కాంగ్రెస్ సీనియర్లకు అలవాటుగా సొంత పార్టీపైనే సెటైర్లు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తెలంగాణ కాంగ్రెస్‌లో కొందరు నాయకుల వ్యవహారశైలి కొరకరాని కొయ్యగా మారింది. సందర్భం ఏదైనా తాము అనుకున్నదే మాట్లాడాలి. సమయం ఎలా ఉన్న తాము చెప్పాల్సింది చెప్పి తీరాల్సిందే అనేలా తయారయ్యారు. వారి మాటలకు వేదికతో పని ఉండదు. పార్టీ మంచి-చెడులతో సంబంధం లేదు. వారునుకున్నదే తడువు నిరభ్యంతరంగా కుండబద్ధలు కొట్టాల్సిందే. కనీసం తాము మాట్లాడే మాటలతో పార్టీకి ఎలాంటి ఇబ్బందులు వస్తాయన్న కనీస అలోచన లేకపోవడం పార్టీ వర్గాలకు చికాకు తెప్పిస్తోంది. కష్టాల్లో ఉన్న పార్టీని ఇలాంటి నాయకులా గట్టెక్కించే హస్తంలేదని శ్రేణులు ఆవేదన చెందుతున్నాయి.

కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎప్పుడూ నాలుగు కాళ్లపై నడుస్తుంది. పార్టీ పవర్‌లో ఉన్నప్పుడైనా.. లేనప్పుడైనా నేతల తీరు మాత్రం సేమ్‌ టు సేమ్‌. అధికారం కోల్పోయిన తర్వాత మరింత స్వేచ్ఛ దొరకుతుంది. అందుకేనేమో నోటికి తాళం వేయాల్సిన చోటా… స్పీకర్లు పెట్టి మరీ విమర్శలు గుప్పించుకుంటారు. కొందరు నేతలకైతే.. అసలు సమయం, సందర్భం, వేదిక అక్కర్లేదు. ఎక్కడైనా పోడియం దొరికితే చాలు.. తమ కడుపులో ఉన్నది కక్కేస్తారు. గతంలో తమకు ఎదురైన ఇబ్బందులు, అవమానాల్ని ఏకరువు పెట్టేస్తారు.

ఇలా బహిరంగంగా మాట్లాడటమే పార్టీ పాలిట శాపంగా మారుతోందని కాంగ్రెస్‌ శ్రేణుల ఆవేదన. నోటికొచ్చినట్లు మాట్లాడి పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని నేతలపై గుర్రుగా ఉన్నారట హస్తం కార్యకర్తలు. ఇటీవలే గాంధీభవన్‌లో… మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి వేడుకల్ని నిర్వహించారు. ప్రణబ్ ముఖర్జీ, మన్మోహన్‌సింగ్‌, చిదంబరం, జైరాం రమేశ్‌ లాంటి అగ్ర నేతల్ని పిలిచి… పీవీ సేవల్ని, ఆయనతో వారి అనుబంధాన్ని వివరించారు. ఇలాంటి గొప్ప కార్యక్రమంలో పీసీసీ మాజీ చీఫ్‌ వి.హన్మంతరావు మాట్లాడిన తీరు అందర్నీ విస్మయానికి గురి చేసింది.

పీవీని సొంత వర్గమే మోసం చేసిందని… కాంగ్రెస్‌లో బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత లేదంటూ వీహెచ్‌ వాపోయారు. మన్మోహన్‌సింగ్‌ ఢిల్లీలో కూర్చొని నిర్ణయాలు తీసుకోవద్దని… ఇక్కడ ఉత్తమ్, శ్రీధర్‌బాబు, గీతారెడ్డి లాంటి వారందర్నీ కలుపుకొని పోవాలంటూ వీరంగం వేశారు. పీవీ శత జయంతి ఉత్సవాలకు వీహెచ్‌ కూడా గౌరవాధ్యక్షుడన్న సంగతి మర్చిపోయారేమోనంటూ… ఆయన కామెంట్లపై పలువురు నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకవైపు ప్రభుత్వం పీవీ కుటుంబాన్ని దగ్గరగా తీసుకుని కాంగ్రెస్‌ను దెబ్బ కొట్టాలని చూస్తున్న తరుణంలో… పార్టీ తలపెట్టిన కార్యక్రమంలో వీహెచ్‌ విమర్శలు కురిపించడం ఏంటని గాంధీభవన్ వర్గాలు ఫీలవుతున్నాయి.

మరోవైపు వివిధ కార్యక్రమాల్ని బాధ్యతల్ని కొందరు నేతలకు కేటాయించడం ఏ పార్టీలోనైనా కామనే. కాంగ్రెస్‌లో మాత్రం ఇలాంటి సమయంలో… మిగతా నేతలు నిరసనగళం వినిపిస్తుంటారు. కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలున్నప్పటికీ… పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు బహిరంగంగా పోట్లాడుకోవడాన్ని కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారట. ఇటీవల సీనియర్‌ లీడర్లైన పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్‌, దామోదర రాజనర్సింహ తరచూ భేటీ అయ్యి… కోర్‌ కమిటీ మీటింగ్‌ పెట్టాలని డిమాండ్‌ చేస్తున్నారట.

READ  మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

అఖిలపక్ష సమావేశాలకు సీనియర్లను విస్మరిస్తున్నారని… దీనిపై కుంతియా తీరు మార్చుకోవాలని హెచ్చరించారట. జూనియర్లకే ప్రాధాన్యత ఇస్తున్నారని… తమకు చెప్పకుండా కొత్త వారికి పదవులు ఎలా ఇస్తారంటూ.. ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి ప్రశ్నిస్తున్నారని పార్టీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. ఇక కోమటిరెడ్డి బ్రదర్స్ స్టైలే వేరు. పార్టీ కార్యక్రమాలతో సంబంధం లేకుండా… సొంతంగా ప్రోగ్రామ్స్‌ నిర్వహిస్తారని టాక్‌ వినిపిస్తోంది. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అయితే… పీసీసీ చీఫ్‌ నిర్వహించే కార్యక్రమాలకు అంటీ ముట్టనట్లు ఉంటారు.

ఇలా నాయకులంతా ఎవరికి వారే సొంత కుంపట్లు పెట్టుకుని… పార్టీ కార్యక్రమాలకు హాజరు కాకుండా.. వ్యక్తిగత ప్రోగ్రాంలు చేసుకుపోతుంటూ… తామెందుకు గాంధీభవన్‌కు రావాలని మిగతా నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. మొత్తానికి.. కాంగ్రెస్‌ సీనియర్లంతా తలో దారిని టాక్‌ వినిపిస్తోంది. ఇప్పటికే రెండుసార్లు అధికారం కోల్పోయి.. క్షేత్రస్థాయిలో పునాది దెబ్బతింటున్న పార్టీకి… నాయకుల ఈగోలతో మరింత చేటు చేస్తున్నారని కార్యకర్తలు వాపోతున్నారు. ఇప్పటికైనా తీరు మార్చుకుని… నేతలంతా ఏకతాటిపైకి వస్తేనే… భవిష్యత్‌లో పార్టీకి మంచి రోజులు రావంటున్నారు.

Related Posts