corona-patients-with-very-mild-symptoms-just-need-home-isolaton

కరోనాకు వ్యాక్సిన్ ధైర్యమే, వైరస్‌ తీవ్రత తక్కువ ఉంటే హోం ఐసొలేషన్‌ చాలు, తెలంగాణలో 14వేల మంది అలానే కోలుకున్నారు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా వైరస్ అందరికీ ప్రాణాంతకమా? కరోనా సోకిందంటే ఆసుపత్రిలో చేరాల్సిందేనా? ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటేనే బతుకుతామా?
ఇలాంటి సందేహాలు, భయాలు ఎన్నో. యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. ఈ మహమ్మారితో ఎలా పోరాడాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఈ ఆందోళన, భయమే మనిషిని సగం చంపుతుందని నిపుణులు అంటున్నారు. ఇకపోతే కరోనా వైరస్ తీవ్రత తక్కువ ఉంటే హోం ఐసోలేషన్ చాలు, మేలు అంటున్నారు నిపుణులు. హోం ఐసోలేషన్ లో ఉంటూనే 14వేల మంది కోలుకున్నట్టు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

లక్షణాలు లేనివారు లేదా స్వల్ప లక్షణాలున్న వారు ఆందోళన చెందొద్దు:
కరోనా వైరస్‌ కంటే దాని వల్ల ఏర్పరుచుకున్న భయమే ఎక్కువ ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. నిజానికి కరోనా వైరస్‌ వచ్చినప్పటికీ 85శాతం మందికి ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. 5శాతం మందిలో మాత్రం తీవ్ర లక్షణాలు ఉంటున్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పెద్ద సంఖ్యలో కరోనా నిర్ధారణ పరీక్షలను ప్రారంభించింది. ఆర్టీపీసీఆర్‌కు తోడు ర్యాపిడ్‌ పరీక్షలను నిర్వహిస్తున్నది. పాజిటివ్‌ అని తేలినా ఎలాంటి లక్షణాలు లేనివారు లేదా స్వల్ప లక్షణాలున్న వారు ఆందోళన చెందొద్దని డాక్టర్లు చెబుతున్నారు. ఇంట్లోనే (హోం ఐసొలేషన్‌) ఉంటూ కొవిడ్‌ను జయించవచ్చన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ తిరగడం వల్ల విలువైన సమయం, డబ్బు వృథా అవుతాయన్నారు. ఆసుపత్రుల్లో ఒంటరిగా ఉండే బదులు ఇంట్లో మరింత స్వేచ్ఛగా, ధైర్యంగా ఉండవచ్చన్నారు. హోం ఐసొలేషన్‌లో ఉండేవారు తాము సూచించిన జాగ్రత్తలు పాటించగలిగితే 10 రోజుల్లోనే వైరస్‌ నుంచి విముక్తులు కావచ్చని డాక్టర్లు భరోసా ఇస్తున్నారు.

కేంద్రం సూచన మేరకు హోం ఐసొలేషన్‌:
లక్షణాలు లేకున్నా చాలామందిలో కరోనా పాజిటివ్‌ వస్తున్నందున కేంద్రం నూతన మార్గదర్శకాలు జారీచేసింది.
* వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్నవారికి ఇళ్లలోనే చికిత్స అందించాలి.
* ఇంట్లో వసతులున్న వారంతా హోం ఐసొలేషన్‌లో ఉండేందుకు అవకాశం కల్పించాలి.
* ఇప్పటిదాకా 17 రోజులుగా ఉన్న ఐసొలేషన్‌ గడువును పది రోజులకు కుదింపు.
* ఈ కాలంలో వరుసగా 3రోజులపాటు ఎలాంటి లక్షణాలు లేకుంటే హోం ఐసొలేషన్‌ నుంచి డిశ్చార్జి చేయొచ్చని సూచన.
* హోం ఐసొలేషన్‌ నుంచి డిశ్చార్జి అయినప్పటికీ మరో వారంపాటు రోగి తప్పకుండా ఇంట్లోనే ఉండాలని స్పష్టం.
* కేంద్రం సూచన మేరకు తెలంగాణ ప్రభుత్వం.. లక్షణాలు లేని పాజిటివ్‌ రోగులను హోం ఐసొలేషన్‌కు తరలింపు.
* హోం ఐసొలేషన్‌లో రికవరీ అయిన కేసుల్లో ఢిల్లీలో అత్యధికం. తెలంగాణ రెండో స్థానంలో ఉంది.

