లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

అసోంలో కాంగ్రెస్ గెలిస్తే చొరబాటుదారులకు అన్ని గేట్లు తెరిచినట్లే : అమిత్ షా

Updated On - 6:18 pm, Sun, 24 January 21

Cong-AIUDF in Assamమరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న అసోంలో ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించారు. అసోంలో కాంగ్రెస్-AIUDF కూటిమి అధికారంలోకి వస్తే చొరబాటుదారులకు అన్ని గేట్లు తెరుస్తారని రాష్ట్రంలో తన మొదటి ఎన్నికల ర్యాలీలో అమిత్ షా విమర్శించారు. కాంగ్రెస్ మరియు దాని మిత్రపక్షం AIUDF చీఫ్ బడ్రుద్దిన్ అజ్మల్​కు చొరబాటుదార్ల నుంచి అసోంను విముక్తి చేసే శక్తి ఉందా?ఆ పార్టీలు అధికారంలోకి వస్తే అన్ని గేట్లు తెరిచి మరీ వారిని స్వాగతిస్తాయి. ఎందుకంటే అది వారి ఓటు బ్యాంక్ అని కొక్రాజహర్‌ ర్యాలీలో అమిత్ షా విమర్శించారు.

అసోంలో దశాబ్ధాలుగా కాంగ్రెస్‌ రక్తపుటేరులు పారించిందని.. ఆ పార్టీ హయాంలో జరిగిన కాల్పుల్లో 10వేల మంది అసోం యువత ప్రాణాలు కోల్పోయారని.. రాష్ట్రంలో పలు ఉద్యమాలను కాంగ్రెస్ ప్రేరేపించిందని షా విమర్శించారు. ఆదివాసీయేతరలు, అసోమీలు, కొండ ప్రాంతీయులు, బోడోలు, బోడోయేతరుల మధ్య చీలిక తీసుకొచ్చిందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌ పార్టీ అసామీలు-అసామేతరులు, బోడోలు-బోడోయేతరుల మధ్య చిచ్చు రగల్చిందని ఆరోపించారు.

అసోంలో గడిచిన 70 ఏళ్లలో జరగని అభివృద్ధి గత ఐదేళ్లలో బీజేపీ హయాంలో చోటుచేసుకుందని అమిత్ షా అన్నారు. అసోంను వరదల నుంచి రక్షించే సామర్థ్యం కేవలం బీజేపీ ప్రభుత్వానికే ఉన్నదని స్పష్టం చేశారు. ఇప్పుడు బుల్లెట్ల నుంచి అసోంను రక్షించామని, మరో ఐదేళ్లు అధికారమిస్తే ఈ రాష్ట్రాన్ని వరదల నుంచీ విముక్తి చేస్తామని ప్రకటించారు. బుల్లెట్లు, నిరసనలు, వరదలు లేని రాష్ట్రం కోసం బీజేపీకి ఓటేయ్యాలని పిలుపునిచ్చారు. అసోంలోని అన్ని వర్గాల ప్రజల రాజకీయ హక్కులు, సంప్రదాయలు, భాషలకు బీజేపీ ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందని తెలిపారు. ఈ మేరకు మోడీ సర్కారు ఇప్పటికే అనేక చర్యలు తీసుకుందన్నారు.

బీజేపీ హయంలోనే అసోం.. ఉగ్రవాద రహిత, అవినీతి రహిత, కాలుష్య రహిత రాష్ట్రంగా తయారవుతోందన్నారు. బోడో శాంతి ఒప్పందం అమలుకు బీజేపీ, ప్రధాని మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో తిరుగుబాటును అంతమొందించే ప్రక్రియను బోడోల్యాండ్‌ ప్రాదేశిక మండలి(బీటీసీ) ఏడాది క్రితమే ప్రారంభించిందని గుర్తుచేశారు. ఇది బోడోల్యాండ్​లో శాంతి, అభివృద్ధికి మార్గం సుగమం చేస్తుందన్నారు. గతంలో కాంగ్రెస్.. బోడోలతో ఎన్నో ఒప్పందాలు కుదుర్చుకుందని.. అయితే వాటిని అమలు చేయడంలో విఫలమైందని షా విమర్శించారు. రానున్న ఎన్నికల్లో అసోంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఎన్నుకుని బోడోల్యాండ్‌ అభివృద్ధికి దోహదపడాలని పిలుపు ఇచ్చారు.