కాలిన యూవీసీ లైట్లతో కరోనా ఖతం, నిజామాబాద్ వాసి సరికొత్త ఆవిష్కరణ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనావైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే కోట్లాది మందిని అటాక్ చేసింది. లక్షలాది మందిని బలి తీసుకుంది. కరోనాను ఖతం చేసే వ్యాక్సిన్ కానీ నయం చేసే మందు కానీ ఇప్పటివరకు రాలేదు. కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా, మహమ్మారి పీడ ఎప్పుడు విరగడ అవుతుందా అని యావత్ ప్రపంచం ఎదురుచూస్తోంది.

కాగా, కొందరు వ్యక్తులు కరోనాను ఖతం చేసే టెక్నాలజీని, పరికరాలను తయారు చేసే పనిలో పడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి ఆ దిశగా ప్రయత్నం చేశారు. ఓ బాక్స్ రూపొందిచారు. దాని ద్వారా కరోనాను ఖతం చేయొచ్చని చెబుతున్నారు.

యూవీసీ లైట్లను ఉపయోగించి కరోనా వైరస్‌ను నిర్మూలించే బాక్స్‌ను సృష్టించారు నిజామాబాద్‌ జిల్లా నవీపేటకు చెందిన మండాజి నర్సింహాచారి. కాలిన ట్యూబ్ లైట్లను వెలిగించే ప్రయోగంలో ప్రసిద్ధి చెందిన చారి, అదే ఫార్ములాను కాలిపోయిన యూవీసీ లైట్లకు ఉపయోగించారు. ట్రాన్సిస్టర్లు, రెసిస్టర్లు, కండెన్సర్లు, ఎలక్ట్రాన్లు మరికొన్ని ఎలక్ట్రానిక్‌ పరికరాలు జత చేయడం ద్వారా కరోనా, ఇతర వైరస్‌లను సంహరించే టెక్నాలజీని జత చేశారు.

15 సెకన్ల నుంచి 1200 సెకన్లలో వైరస్‌ సంహారక సామర్థ్యం ఈ బాక్స్‌కు ఉందన్నారు. దీనికి పేటెంట్‌ లభించినట్లు చెప్పారు. సార్స్‌తో పాటు సార్స్‌-సీవోవీ2 సహా పలు రకాల వైరస్‌లను సంహరించే సామర్థ్యం కలిగించే ఈ ప్రయోగం విజయవంతమైనట్లు సీసీఎంబీ అధికారికంగా ధ్రువీకరించిందని రాష్ట్ర నూతన ఆవిష్కరణల విభాగం (టీఎస్‌ఐసీ) మంగళవారం(సెప్టెంబర్ 15,2020) వెల్లడించింది.

ఇప్పటికే అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన ఓ కంపెనీ కరోనా వైరస్‌ను రెండు నిమిషాల్లో అంతమొందించే ఓ రోబోను రూపొందించింది. అత్యంత తీవ్రతతో ఉన్న అల్ట్రా వయోలెట్ సీ (యూవీసీ లైట్) కాంతి సాయంతో వైరస్‌ను నాశనం చేస్తారు. సాధారణ అతినీలలోహిత కాంతి (UV) తో పోలిస్తే UVC కాంతి తరంగదైర్ఘ్యం చిన్నగా, మరింత శక్తివంతంగా ఉంటుంది. జినెక్స్ డిస్‌ఇన్ఫెక్షన్ సర్వీస్ రూపొందించిన ఈ రోబోను అమెరికాలోని మిలిటరీ బేస్‌లు, పోలీసు బారక్‌లు, యూనివర్సిటీ క్యాంపస్‌లలో ఉపయోగిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో చాప కింద నీరులా చుట్టేస్తున్న కరోనా


దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. రోజురోజుకు విస్తరిస్తూ అల్లకల్లోలం సృష్టిస్తోంది. దేశంలో కొత్తగా 90వేలకు పైగా కరోనా కేసులు నమోదు కావడంతో.. మొత్తం కరోనా కేసుల సంఖ్య 50లక్షలు దాటిపోయింది. ఈ రోజు కొత్తగా 12వందలకు పైగా కరోనా మరణాలు నమోదవ్వగా ..మొత్తం మృతుల సంఖ్య 82వేలు దాటేసింది. వీటిలో గత నెల రోజుల్లోనే 32వేల మందికి పైగా కన్నుమూశారు. మొత్తం మరణాల్లో 40 శాతానికి పైగా కేవలం ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్‌ 15 మధ్యలోనే సంభవించాయి. గడిచిన 11 రోజుల్లోనే 10లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్యలో రెండో స్థానంలో ఉంది భారత్‌.

అయితే భారత్‌లోనే మరణాల రేటు అతి తక్కువగా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రపంచ సగటు మరణాల రేటు 3.20శాతం ఉండగా.. భారత్‌లో 1.64%కి పరిమితమైనట్లు పేర్కొంది. అమెరికాలో ఇది 3%, బ్రెజిల్‌లో 3.05%గా ఉన్నట్లు తెలిపింది. దీన్ని 1% కంటే తక్కువకు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, చాలా రాష్ట్రాల్లో మరణాల రేటు ఆ స్థాయిలోనే ఉన్నట్లు పేర్కొంది.

READ  కరోనా కోరలు పీకేస్తాం : ఇటలీకి చైనా వైద్యనిపుణుల బృందం 

దేశంలోని ఐదు రాష్ట్రాల్లోనే 60 శాతానికి పైగా కరోనా కేసులు వస్తున్నాయి. ఇందులో మహారాష్ట్ర వాటానే అత్యధికంగా ఉంది. ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో కూడా అత్యధిక కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలో ఇదివరకంటే గరిష్ఠ సంఖ్యలో కేసులొస్తున్నాయి. దేశం మొత్తంమీద కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 78.28 శాతంగా ఉంది. ప్రస్తుతం ఆక్టివ్‌ కేసులు 10లక్షలకు చేరువలో ఉన్నాయి.

ప్రజలకు కరోనా సోకకుండా చూడడంలో భాగంగా అశ్వగంధ, పిప్పలి వంటి ఆయుర్వేద ఔషధాలను ప్రజలకు ఇచ్చేందుకు వాటి పనితీరును ప్రయోగాత్మకంగా పరిశీలించే ప్రణాళిక ఉందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ రాజ్యసభకు తెలిపారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రల ఉత్పత్తి, ఎగుమతులను గణనీయంగా పెంచామన్నారు. ఇప్పటివరకు ఏ యాంటీవైరల్స్‌ సమర్థంగా పనిచేస్తున్నాయో నిర్దిష్టంగా తేలనందున లక్షణాలకు అనుగుణంగా చికిత్సలు కొనసాగుతున్నాయని చెప్పారు.

Related Posts