పెద్దలకు కరోనా భయం, రాజ్యసభలో 130మంది 60ఏళ్ల పైబడినవారే, అందరికన్నా పెద్ద మన్మోహన్ సింగ్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

సెప్టెంబర్ 14 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కాగా, కరోనా వైరస్ మహమ్మారి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో సభ్యుల ఆరోగ్య పరిస్థితులపై వారి కుటుంబ సభ్యుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా రాజ్యసభలో ఎక్కువగా వృద్దులు ఉన్నారు. పెద్దల సభ నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న 244 మంది సభ్యుల్లో 130 మంది 60 ఏళ్లపైబడిన వారే ఉన్నారు.

వయసులో అందరికన్నా పెద్ద మన్మోహన్ సింగ్:
ఇందులో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అందరికంటే పెద్దవారు. ఆయన వయసు 87 ఏళ్లు. ఆ తర్వాత అకాళీదళ్‌ ఎంపీ సుఖ్‌దేవ్‌సింగ్‌ ధిండ్సా ఉన్నారు. ఆయన వయసు 84 ఏళ్లు. టీఆర్ఎస్ నేత కె.కేశవరావు (81), ఏఐఏడీఎంకె సభ్యుడు ఎస్‌.ఆర్‌.బాలసుబ్రహ్మణ్యన్‌ (81) ఉన్నారు. ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని పార్లమెంటు ఉభయసభాపతులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. భౌతికదూరం నిబంధనలకు అనుగుణంగా సీట్లు ఏర్పాటు చేయడంతోపాటు, అన్ని చోట్లా శానిటైజర్లు, 72 గంటల ముందు పరీక్షల నిర్వహణను తప్పనిసరి చేశారు.

కరోనా లెక్కల్లో తన వరల్డ్ రికార్డ్ తానే బ్రేక్ చేసిన భారత్:
భారత్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. కరోనా లెక్కల్లో భారత్ తన ప్రపంచ రికార్డును తానే బ్రేక్ చేసింది. కరోనా రోజువారి కేసుల్లో ప్రపంచంలోనే అత్యధికంగా ఇండియాలో రికార్డ్ అయ్యాయి. ఒక్కరోజే 86వేల 432 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 40లక్షల 23వేల 179 కు చేరింది. ఒక్కరోజులో ఇంత భారీగా కేసులు నమోదవడం ప్రపంచంలోనే ఇది తొలిసారి. ఇక గత 24 గంటల్లో 1,089 కరోనా బాధితులు ప్రాణాలు విడిచారు. మొత్తం మృతుల సంఖ్య 69వేల 561 కు చేరింది. కరోనా బారినపడ్డవారిలో కొత్తగా 70 వేల మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 31లక్షల 07వేల 223. ప్రస్తుతం 8లక్షల 46వేల 395 యాక్టివ్‌ కేసులున్నాయి.

నేడో రేపో రెండో స్థానానికి భారత్:
63లక్షల 89వేల 057 కరోనా కేసులతో అమెరికా.. 40లక్షల 91వేల 801 కేసులతో బ్రెజిల్‌ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. 40లక్షల 23వేల 179 కేసులతో భారత్‌ మూడో స్థానంలో ఉంది. కేసులు నమోదవుతున్న తీరును బట్టి చూస్తే నేడో రేపో భారత్‌ బ్రెజిల్‌ను దాటేసి రెండో స్థానానికి చేరుకోవడం ఖాయం.

Related Posts