు… ఉలులతో శిలలకు ప్రాణం పోస్తున్నారు. లక్ష్మీ నరసింహుడి ఆలయం ఎన్నో ప్రత్యేకతలు.. మరెన్నో విశేషాలతో నిర్మాణమవుతోంది. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఏడు రాజగోపురాలు, నాలుగువైపులా మాడ వీధులు, పన్నిద్దరు ఆళ్వారుల మండపాల నిర్మాణాలతో యాదాద్రి… నారసింహాద్రిగా వెలుగులీననుంది.యాదాద్రి లక్ష్మీనరసింహుడి ఆలయం.. తెలంగాణలోని ఆలయాల్లో చాలా విశిష్టమైనది. ఇక్కడి స్వామి వారు జ్వాలా, యోగా, నంద, గండబేరుండ, నారసింహ రూపాల్లో దర్శనమిచ్చాడు. అందుకే ఈ క్షేత్రం పంచ నారసింహ క్షేత్రంగా పిలవబడుతోంది. తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన యాదాద్రీశుని ఆలయ పునర్నిర్మాణ యజ్ఞం … ఓ అద్భుతాన్ని ఆవిష్కరించబోతుంది. యాదగిరిగుట్ట టెంపుల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆ బృహత్కార్యానికి పూనుకుంది.

500 మందికి పైగా శిల్పుల చేతిలో యాదాద్రి టెంపుల్‌ రూపుదిద్దుకుంటోంది. ప్రధాన ఆలయమైన గర్భగుడి చుట్టూ గోపురాలు, నలువైపులా ద్రావిడశైలి శిల్ప సంపద… అతికొద్ది రోజుల్లోనే కనువిందు చేయనున్నాయి. ఇంతకు ముందు అర ఎకరం స్థలంలో ఉన్న ఆలయాన్ని.. ప్రస్తుతం రెండున్నర ఎకరాల్లో సువిశాలంగా తీర్చిదిద్దుతున్నారు.
ప్రధాన ఆలయ విస్తరణలో ఏడు రాజగోపురాలు నిర్మితమవుతున్నాయి. పశ్చిమ రాజగోపురం 77 అడుగుల్లో రూపొందుతోంది. దీన్ని సప్తతలగా వ్యవహరిస్తున్నారు. అంటే ఏడంతస్తులుగా ఉండబోతుంది. ఇక దక్షిణం, ఉత్తరం, తూర్పు రాజగోపురాలు… 55 అడుగుల్లో నిర్మిస్తున్నారు.వీటిని పంచతలగా.. అంటే అయిదు అంతస్తుల రాజగోపురాలుగా పిలుస్తారు. ఈ నాలుగుకాకుండా మరో రెండు మూడంతస్తుల రాజగోపురాలు సిద్ధమవుతున్నాయి. ఇక ఏడోదైన దివ్య విమాన గోపురం 48 అడుగుల ఎత్తుతో రూపుదిద్దుకుంటోంది. ఇది ప్రధాన గుడి గర్భాలయం పైన నిర్మితమవుతోంది. ప్రస్తుతం ఇవన్నీ తుదిదశలో ఉన్నాయి.

ఇక ఆలయంలో 12 మంది ఆళ్వార్ల విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఆలయంలోకి ప్రవేశిస్తుండగా క్షేత్ర పాలకుడైన ఆంజనేయస్వామిని దర్శించుకున్నాక.. ఆళ్వారుల ముందు నుంచి గర్భాలయంలోకి వెళ్లాల్సి ఉంటుంది. రామానుజాచార్యులు, నమ్మాళ్వార్, పెరుమాండ్లాచార్యులలాంటి 12 మంది వైష్ణవాచార్యుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఇలా యాదాద్రి పుణ్యక్షేత్రం… అచ్చెరువొందేలా తయారవుతోంది.

Related Posts