కరోనా వ్యాక్సిన్లు వచ్చేస్తున్నాయ్.. ఏది సక్సెస్ అయినా మహమ్మారి ఖతమే!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ బయోటెక్ కరోనా వాక్సిన్ అభివృద్ధి చేస్తోంది. మరి అందరికన్నా ముందు రంగంలోకి దిగిన విదేశీ సంస్థల ప్రయోగాలు ఎంతవరకూ వచ్చాయి? ప్రపంచ వ్యాప్తంగా వందల కొద్దీ వాక్సిన్ ప్రయోగాలు వివిధ దశల్లో ఉన్నాయి. వీటన్నింటిలో మూడు కంపెనీలు ముందంజలో ఉన్నాయి. అమెరికా , చైనా , ఇంగ్లాండ్ లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న వాక్సిన్లు మనుషులపై పరీక్షలకు పోటీ పడుతున్నాయి. అందరికన్నా ముందుగా మార్కెట్ లోకి రావాలని మూడు కంపెనీలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి.

వివిధ దేశాల్లో వందల సంఖ్యలో వాక్సిన్ ప్రయోగాలు జరుగుతున్నాయి . బయటకొచ్చిన ప్రతీ వాక్సిన్ విజయవంతం అవుతుందన్న గ్యారంటీ లేదు . వాక్సిన్ బయటకు రావడానికి ముందు అనేక కఠినమైన పరీక్షలు ఎదుర్కోవలసి ఉంటుంది . ఇమ్మ్యూనిటి కి సంబంధించి , సైడ్ ఎఫెక్ట్స్ కు సంబంధించి సమస్యలు ఎదురుకావచ్చు . అవన్నీ అధిగమించి నిలబడేదే విజయవంతం అవుతుంది. ఆ తరువాత వాణిజ్య పరంగా దాని ఉత్పత్తి రెండో దశ . కంపెనీ ఉత్పత్తి సామర్ధ్యాన్ని బట్టి వాక్సిన్ డోసుల సంఖ్య ఆధారపడుతుంది . ఈ లోగా అమెరికా వంటి సంపన్న దేశాలు ముందుగా వాక్సిన్ సంపాదించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాయి . అసలు పోటీ అప్పుడే మొదలవుతుంది . హార్వార్డ్ హెల్త్ ఎక్స్పర్ట్ ఆశిష్ ఝా లెక్క ప్రకారం ప్రారంభం లో ఇండియా కు కనీసం 60 కోట్ల డోసులు అవసరం కావచ్చు . వాక్సిన్ సిద్ధమయ్యాక మనకు ఎన్ని డోసులు అవసరం అనే విషయం పై ఇండియా కు ఒక ప్రణాళిక అవసరం . ఇదే విధంగా అన్ని దేశాలూ తమతమ అంచనాలు సిద్ధం చేసుకుంటాయి . ముందుగా ఎవరి వాక్సిన్ మార్కెట్ లోకి వచ్చినా పూర్తి వ్యాపార దృష్టి తో కాకుండా మానవతా దృష్టి తో వ్యవహరించాలన్న వాదన కూడా ఒకటుంది . ఏంజరుగుతుందో చూడాలి .

ఇప్పటికైతే విదేశాల్లో మూడు వాక్సిన్ ప్రయోగాలు తుది దశకు చేరాయి. మొదటిది అమెరికాకు చెందిన మోడెర్నా సంస్థ , అమెరికా ప్రభుత్వ నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ హెల్త్ సంయుక్తంగా ఒక వాక్సిన్ అభివృద్ధి చేస్తున్నాయి . జంతువులపై ప్రయోగాలు విజయవంతం కావడంతో క్లినికల్ టెస్ట్స్ కు మోడెర్నా సిద్ధం అయింది . అంటే మనుషులపై పరీక్షలన్న మాట . మార్చి నెలలో మోడెర్నా 45 మంది వాలంటీర్లను ఎంపిక చేసింది . ఆ తరువాత 300 మంది యువకులపై వాక్సిన్ పరీక్ష నిర్వహించింది . ఇప్పుడు వయసు పైబడిన వారిపై వాక్సిన్ ఎలా పని చేస్తుందో పరీక్షించే పనిలో ఉంది. జులై నెలలో భారీ ఎత్తున 30 వేల మందిపై వాక్సిన్ పరీక్షలకు మోడెర్నా సిద్ధం అయ్యింది . అందుకు అవసరమైన డోసులు కూడా సిద్ధం చేసింది .

