పట్టణాలు, పల్లెల్లో కరోనా పంజా.. వారం రోజుల్లోనే రెట్టింపు కేసులు.. హైదరాబాద్‌లో నిలకడగా

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

భయపడినట్టే జరిగింది. ఏదైతే జరక్కూడదని అనుకున్నామో అదే జరిగింది. కరోనా వైరస్ మహమ్మారి తెలంగాణ రాష్ట్రంలోని పట్టణాలు, పల్లెల్లో ప్రతాపం చూపుతోంది. ఆ ప్రాంతాల్లో కేసులు పెద్ద సంఖ్యలో నమోదు అవుతున్నాయి. రోజుల వ్యవధిలోనే డబుల్, త్రిబుల్ అవుతున్నాయి. దీంతో పట్టణ, పల్లె వాసులు భయం భయంగా బతుకున్నారు.

హైదరాబాద్ లో నిలకడగా కేసులు నమోదు:
మొన్నటివరకు హైదరాబాద్‌లో ప్రతాపం చూపించిన కోవిడ్ వైరస్‌.. ఇప్పుడు జిల్లాల్లో విజృంభిస్తోంది. పట్టణాలు, పల్లెల్లో పంజా విసురుతోంది. వారం రోజుల్లోనే చాలా జిల్లాల్లో రెట్టింపు కేసులు నమోదు కావడమే ఇందుకు నిదర్శనం. కొన్ని జిల్లాల్లో మూడు, నాలుగింతలు కూడా రికార్డయ్యాయి. వైద్య, ఆరోగ్య శాఖ గురువారం(ఆగస్టు 27,2020) విడుదల చేసిన బులెటిన్‌ మేరకు.. ఆగస్టు 20న జీహెచ్‌ఎంసీ పరిధిలో 473 కేసులుండగా, 26న 449 కేసులు నమోదయ్యాయి. ఇక్కడ గత వారం రోజులుగా కేసుల సంఖ్య దాదాపు నిలకడగానే కొనసాగుతోంది.

హైదరాబాద్ తో పోలిస్తే జిల్లాల్లో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. జిల్లాల్లో కరోనా విజృంభిస్తోంది.
* భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆగస్టు 20న 21 కేసులు నమోదు కాగా, 26న ఏకంగా 72 కేసులు రికార్డయ్యాయి.
* అంటే మూడింతలకు మించిన కేసులన్న మాట.
* భూపాలపల్లి జిల్లాలో 20న 12 కేసులు నమోదు కాగా, 26న 26 కేసులు.. అంటే రెట్టింపునకు మించి నమోదయ్యాయి.
* ఖమ్మం జిల్లాలో వారం క్రితం 79 కేసులు నమోదైతే, ఇప్పుడు 152 కేసులు నమోదయ్యాయి.
* ఇక మహబూబాబాద్‌ జిల్లాలోనైతే వారం క్రితం 26 కేసులు నమోదైతే, ఇప్పుడు ఏకంగా 102 కేసులు రికార్డయ్యాయి.

* మంచిర్యాల జిల్లాలో వారం క్రితం 40 కేసులుంటే, ఇప్పుడు 106 కేసులు రికార్డయ్యాయి.
* నల్లగొండ జిల్లాలో వారం క్రితం 60 కేసులుంటే, ఇప్పుడు 164 నమోదయ్యాయి.
* నిజామాబాద్‌లో ముందు 69 కేసులుంటే, ఇప్పుడు 112 నమోదయ్యాయి.
* పెద్దపల్లి జిల్లాలో వారం క్రితం 35 కేసులుంటే, ఇప్పుడు 77 నమోదయ్యాయి.
* సిద్దిపేట జిల్లాలో వారం క్రితం 49 కేసులుంటే, ఇప్పుడు 113 కేసులు వచ్చాయి.
* యాదాద్రి భువనగిరి జిల్లాలో 20న 18 కేసులుంటే, 26న 39 కేసులు రికార్డయ్యాయి.

ఉచ్చు బిగుస్తున్న జగన్, టీడీపీ నేతలను జైలుకి పంపేందుకు స్కెచ్


రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2 వేల వరకు కంటైన్మెంట్‌ జోన్లున్నాయని వైద్య వర్గాలు చెబుతున్నాయి. పల్లెల్లోనూ వైరస్‌ వ్యాప్తి చెందడంతో గ్రామాల్లో అలజడి నెలకొంది. సెప్టెంబర్ నెలాఖరుకు దాదాపు 3 వేల గ్రామాల్లోకి వైరస్‌ ప్రవేశించే అవకాశముందని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి.

లక్షా 14వేల 483 కోవిడ్ కేసులు:
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2వేల 795 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో లక్షా 14వేల 483 కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనా బారినపడి 8 మంది చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 788కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 872 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 86వేల 095గా ఉంది.

ప్రస్తుతం రాష్ట్రంలో 27వేల 600 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అందులో ఇళ్లు, ఇతరత్రా ఐసోలేషన్‌లలో చికిత్స పొందుతున్న వారు 20వేల 866 మంది ఉన్నారు. బుధవారం(ఆగస్టు 26,2020) ఒక్కరోజే 60వేల 386 టెస్టులు చేశారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 11లక్షల 42వేల 480 కోవిడ్ టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

READ  19న జరిగే పరీక్షలు వాయిదా

Related Posts