దుర్గగుడిలో విరిగిపడిన కొండచరియలు, సీఎం పర్యటన వల్లే ముప్పు తప్పింది – వైసీపీ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

CM YS Jagan Offering Silk Clothes To Goddess Kanaka Durga : దసరా శరన్నవరాత్రుల వేళ.. ఇంద్రకీలాద్రిపై అపశృతి చోటు చేసుకుంది. దుర్గగుడి సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో.. ఒక్కసారిగా టెన్షన్ రేగింది. ముఖ్యమంత్రి జగన్ పట్టువస్త్రాలు సమర్పించడానికి.. కొన్ని గంటల ముందు ఈ ఘటన జరిగింది. సీఎం పర్యటన వల్లే.. పెద్ద ముప్పు తప్పిందని వైసీపీ నాయకులు, అధికారులు చెబుతున్నారు.
దుర్గగుడి సమీపంలో కొండ చరియలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బీటలువారి కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. దీంతో వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సీఎం జగన్ పర్యటనకు కొన్ని గంటల ముందు ఈ ఘటన జరగడంతో.. కొండపై ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొండచరియలు విరిగిపడిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడడంతో.. అక్కడున్న వారు పరుగులు పెట్టారు. అదే సమయంలో కొండరాళ్ల కింద ఎవరైనా చిక్కుకుంటే వారిని రక్షించడానికి పోలీసులు, మరికొందరు ప్రయత్నించిన దృశ్యాలు రికార్డు అయ్యాయి.
ముఖ్యమంత్రి పర్యటనతో అధికారులు ముందుగానే భక్తుల రాకపోకలను నిలిపేశారు. దీంతో.. ప్రాణనష్టం తప్పింది. కొండచరియలు విరిగిపడటంతో రేకుల షెడ్డు పూర్తిగా ధ్వంసమైంది. శరన్నవరాత్రి ఉత్సవాల కోసం వేసిన టెంట్లు కొంతమేర కూలిపోయాయి. పోలీసులు, సహాయక బృందాలు, ఆలయ సిబ్బంది రంగంలోకి దిగి కొండచరియలను తొలగించారు.

కొండ చరియలు విరిగిపడే అవకాశముందని ఇంజనీరింగ్‌ అధికారులు ముందే హెచ్చరించారు. అయినా ఆలయ అధికారులు దీన్ని సీరియస్‌గా తీసుకోలేదు. ఈ ఘటనలో అధికారుల నిర్లక్ష్యం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని.. ఉదయ నుంచి చర్చ జరుగుతున్నా.. అధికారులు పట్టించుకోనట్లు తెలిసింది. ఇదే విషయాన్ని.. మీడియా ప్రతినిధులు దుర్గగుడి ఇంజనీరింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
కానీ.. మీడియా ప్రతినిధుల హెచ్చరికలను.. టెంపుల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భాస్కర్ కొట్టిపారేశారు. అలాంటిదేమీ జరుగబోదని, భయపడాల్సిన అవసరం లేదని చెప్పిన కొన్ని గంటల్లోనే కొండచరియలు విరిగిపడ్డాయి. సీఎం జగన్ రావడానికి కొద్ది గంటల ముందే ఈ ప్రమాదం జరిగింది. దీంతో.. దుర్గగుడి అధికార యంత్రాంగం వెంటనే స్పందించింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు.

ఘటనకు సంబంధించిన సమాచారం రాగానే.. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అక్కడికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు కూడా ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు పరిశీలించారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఘాట్‌ రోడ్డు మార్గంలోనే వెళ్లిన సీఎం జగన్… కొండ చరియలు విరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.

Related Tags :

Related Posts :