కాంగ్రెస్ పార్టీలో పోటీలు.. అధిష్టానానికి అర్జీలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

అరవై ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం. అలాంటి ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీ అధికారానికి రెండుసార్లు దూరమైంది. పదేపదే… తామే తెలంగాణ ఇచ్చామని చెప్పుకున్నా ప్రజలు టీఆర్ఎస్‌కి రెండు సార్లు పట్టం కట్టారు. ఎందుకిలా జరిగింది? పార్టీ ఎక్కడ విఫలమైంది? అనే చర్చ మాత్రం కాంగ్రెస్‌లో ఎక్కడా కనిపించదు. ఇక్కడ సమీక్షలు… దిద్దుబాటు అనేవి అసలుండవు. కానీ, అధికారంలోకి రావాలని మాత్రం నాయకులంతా కోరుకుంటారు. పోనీ ప్రజల పక్షాన ఇరగదీసే ఉద్యమాలు ఏమైనా చేశారా? అంటే అదీ లేదు. కానీ ఎన్నికల్లో ఓటమి వచ్చిందంటే తట్టుకోలేరు.

ఇక పార్టీ ఓటమి చెందిందంటే నాయకత్వాన్ని మార్చాలనే డిమాండ్ బలంగా వినిపిస్తూ ఉంటుంది. టీ-కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పు అనేది సర్వసాధారణం. ఎన్నికల్లో ఓటమి చెందిందంటే ఇలాంటి చర్చ మాములే. నాయకత్వం పని తీరు బాగా లేకపోతే పక్కన పెట్టాల్సిందే. కానీ, కాంగ్రెస్‌లో ఈ మధ్య అధిష్టానానికి, కేసీఆర్‌ని ఎదుర్కొనగలిగే నాయకుడికి పగ్గాలు అప్పగించాలని కొందరు, అసలు పీసీసీ మార్పు వద్దంటూ మరికొందరు, పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి పీసీసీ ఇవ్వొద్దని ఇంకొందరు ఫిర్యాదులు చేస్తూ వస్తున్నారు.

పార్టీ విధేయులకే పదవి ఇవ్వండి అని డిమాండ్ చేసిన వాళ్ళు మరి కొందరు. పార్టీ నాయకులు అసలు లాజిక్ మిస్ అవుతున్నట్టు కనిపిస్తోందని పార్టీలో కార్యకర్తలు గగ్గోలు పెడుతున్నారు. నాయకత్వ మార్పుతో పాటుగా వైఖరిలో కూడా మార్పు రావాలని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

తెలంగాణలో రోజురోజుకు బలపడుతున్న టీఆర్ఎస్‌ను గట్టిగా ఢీకొట్టాలంటే పార్టీలో ఉన్న నాయకులంతా సమన్వయంతో పని చేయవాల్సిందేనని అంటున్నారు. పార్టీ నేతల్లో ఉన్న విభేదాలను పక్కకు పెట్టాలని సూచిస్తున్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉంటే పార్టీ ఎలా బలపడుతుందని ప్రశ్నిస్తున్నారు. క్షేత్ర స్థాయికి వెళ్లకుండా మండల స్థాయి నాయకులు కూడా నగరాల్లో ఉంటూ పని చేస్తే ఎలా అనే వాదన వినిపిస్తోంది.

ప్రతి ఎన్నికల్లోనూ అధికార టీఆర్ఎస్ మొత్తం స్వీప్ చేస్తూ పోతుంటే, కాంగ్రెస్ నేతలు మాత్రం సమన్యాయంగా పని చేసేందుకు సిద్ధపడడం లేదు. కొందరైతే ప్రజలు కోరుకుంటేనే మనకు అధికారం అదే వస్తుందని అంటున్నారు.

నేతలంతా కలసికట్టుగా పని చేద్దామంటే మెజారిటీ నేతల్లో స్పందన ఉండదనే వాదన ఉంది. కాంగ్రెస్‌ నేతల్లోని మైనస్‌లను తమకు అనుకూలంగా మార్చుకొని బలపడాలని బీజేపీ కాచుకొని కూర్చుంది. కానీ ఇవేవీ గుర్తించకుండా నాయకులు ఎవరి దారి వారిదేనన్నట్టుగా ప్రవర్తిస్తుంటారని కేడర్‌ వాపోతోంది. టీ-కాంగ్రెస్‌లో సమన్వయ లోపం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి తోడు క్రమశిక్షణ అనేది లేదంటున్నారు. ఎవరికి తోచిన వాదన వారు చేస్తున్నారు. ఏదైనా అంటే.. కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువంటారు. గడచిన ఆరేళ్లలో కాంగ్రెస్ నాయకత్వం చెప్పుకోదగ్గ ప్రజాందోళనలు చేసిన దాఖలాలు లేవు. ప్రజల పక్షాన రోడ్డెక్కిన నాయకులూ లేరు. జనంలోకి వెళ్లడమే మానేసి… అధికారంలోకి రావాలంటే ఎలా వస్తుందని కార్యకర్తలు అంటున్నారు.

అంతర్గత విభేదాలు పక్కన పెట్టేలా చేసి.. అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నం ఇప్పటికి కూడా చేయడం లేదు అధిష్టానం. అంతెందుకు… పీసీసీ నాయకత్వం ఇప్పటి వరకు జిల్లా స్థాయిలో పర్యటనలు కూడా చేయలేదు. పార్టీని ప్రక్షాళన చేసి కొత్త పీసీసీని హైకమాండ్ నియమించినా అసలు పార్టీ వైఖరే మారనప్పుడు కొత్తగా పీసీసీ ఏర్పాటు చేస్తే మాత్రం ప్రయోజనం ఏముంటుందని అనుకుంటున్నారు. కాబట్టి పార్టీలో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటూ, బలమైన నాయకుడికి పార్టీ పగ్గాలు అప్పగిస్తేనే ఏమైనా ఉపయోగం ఉంటుందని కార్యకర్తలు అంటున్నారు. నేతల మధ్య ఆధిపత్యం ధోరణి తగ్గించుకుంటే పార్టీ బలోపేతమై అధికారాన్ని అందుకొనేందుకు వీలుంటుందని చెబుతున్నారు. మరి హైకమాండ్ ఆ దిశగా చర్యలు తీసుకుంటుందో లేదో?

Related Tags :

Related Posts :