సీజనల్ వైరస్‌గా కరోనా.. ఏడాది పొడవునా ప్రభావం ఉంటుంది..సాధారణ జలుబు, దగ్గు మాదిరిగానే వచ్చి నయమైపోతుంది

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనావైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా పేరు చెబితే చాలు జనాలకు నిద్రపట్టడం లేదు. కరోనాను ఖతం చేసే వ్యాక్సిన్ కానీ నయం చేసే మందు కానీ ఇప్పటివరకు రాలేదు. దీంతో కరోనా అంటే హడలిపోతున్నారు జనాలు. ఈ మహమ్మారి పీడ ఎప్పుడు విరగడ అవుతుందా అని ఎదరుచూస్తున్నారు. కాగా, కరోనా గురించి మరో న్యూస్ బయటకు వచ్చింది.

కరోనాతో కలిసి జీవించాల్సిందేనని వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు ఇప్పటికే చెబుతుండగా.. తాజాగా మరోసారి అదే నిజమని స్పష్టమైంది. ఈ వైరస్‌ సామూహిక వ్యాప్తి దశకు చేరుకున్న తర్వాత సీజనల్‌ వైరస్‌గా మారిపోయే అవకాశముందని అమెరికా యూనివర్సిటీ ఆఫ్‌ బీరుట్‌కు చెందిన శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది. అప్పటికి వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటే దీని ప్రభావం అంతగా కనిపించదని తేలింది.

ఆరోగ్యవంతుల నుంచి కరోనావైరస్‌ వ్యాప్తి రేటు చాలా తక్కువ:
అంతేకాకుండా ఆరోగ్యవంతుల నుంచి ఈ వైరస్‌ వ్యాప్తి రేటు చాలా తక్కువగా ఉందని అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. కరోనా సోకిన కొంత మంది వ్యక్తులపై ప్రయోగాలు చేయగా ఈ విషయం బయటపడింది. ఈ మేరకు ‘ఫ్రాంటియర్స్‌’ జర్నల్‌లో ఓ కథనం ప్రచురితమైంది. దీని ప్రకారం.. వ్యాధినిరోధక శక్తి ఎక్కువగా ఉన్న కొంతమందిని కొన్ని రోజుల పాటు ఒక చోట ఉంచారు. అందులో కరోనా వైరస్‌ సోకిన వారున్నప్పటికీ ఇతరులకు అది వ్యాప్తి చెందే రేటు చాలా తక్కువగా ఉంది. సాధారణ జలుబు, దగ్గు మాదిరిగానే వచ్చి నయమైపోయింది.

ఏడాది పొడవునా వైరస్ ప్రభావం:
‘సామూహిక దశకు చేరుకున్నంత వరకు కరోనా వ్యాప్తి కొనసాగుంది. ఆ తర్వాతే దాని తీవ్రత తగ్గే అవకాశముంది. అందువల్ల కరోనా వ్యాప్తిని నియంత్రణ నియమాలను కచ్చితంగా పాటించాలి. మాస్కులు ధరించడంతోపాటు భౌతిక దూరం పాటించడం లాంటివి అలవాటు చేసుకోవాలి’’ అని రీసెర్చ్ ఇంచార్జ్ జరాకెట్‌ తెలిపారు. సాధారణంగా వైరస్‌ల ప్రభావం సీజన్‌ని బట్టి ఉంటుంది, అయితే కరోనా ప్రభావం మాత్రం సంవత్సరం పొడవునా ఉంటుందని, ఉష్ణమండల దేశాల్లో దీని తీవ్రత అంతగా కనిపించదని తేలిందన్నారు.

గాల్లోనూ జీవించగలదు:
రీసెర్చ్ లో భాగంగా సీజనల్‌ వైరస్‌ల వ్యాప్తి తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. వీటి ఆధారంగా నావెల్‌ కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రతను లెక్కించారు. దీని ఆధారంగా ఈ వైరస్‌ గాల్లోనూ, నేలపైనా జీవించగలదని, ఒకరి నుంచి మరొకరికి సులువుగా వ్యాప్తి చెందగలదని మరోసారి స్పష్టం చేశారు. అంతేకాకుండా ఎక్కువ మంది గుంపులుగా ఏర్పడినప్పుడు వైరస్‌ సోకడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందని వెల్లడించారు. అయితే వాతావరణంలో మార్పులు, గాలిలో తేమ తదితర అంశాలపైనా వైరస్‌ వ్యాప్తి ఆధారపడుతుందని తేల్చారు.

Related Posts