Cold Winds Shivering Telangana

గడ్డ కట్టే చలి : తెలంగాణ గజగజ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తెలుగు రాష్ట్రాల్లో చలితీవ్రత కొనసాగుతోంది. రోజురోజుకి చలి పెరుగుతోంది. గడ్డ కట్టే చలితో జనాలు విలవిలలాడిపోతున్నారు. చలిగాలులకు తోడు అత్యల్ప ఉష్ణోగ్రతలు బెంబేలెత్తిస్తున్నాయి. తెలంగాణలోని అర్లిటీలో 2.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం చలితీవ్రతకు అద్దం పడుతుంది. మనం అట్లాంటికాలో ఉన్నామా.. భారత్‌లో ఉన్నామా.. అనేరీతిలో చలి పంజా విసిరింది.
ఎముకలు కొరికే చలి:
ఆదిలాబాద్‌ జిల్లాలో పలుచోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. ఆసిఫాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలం అర్లిటీలో ఏకంగా 2.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఈ సీజన్‌లో ఇదే మొదటిసారి. కొమురంభీం జిల్లా తిర్యాని మండలం గిన్నధరి, సిర్పూరు, కామారెడ్డి జిల్లా బిక్నూరులోనూ 3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాయంత్రం 4 నుంచే ఎముకలు కొరికే చలి మొదలవుతోంది. ఎన్నడూ లేనంతగా ఏజెన్సీలో సాయంత్రం నుంచి మంచు తేలికపాటి వర్షంలా కురుస్తోంది.
హైదరాబాద్ గజగజ:
హైదరాబాద్‌లోనూ ఇదే పరిస్థితి. మూడు రోజులుగా చలిగాలుల తీవ్రత రెట్టింపయ్యింది. ఉదయం 7 గంటల వరకు రహదారులను మంచు కప్పేస్తుండటంతో వాహనదారులు రోడ్లపైకి వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 10 గంటల వరకు చలిగాలుల తీవ్రత కొనసాగుతోంది. సాధారణం కంటే 4-5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. గడ్డకట్టే విధంగా చలి పంజా విసరడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్వాస సంబంధ వ్యాధులు ఎక్కువయ్యాయి. ఉత్తరాది నుండి వీస్తున్న శీతల పవనాలతోనే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని.. వచ్చే నాలుగు రోజులు చలితీవ్రత కొనసాగుతుందని, జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Related Posts