అనంతలో తీవ్ర విషాదం, కరోనా సోకిందనే మనస్తాపంతో దంపతుల ఆత్మహత్య, అనాథగా 12ఏళ్ల బాలుడు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా మహమ్మారి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోంది. కరోనా కంటే అది సోకుతుంద అనే భయం, సోకిందనే మనస్తాపం చాలామందిని చంపేస్తోంది. అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కరోనా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని బలి తీసుకుంది. ధర్మవరం పెరు వీధిలో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు.

తమకు కరోనా సోకిందనే మనస్తాపంతో ఫణిరాజ్, శిరీష దంపతులు అర్థరాత్రి ఇంటిపై నుంచి దూకి ప్రాణాలు కోల్పోయారు. వారం క్రితమే ఫణిరాజ్ తల్లి వరలక్ష్మి(60) కరోనాతో చనిపోయారు. తమకూ వైరస్ సోకిందని దంపతులు మదన పడుతున్నారు. ఇప్పటికే వీరిద్దరికి కరోనా నిర్ధారణ టెస్టులు చేయగా, రిపోర్టులో పాజిటివ్ వచ్చింది. దీంతో మనస్తాపం చెందిన దంపతులు నిన్న(ఆగస్టు 1,2020) రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. తల్లిదండ్రుల మృతితో 12ఏళ్ల బాలుడు అనాథ అయ్యాడు.

ముందుగా ఫణిరాజ్ కుటుంబంలో అతడి తల్లికి కరోనా సోకింది. వారం రోజుల క్రితం ఆమె కరోనాతో చనిపోయారు. ఆమె ద్వారా భర్త, కొడుకు, కోడలికి కూడా కరోనా సోకింది. టెస్టులు చేయగా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఫణిరాజ్ తండ్రి కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. లక్షణాలు ఏమీ లేకపోవడంతో మూడు రోజుల క్రితమే ఫణిరాజ్, శిరీష్ ఇంటికి వచ్చారు. కాగా, కరోనా సోకిందని వారు బాగా మనస్తాపం చెందారు. తమ ఒక్కగానొక్క కొడుకు గురించి ఆలోచన చేశారు. ఆ పిల్లాడు ఏమైపోతాడో అని బెంగ పెట్టుకున్నారు. మనస్తాపం చెందిన దంపతులు అర్థరాత్రి ఒంటి గంట సమయంలో మూడంతస్తుల భవనం పైనుంచి దూకి ప్రాణాలు వదిలారు. తీవ్ర గాయాలు కావడంతో స్పాట్ లోనే ఇద్దరూ చనిపోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాలను మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.


Related Posts