పీసీసీ చీఫ్ పదవి కోసం పోటీ.. రేసులో జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డి, పొన్నం, జీవ‌న్‌రెడ్డి, భ‌ట్టి, వీహెచ్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తెలంగాణ పీసీసీ అధ్యక్షుని మార్పుపై కాంగ్రెస్‌లో ప్రచారం ఊపందుకుంది. మార్పు ఖాయ‌మ‌ని భావిస్తున్న టీ కాంగ్రెస్ నేత‌లంతా ఇప్పటికే పార్టీ అధిష్టాన పెద్దలతో ఎవరికివారు టచ్‌లో ఉన్నారు. విస్తృత ప్రయ‌త్నాలు చేస్తున్నారు. ఢిల్లీలో అధిష్టానం పెద్దల‌తో పాటు ఏఐసీసీ ఇన్‌చార్జ్ కుంతియా, వేణుగోపాల్, బోసురాజు త‌దిత‌రుల‌తో పాటు సీనియర్ నాయకుడు జై రామ్ రమేశ్‌తో కూడా భేటీ అయ్యారు. ఈ దపా తనకు అవకాశం ఇస్తే పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసి, కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి సత్తా చూపిస్తానంటున్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి.

ఉత్తమ్ ను కొనసాగిస్తారా?
ప్రస్తుతం ఆశావాహులంతా హ‌స్తిన చేరుకోవ‌డంతో రాష్ట్ర కాంగ్రెస్‌లో కాస్త టెన్షన్ మొద‌లైంది. ఇప్పటికే రెండు సార్లు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిని మారుస్తారా? లేక దుబ్బాక ఉప ఎన్నిక‌లు, గ్రేటర్ హైదరాబాద్‌ ఎన్నిక‌ల వ‌ర‌కు కొనసాగిస్తారా అనేది ఇప్పుడు పార్టీలో చ‌ర్చనీయాంశమైంది. ఉత్తమ్ కుడా మరో చాన్స్ ఇవ్వాల‌ని కోరుతున్నట్లు స‌మాచారం. కాకపోతే ఇప్పటికే ఆయ‌న సారథ్యంలో శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. దీంతో ఆయనను మార్చడం ఖాయమేనని అంటున్నారు. మరోసారి చాన్స్‌ ఇచ్చే అవకాశం లేదని చెబుతున్నారు.

పదవి కోసం పోటీపడుతున్న వారు వీరే:
మరో వైపు లోక్‌సభ ఎన్నికల్లో మూడు స్థానాలను కాంగ్రెస్‌ కైవసం చేసుకున్నా రాష్ట్రంలో పట్టులేని బీజేపీ… కాంగ్రెస్ కంటే ఒక స్థానం అధికంగా గెలుచుకోవడాన్ని కాంగ్రెస్‌ శ్రేణులు జీర్ణించుకో లేకపోయాయి. కాబ‌ట్టి భ‌విష్యత్‌లో పార్టీ బ‌తికి బ‌ట్టక‌ట్టాలంటే పీసీసీ అధ్యక్షుడిని మార్చాల్సిందేనని అంటున్నాయి. ఉత్తమ్ నాయ‌క‌త్వంలో ప్రజా ఉద్యమాల‌కు కూడా చాన్స్ లేకుండా పోయింద‌నీ, టీఆర్ఎస్‌తో టగ్ ఆఫ్ వార్ చేసే పరిస్థితి లేకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వారున్నారు. శ్రీద‌ర్ బాబు, ఎంపీ కోమ‌టిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవ‌న్‌రెడ్డి, జగ్గారెడ్డితో పాటు బీసీ కోటాలో పొన్నం ప్రభాక‌ర్, ద‌ళిత కోటాలో మాజీ డిప్యూటీ సీఎం దామోద‌ర రాజ‌న‌ర్సింహ, ఏఐసీసీ సెక్రట‌రీ సంప‌త్ తీవ్ర ప్రయ‌త్నాలు చేస్తున్నారట.

రేవంత్ కి పదవి ఇవ్వొద్దని వార్నింగ్:
వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి సైతం త‌నకు అవ‌కాశం ఇవ్వాల‌ని సీరియ‌స్‌గానే ట్రై చేస్తున్నారట. ఏకంగా గతంలో కుటుంబ సమేతంగా సోనియాగాంధీని కలవడం పార్టీలో చ‌ర్చనీయాంశం అయ్యింది. కాకపోతే ఆయనకు అవకాశం ఇవ్వవద్దని పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు వి.హ‌నుమంత‌రావు, జగ్గారెడ్డి పలుమార్లు అధిష్టానానికి సూచించారు. ఆయనకిస్తే తమ రాజకీయ నిర్ణయం తాము తీసుకుంటామని హెచ్చరించారు కూడా.

READ  ఏడాదిన్నర తర్వాత సీఎం జగన్ కీలక నిర్ణయం, ఇక పార్టీపై ఫుల్ ఫోకస్

పార్టీనే న‌మ్ముకున్న వారిని కాద‌ని… ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన వారికి ఎలా ఇస్తార‌ని ప్రశ్నిస్తున్నారు. ఇక టీపీసీసీ మార్పు పై ఢిల్లీలో క‌ద‌లిక రాగానే ఒక్కసారిగా పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేతతో పాటు నేతలంతా మంతనాలు మొదలుపెట్టారు. వారి వారి పాత పరిచయాలను వెతుక్కునే పనిలో పడ్డారు. వారంద‌రితో మంతనాలు జరుపుతున్నారు. మరి ఈసారి అధిష్టానం ఎవరికి అవకాశం ఇస్తుందో చూడాల్సిందే.

Related Posts