నాడు ఘనం, నేడు దయనీయం.. ఖమ్మం జిల్లాలో కనుమరుగయ్యే పరిస్థితిలో కాంగ్రెస్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

congress pathetic condition in khammam district: అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో ఓ వెలిగిన హస్తం పార్టీ.. ఆ తర్వాత క్రమంగా కనుమరుగైపోయే పరిస్థితికి చేరుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా పది అసెబ్లీ నియోజకవర్గాల్లో మధిర, పాలేరు, ఇల్లెందు, పినపాక, భద్రాచలం, కొత్తగూడెం నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. వైరాలో కాంగ్రెస్‌ మద్దతిచ్చిన స్వతంత్ర అభ్యర్థి గెలవడంతోపాటు సత్తుపల్లి, అశ్వారావుపేటలో కాంగ్రెస్‌ పొత్తుతో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. మొత్తం మీద అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా రాజకీయాల్లో బాహుబలిగా నిలిచింది కాంగ్రెస్‌.

తన ప్రాబల్యాన్ని కోల్పోయిన కాంగ్రెస్:
మరోపక్క, రాష్ట్రంలో టీఆర్ఎస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా అధికార పార్టీలో చేరుతూ వచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి, ఆ వెంటనే పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌, మున్సిపల్‌, సహకార ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పాలైంది కాంగ్రెస్‌. జిల్లాలో తన ప్రాబల్యాన్ని కోల్పోయింది. దీంతో కాంగ్రెస్ కేడర్‌లో ఒక్కసారిగా నిరుత్సాం ఆవరించింది. ఇటీవల జరిగిన సహకార ఎన్నికల్లో నామమాత్రంగా గెలిచింది.

డీసీసీబీ డైరెక్టర్ల స్థానాలకు కనీసం నామినేషన్లు వేయలేని పరిస్థితి:
ప్రతిసారి డీసీసీబీ, డీసీఎంఎస్‌ ఎన్నికల్లో హోరాహోరీగా సాగేవి. ఈసారి గెలిచిన సొసైటీ అధ్యక్షులు సైతం డీసీసీబీ డైరెక్టర్ల స్థానాలకు కనీసం నామినేషన్లు వేయలేని పరిస్థితి. నామినేషన్ల రోజున పోలీసులు అడ్డగిస్తే నామినేషన్లు వేసేందుకు వెళ్లలేకపోయారు. జిల్లాలో జరిగిన ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షంగా కూడా బరిలో నిలవలేకపోయింది. కనీసం ఎన్నికల్లో గెలిచేందుకు జిల్లా కాంగ్రెస్‌ ముఖ్యనేతలు కూడా వ్యూహరచన చేయకపోవడం చూస్తే నాయకత్వ లోపం స్పష్టంగా కనిపించింది. ఎన్నికల్లో కాంగ్రెస్‌ చతికిలపడినప్పటికీ నాయకుల్లో వర్గ పోరు మాత్రం తగ్గడం లేదు.

నిరుత్సాహంలో కాంగ్రెస్ శ్రేణులు:
కొత్తగూడెం మున్సిపాలిటీలో ఎప్పుడూ కాంగ్రె‌స్‌దే పైచేయిగా ఉండేది. ఈసారి మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌కు పోటీగా సీపీఐ నిలిచింది. జిల్లాలో బలమైన ప్రాంతాలు కూడా బలహీనంగా మారిపోవటంతో కాంగ్రెస్ శ్రేణులు నిరుత్సాహానికి గురువుతున్నాయి. పార్టీలో ఉండలేని వారంతా కారు ఎక్కుతున్నారు. ఇంకా కాంగ్రెస్‌లో ఉంటే ఆ పార్టీలో ఏముందని ఉన్నారు? మీరు కూడా కారు ఎక్కండంటూ ఆ పార్టీని ఇప్పటికే వీడి వెళ్లిన వారు ఉచిత సలహాలు ఇస్తున్నారట.

మధిర మినహా ఇతర మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ పరిస్థితి దారుణం:
జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ రోజురోజుకూ బలహీనపడుతోంది. మధిర మినహా ఇతర మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. స్థానిక నాయకులు, కార్యకర్తల్లో పోరాట పటిమ ఉన్నా నాయకత్వ లోపం పార్టీని వేధిస్తోందంట. ఉమ్మడి జిల్లాలో బలమైన పార్టీగా ఉన్న కాంగ్రెస్‌ బలహీనపడడంతో అధికార టీఆర్‌ఎస్‌ జిల్లా రాజకీయాల్లో ఏకచ్ఛత్రాధిపత్యం వహించే దిశగా సాగుతోంది. వరుస ఎన్నికల్లో ఏకపక్ష విజయాలు సొంతం చేసుకుంటోంది. వామపక్షాలు కూడా స్థానిక సంస్థలు, సహకార ఎన్నికల్లో గతంలో కంటే బలహీనపడ్డాయి.

పరువు దక్కించుకోవాలని కాంగ్రెస్‌ ఆరాటం:
ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఇదే హవా చూపిస్తామన్న ధీమా టీఆర్ఎస్‌ పార్టీలో వ్యక్తమవుతోంది. మరోపక్క, ఎలాగైనా పరువు దక్కించుకోవాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. కానీ, పార్టీలో వర్గ విభేదాలు దెబ్బ తీస్తున్నాయట. ఖమ్మం నగరంలో విభేదాలు పక్కన పెట్టకపోతే ఇప్పటి వరకూ ఎదురైన ఫలితాలనే రుచి చూడాల్సి వస్తుందని కార్యకర్తలు అంటున్నారు. పార్టీని ఇకనైనా పటిష్ట పరిచేందుకు రాష్ట్ర నాయకత్వం చర్యలు తీసుకోకపోతే మరింత బలహీనపడే ప్రమాదం ఉందని అసలైన పార్టీ కార్యకర్తలు ఫీలవుతున్నారు.Related Posts