READ  టీఎఫ్‌జెఏ సభ్యులకు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కృతజ్ఞతలు..

నిర్ణయంలోనే సగం విజయం:
హోం ఐసొలేషన్‌లో ఉండాలనే నిర్ణయంలోనే సగం విజయం దాగుందని నిపుణులు అంటున్నారు.
* పది రోజులపాటు ఇంట్లోనే ఓ ప్రత్యేక గదిలో ఐసొలేషన్‌లో ఉండాలి.
* గదిని శుభ్రంగా ఉంచుకోవడం తోపాటు వెలుతురు, గాలి బాగా ఉండేలా చూసుకోవాలి.
* తప్పనిసరిగా ప్రత్యేక బాత్‌రూం ఉండాలి.
* ఉపయోగించే పాత్రలు, వస్తువులు, దుస్తులను ఇతరులు తాకకూడదు.
* మాస్కును అన్ని వేళలా ధరించాలి.
* తరుచూ చేతులను శుభ్రం చేసుకోవాలి.
* ఆరోగ్య సేతు యాప్‌తో అనుసంధానమై ఉండాలి.

corona-cases-in-india

పాజిటివ్‌ ఉండి లక్షణాలు లేనివారు, స్వల్ప లక్షణాలు ఉన్నవారు ఇంట్లో ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారని డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ శ్రీనివాస రావు చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 24వేల 983 మంది హోం ఐసొలేషన్‌లో ఉన్నారని, వీరిలో చాలామంది కరోనాను జయించారని తెలిపారు. హోం ఐసొలేషన్‌లో ఉండేవారు డాక్టర్లు సూచించిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. కరోనా పాజిటివ్‌ వచ్చినప్పటికీ ఇంట్లో ఉండే తాను వైరస్‌ను జయించానని హైదరాబాద్‌కు చెందిన కొందరు చెప్పారు. తమకు పాజిటివ్‌ వచ్చినా.. వ్యాధి లక్షణాలు లేకపోవడంతో ఇంట్లోనే ఉండాలని డాక్టర్లు సూచించారని, మందులు, ఆహారం గురించి వివరించారని వారు తెలిపారు. రోజుకు ఒకటి రెండు సార్లు డాక్టర్లు ఫోన్‌ చేసి ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకునేవారని, ఆందోళన చెందొద్దని ధైర్యం చెప్పేవారని వెల్లడించారు. తాము 15 రోజులపాటు హోం ఐసొలేషన్‌లో ఉండి.. ఎలాంటి లక్షణాలు కనిపించకపోవటంతో బయటకు అడుగు పెట్టామని తన స్వీయానుభవాన్ని పంచుకున్నారు.

Union Health Ministry Revises Home Isolation Guidelines; Check Details

దినచర్య ఎలా ఉండాలి?
* పది రోజుల్లో వైరస్‌ను జయిస్తున్నాననే నమ్మకంతో ఉండాలి.
* ఎలాంటి ఆందోళన చెందకూడదు.
* కరోనా వార్తలు, విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.
* పౌష్టికాహారం తీసుకోవాలి.
* మూడు పూటలా గోరువెచ్చని నీటిని తాగాలి.
* మద్యం, సిగరెట్లు, డ్రగ్స్‌ వంటివి పూర్తిగా మానేయాలి.
* జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే డాక్టర్లకు తెలిపి.. సూచించిన మందులు వాడాలి.
* రోగనిరోధక శక్తిని పెంచే పండ్లు, విటమిన్‌ ట్యాబ్‌లెట్స్‌ తీసుకోవాలి.
* ప్రతిరోజు బీపీ, జ్వరం, ఆయాసం.. ఇతర లక్షణాలు కనిపిస్తున్నాయా లేదా అని పరీక్షించుకోవాలి.
* ఫోన్‌, ల్యాప్‌టాప్‌ ఇతర గ్యాడ్జెట్స్‌కు ఎక్కువ సమయం కేటాయించకుండా సమయానికి నిద్రపోవాలి.
* ఉదయం లేదా సాయంత్రం అరగంట పాటు వ్యాయామం లేదా యోగా చేసుకోవాలి.

