ఇలాగే ఉంటే…మరో 50ఏళ్ళు కాంగ్రెస్ ప్రతిపక్షంలోనే : ఆజాద్ కీలక వ్యాఖ్యలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కాంగ్రెస్‌ పార్టీలో సంస్కరణలు, సంస్థాగత ఎన్నికలు జరగాల్సిందేనని డిమాండ్‌ చేశారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్. ఎన్నికల ద్వారానే కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిని నియమించాలని, నేరుగా నియమించిన అధ్యక్షుడికి ఒకశాతం మద్దుతు కూడా ఉండకపోవచ్చని ఆజాద్ అన్నారు.

ఎన్నికల ద్వారా ఏర్పాటైన నాయకత్వం ఉంటేనే పార్టీ బాగుపడుతుందనీ.. అదే జరక్కుంటే మరో 50 ఏళ్లపాటు ప్రతిపక్షంలోనే కూర్చోవాల్సి ఉంటుందన్నారు. పార్టీలో కేవలం ఇద్దరు లేదా ముగ్గురి మధ్యే పోటీ ఉంటుందని, వారిలో 51 శాతం ఓట్లు వచ్చిన వ్యక్తి ఎన్నికవుతాడని, అప్పుడు అతని వెంట 51 శాతం మంది ప్రజలు ఉన్నట్టేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ ఇలాకాకుండా నేరుగా అధ్యక్షుడైన వ్యక్తికి కనీసం ఒక్క శాతం మద్దతు కూడా అనుమానమే అని ఆజాద్ పేర్కొన్నారు.

అంతేకాకుండా, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సహా రాష్ట్ర, జిల్లా, బ్లాక్ స్థాయి అధ్యక్షుల వరకు అన్ని కీలక పదవులను ఎన్నికల ద్వారానే భర్తీ చేయాలని ఆజాద్ అన్నారు. ఈ విధానాన్ని వ్యతిరేకించేవారంతా తాము ఓడిపోతామని భయపడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

కాగా, కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయి అధ్యక్షుడిని నియమించి, పార్టీలో నూతన జవసత్వాలు నింపాలంటూ ఇటీవల ఆ పార్టీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీకి లేఖ రాసిన అసమ్మతి నేతల్లో ఆజాద్ కూడా ఉన్న విషయం తెలిసిందే.

Related Tags :

Related Posts :