Home » హైదరాబాద్ లో ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులకు సెలవులు!
Published
7 months agoon
By
madhuగ్రేటర్ హైదరాబాద్లో కరోనా కోరలు చాస్తోంది. రోజూ వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వైరస్ అదుపులోకి రావడం లేదు. దీంతో కరోనా కట్టడిపై ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టింది.
వైరస్ను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలను సిద్దం చేస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. గ్రేటర్ పరిధిలోని ఆస్పత్రుల్లో ఇతర వ్యాధులకు చికిత్సలు అందకపోవడం, కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వారికి చికిత్స అందించేందుకు ఇబ్బందులు ఎదురవుతుండడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రైవేట్ లాబోరేటరీల్లో కరోనా టెస్టింగ్లపై అనుమానాలు వ్యక్తం అవుతుండడం, ప్రభుత్వ పరంగా టెస్టింగ్ కేంద్రాలను పెంచడంలాంటి అంశాలపైనా సర్కార్ చర్యలు చేపట్టనున్నట్టు సమాచారం.
గ్రేటర్లో ప్రస్తుతం రోజుకు వెయ్యికిపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రాబోయే రెండు, మూడు వారాల్లో ఇవి రెట్టింపు అయ్యే చాన్స్ ఉందని వైద్యశాఖ అంచనా వేస్తోంది. దీంతో వైద్య చికిత్సల కోసం చేయాల్సిన ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన మొదలు పెట్టాలని సర్కార్ నిర్ణయించింది. కోవిడ్ చికిత్స కోసం ఇప్పటి వరకు ఉన్న ఆస్పత్రులతోపాటు… అదనంగా ఎలాంటి ఏర్పాట్లు చేయాలా అన్నదానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.
వైరస్ కట్టడి కోసం లాక్డౌన్ విధించాలని ముందుగా భావించినా.. లాక్డౌన్ సమస్యకు పరిష్కారం కాదన్న అభిప్రాయంలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. అవసరమైతే ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు రెండు లేదా మూడు వారాలపాటు సెలవులు ప్రకటించాలన్న ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్టు సమాచారం.
వ్యాపార సంస్థలు ఇప్పటికే మూసి ఉన్న పరిస్థితుల్లో కార్యాలయాలు పనిచేయకపోతే జనం రోడ్లపైకి వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పాజిటివ్ కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో కచ్చితంగా లాక్డౌన్ నిబంధనలను అమలు చేస్తూ… కట్టడి చర్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో కరోనా వైద్య పరీక్షలను పెద్ద ఎత్తు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మరో రెండు రోజుల్లో ర్యాపిడ్ టెస్టులు మొదలుపెట్టే అవకాశముంది. మొత్తానికి గ్రేటర్ పరిధిలో కరోనా కట్టడికి సర్కార్ సీరియస్ చర్యలు తీసుకుంటోంది.