అత్యవసరం అయితే:
ప్రభుత్వం అన్నివేళలా ఆదుకునేందుకు సిద్ధంగా ఉందన విషయాన్ని మరిచిపోవద్దు. జ్వరం పెరగటం, శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు, ఛాతిలో నొప్పి, ఇతర లక్షణాలు ఎక్కువైతే అప్పటివరకు అనుసంధానంలో ఉన్న ప్రభుత్వ వైద్యులకు సమాచారం అందించాలి. లేదా 104 నంబర్‌కు ఫోన్‌ చేయాలి. వారు అంబులెన్స్‌లో దగ్గర్లోని కొవిడ్‌ చికిత్స కేంద్రానికి తరలిస్తారు. లేదంటే నేరుగా గాంధీ ఆసుపత్రికి వెళ్లొచ్చు. అకస్మాత్తుగా లక్షణాలు ఎక్కువైన సమయంలో ధైర్యంగా ఉండాలి. ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ తిరిగి వృథా చేసుకోవద్దు. పరిస్థితి చేయి దాటాక ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే డాక్టర్లు ఏమీ చేయలేరు.

READ  తెలంగాణలో కరోనా : నిన్న మర్కజ్..నేడు దేవ్ బంద్..రేపు ?

cheap infrared Digital Thermometer With Memory/ 2019 new infrared ...

ఇంట్లో ఇవి ఉండాల్సిందే:
* డిజిటల్‌ థర్మామీటర్‌ వెంట ఉంచుకొని తరుచూ జ్వరం ఎంత ఉందో చూసుకోవాలి.
* బీపీ ఆపరేటర్‌, పల్స్‌ ఆక్సీమీటర్‌ అందుబాటులో ఉంచుకోవాలి.
* పారాసిటమాల్‌ 650, విటమిన్‌ సీ, డీ, జింక్‌ ట్యాబ్‌లెట్స్‌ ఉండాలి.
* ఒకటి రెండు రకాల యాంటీ బయాటిక్స్‌ ట్యాబ్‌లెట్స్‌ ఉండాలి.
* వీటన్నింటిని వైద్యుల సలహామేరకు వాడాలి.
* హోం ఐసొలేషన్‌లో ఉండాలని సూచించినవారికి రాష్ట ప్రభుత్వమే వీటిని కిట్‌ రూపంలో అందిస్తుంది.

ఎవరికి హోం ఐసొలేషన్‌?
* పాజిటివ్‌ అని తేలిన వెంటనే వైద్యాధికారులు ఫోన్‌ చేస్తారు.
* ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీస్తారు.
* లక్షణాలు లేని వారిని, అతి స్వల్ప, స్వల్ప లక్షణాలు ఉన్నవారిని హోం ఐసొలేషన్‌లో ఉండాలని సూచిస్తారు.
* తీవ్రమైన లక్షణాలు ఉన్నవారు, హెచ్‌ఐవీ బాధితులు, అవయవ మార్పిడి చేసుకున్నవారు, క్యాన్సర్‌కు చికిత్స పొందుతున్నవారు హోం ఐసొలేషన్‌లో ఉండేందుకు అర్హులు కాదు.
* 60 ఏళ్లు పైబడిన రోగులు, రక్తపోటు, డయాబెటిస్‌, గుండె జబ్బులు, దీర్ఘకాలిక వ్యాధులు, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్న వారిని డాక్టర్ల సూచన మేరకు హోం ఐసొలేషన్‌కు అనుమతిస్తారు.

కరోనాకు వాక్సిన్‌ ధైర్యమే.:
పాజిటివ్‌ ఉన్నప్పటికీ లక్షణాలు లేనివారు ఇంట్లో హాయిగా ఉండొచ్చు. కుటుంబ సభ్యులకు దూరంగా రెండు వారాల పాటు ప్రత్యేక గదిలో ఉంటే చాలు. ప్రభుత్వం తరఫున వైద్యులు అన్ని సమయాల్లో అందుబాటులో ఉంటున్నారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. బయట తప్పుగా ప్రచారం జరుగుతోంది. ఇంట్లో ఉండి నేను కొవిడ్‌ నుంచి కోలుకున్నా. కరోనాకు వాక్సిన్‌ ధైర్యమే. మనం ఎంత ధైర్యంగా ఇంట్లో ఉంటే అంత బలంగా వైరస్‌ను ఎదుర్కోగలం. లక్షణాలు లేనివారు, స్వల్ప లక్షణాలున్నవారు మనోధైర్యంతో, జాగ్రత్తలు పాటిస్తూ ఇంట్లోనే ఉండండి అని కరోనా నుంచి కోలుకున్న వారు చెబుతున్నారు.

Related Posts