డిసెంబర్ లో కరోనా వ్యాక్సిన్, పది కోట్ల డోసులు – సీరం ఇనిస్టిట్యూట్ సీఈవో

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Coronavirus : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా టీకా.. దేశ ప్రజలకు అతి త్వరలోనే అందుబాటులోకి రానుంది. తమ సంస్థ భాగస్వ్యామంతో అభివృద్ధి చేసిన ఆక్స్‌ఫర్డ్‌ ఆస్ట్రాజెనెకా టీకా ‘కొవిషీల్డ్‌’ను డిసెంబరులో వినియోగంలోకి తెస్తామన్నారు ఇండియా సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈవో అదర్‌ పూనావాలా. మొత్తం పది కోట్ల డోసులను అందుబాటులోకి తేనున్నట్లు ఆయన ప్రకటించారు. కేంద్రం నుంచి అత్యవసర అనుమతులు లభిస్తే అదే నెలలో పంపిణీ ప్రారంభిస్తామని వివరించారు. వచ్చే ఏడాది మొదట్లో పూర్తి స్థాయి అనుమతులు లభించవచ్చన్న ఆశాభావం వ్యక్తం చేశారు.



కాగా, వంద కోట్ల డోసుల ఆస్ట్రాజెనెకా టీకా ఉత్పత్తి కోసం ఆక్స్‌ఫర్డ్‌తో సీరం ఇన్‌స్టిట్యూట్‌ జట్టు కట్టింది. ఉత్పత్తయిన టీకా డోసుల్లో సగం పేద దేశాలకు వెళ్లనున్నాయి. ఇప్పటికే కొవిషీల్డ్‌ తుది దశ ట్రయల్స్‌ పూర్తయి, పూర్తి సురక్షితమని తేలింది. కరోనా టీకా ఉత్పత్తికి సీరం.. మొత్తం ఐదు సంస్థలతో ఒప్పందం చేసుకుంది.



ఆస్ట్రాజెనెకా గత రెండు నెలల్లో 4 కోట్ల డోసులను ఉత్పత్తి చేసింది. దీంతో పాటు సీరం ఒప్పందం చేసుకున్న మరో సంస్థ నోవావాక్స్‌ టీకా త్వరలో ఉత్పత్తి కానుంది. ఈ రెండింటి పనితీరుపై పూనావాలా సంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు ఆస్ట్రాజెనెకా సీఈవో పాస్కల్‌ సొరియట్‌.. డిసెంబర్‌లో పెద్దఎత్తున టీకా పంపిణీకి సిద్ధమవుతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అమెరికా ప్రభుత్వం నుంచి అత్యవసర అనుమతి వస్తే.. అదే వివరాలను భారత ప్రభుత్వానికి సీరం ఇన్‌స్టిట్యూట్‌ సమర్పించనుంది.

Related Tags :

Related Posts :