reservation-village-panchayats-finalized

పంచాయతీలకు రిజర్వేషన్లు ఖరారు : మహిళలకు 50 శాతం కేటాయింపు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. పంచాయతీరాజ్‌ శాఖ ఎస్టీ, ఎస్సీ, బీసీ కోటాను జిల్లాల వారీగా ఖరారు చేసింది. ఎస్టీలకు 1,865 పంచాయతీలు, ఎస్సీలకు 2,113 పంచాయతీలు, బీసీలకు 2,345 పంచాతీయలు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం పంచాయతీల్లో 50 శాతం మహిళలకు, 100 శాతం గిరిజనులున్న పంచాయతీలను ఎస్టీలకే కేటాయించారు. ఎస్టీ రిజర్వ్‌డ్ పంచాయతీలు భారీగా పెరిగాయి. దీంతో 12,751 పంచాయతీల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. 

పంచాయతీల్లో 50 శాతానికి లోబడే రిజర్వేషన్లు ఉండాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో బీసీలకు 22.8 శాతం, ఎస్సీలకు 20.5 శాతం, ఎస్టీలకు 6.7 శాతం రిజర్వేషన్లు నిర్ధారిస్తూ పంచాయతీరాజ్‌ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏజెన్సీ, వంద శాతం ఎస్టీ జనాభా ఉన్న పంచాయతీలు, సాధారణ రిజర్వేషన్లతో కలిపి ఈసారి ఎస్టీలకు ఎక్కువ సంఖ్యలో సర్పంచ్‌ స్థానాలు రిజర్వ్‌ అయ్యాయి.
ఇకపోతే అన్ని కేటగిరీల్లోనూ 50 శాతం పంచాయతీలను మహిళలకు కేటాయించారు. రాష్ట్రంలో మొత్తం 12,751 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో గిరిజన ప్రాంతాల(షెడ్యూల్‌)కు సంబంధించిన 1,281 పంచాయతీలను ఎస్టీలకు కేటాయించారు. అలాగే వంద శాతం ఎస్టీ జనాభా ఉన్న 1,177 సర్పంచ్‌ స్థానాలను కూడా వారికే రిజర్వ్‌ చేశారు. ఇవి తీసేయగా మిగిలిన 10,293 పంచాయతీలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ కోటా ప్రకారం రిజర్వేషన్లు నిర్ధారించారు. దీంతో ఎస్టీలకు 688, ఎస్సీలకు 2,113, బీసీలకు 2,345 సర్పంచ్‌ స్థానాలు రిజర్వ్‌ అయ్యాయి. మొత్తమ్మీద అందరి కంటే అత్యధికంగా ఎస్టీలకు 3,146 పంచాయతీలు దక్కాయి.

ఇక 50 శాతం అన్‌రిజర్వ్‌డ్‌ కోటా కింద 5,147 సర్పంచ్‌ స్థానాలు ఉన్నాయి. వీటిలో అన్ని వర్గాలవారు పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, అన్‌రిజర్వుడ్‌.. అన్ని కేటగిరిల్లోనూ సగం స్థానాలను(6,378) మహిళలకు కేటాయించారు. అలాగే జనరల్‌కు కేటాయించిన 6,373 స్థానాల్లో కూడా మహిళలు పోటీచేసే అవకాశం ఉంటుంది. 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చివరిసారి గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగాయి. అప్పటి మాదిరిగానే ఇప్పుడు కూడా మహిళలకు అన్ని కేటగిరీల్లో 50 శాతం సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలను ఖరారు చేశారు. 
గత పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే వెనుకబడిన వర్గాలకు ఈసారి రిజర్వేషన్లు తగ్గాయి. గత ఎన్నికలలో బీసీలకు 34 శాతం కోటా ఉండగా.. ఈసారి అది 22.8 శాతానికి మాత్రమే పరిమితమైంది. తమకు రిజర్వేషన్లు తగ్గిస్తే ఊరుకునేది లేదని బీసీ సంఘాలు, బీసీ ప్రజాప్రతినిధులు హెచ్చరించినప్పటికీ, సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగానే వారికి రిజర్వేషన్లు ఖరారు చేశారు. దీంతో ఈ అంశంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని బీసీ సంఘాలు చెబుతున్నాయి. కాగా, జిల్లాలవారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, అన్‌రిజర్వుడ్‌ కోటా ఖరారైన నేపథ్యంలో ఒకటిరెండు రోజుల్లో మండలాలవారీగా రిజర్వేషన్లు నిర్ధారించనున్నారు.

READ  2.3లక్షల కోట్ల కరోనా ప్యాకేజీని కేంద్రం ప్రకటించే అవకాశం

సర్పంచ్‌ స్థానాలతోపాటు వార్డు సభ్యుల రిజర్వేషన్లును ఇదే పద్ధతిలో నిర్ణయిస్తారు. ఆయా జిల్లాల్లోని మండలాలవారీగా వివిధ కేటగిరీల వివరాలను కలెక్టర్లు ప్రకటిస్తారు. అనంతరం ఏ గ్రామపంచాయతీ ఏ వర్గానికి రిజర్వు అవుతుందనేదీ వెల్లడిస్తారు. ఈ వివరాలన్నీ సిద్ధం కాగానే సదరు జాబితాను పంచాయతీరాజ్‌ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. ప్రభుత్వం ఆ వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేస్తుంది. ఈ జాబితా అందగానే ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. 

Related Posts