కాకపోతే మొదటి రెండు దశల్లో జరిపిన పరీక్షల ఫలితాల కోసం వేచి చూస్తోంది . పెద్ద ఎత్తున మనుషులపై పరీక్షలు జరిపే ముందు ఈ ఫలితాలు చాలా అవసరం . వాక్సిన్ ఎలా పనిచేస్తోందో తెలుసుకోవాల్సి ఉంటుంది . మనుషుల్లో ఉండే రోగ నిరోధక వ్యవస్థ వాక్సిన్ పై ఎలా స్పందిస్తుందో తెలియాలి . దాంతో పాటే సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకోవాలి . కరోనాను జయించే ప్రయత్నాల్లో ఇది చివరి పరీక్ష కావచ్చు. ఇది విజయవంతం అయితే కరోనా పై మానవ విజయం సాధ్యమైనట్లే. అమెరికా తరువాత వాక్సిన్ పరీక్షల్లో ముందున్న మరో దేశం చైనా . అన్ని పరీక్షలూ పూర్తిచేసుకున్న చైనా వాక్సిన్ ను ముందుగా మిలిటరీకి సరఫరా చేయడానికి సిద్ధమయ్యింది.

జూన్ 25 న సెంట్రల్ మిలిటరీ కమీషన్ అందుకు అనుమతి ఇచ్చింది . కరోనా వైరస్ మొదట బయట పడింది చైనా లోనే కావడం ఇక్కడ చెప్పుకోవాలి . చైనా లో జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రతీ అంశం అక్కడి మిలిటరీ పర్యవేక్షణలోనే ఉంటుంది . ఇప్పుడీ కరోనా వాక్సిన్ పరీక్ష కూడా మిలిటరీ పర్యవేక్షణలోనే సాగుతోంది . అకాడెమీ అఫ్ మిలిటరీ మెడికల్ సైన్సెస్ విభాగమైన బీజింగ్ ఇన్స్టిట్యూట్ అఫ్ బయోటెక్నాలజీ , క్యాన్సినో సంస్థ సంయుక్తంగా దీన్ని అభివృద్ధి చేస్తున్నాయి .

చైనా వాక్సిన్ ఎంతో సురక్షితమని మనుషులపై జరిపిన పరీక్షల్లో తేలిందని క్యాన్సినో బయోలాజిక్స్ తెలిపింది . కరోనా వ్యాధినివారణకు ఇది బాగా పని చేస్తుందని తెలిపింది . మనుషులపై జరిపిన రెండు దశల పరీక్షలూ చైనా లోనే జరిగాయి . కాబట్టి చైనా వాక్సిన్ ను వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసే విషయాన్ని ఇప్పుడప్పుడే ఖరారు చేయలేమని క్యాన్సినో తెలిపింది. అమెరికా , చైనా తరువాత వాక్సిన్ అభివృద్ధి చేస్తున్న మరో దేశం ఇంగ్లాండ్ . అక్కడి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న కరోనా వాక్సిన్ పరీక్షలు తుది దశకు వచ్చాయి . మనుషులపై జరిపే మూడో దశ పరీక్షలు బ్రెజిల్ లో మొదలయ్యాయి . అక్కడ వాలంటీర్లకు వాక్సిన్ షాట్స్ ఇస్తున్నారు . మొదటి సారి 5,000 మంది వాలంటీర్లకు ఈ షాట్స్ ఇస్తున్నారు.

రియో డీ జనీరో , సావో పాలో , ఈశాన్య బ్రెజిల్ లో ఈ కార్యక్రమం జూన్ 20 న చేపట్టారు. అటు యునైటెడ్ కింగ్డమ్ లో కూడా మనుషులపై పరీక్షలు సాగుతున్నాయి . ఇప్పటికి 4,000 మంది వాలంటీర్లు నమోదు చేసుకున్నారు . మరో పది వేల మంది వాలంటీర్లను ఎంపికే చేయాల్సి ఉంది. ప్రస్తుతానికి విదేశాల్లో వాక్సిన్ అభివృద్ధి తుది దశకు చేరింది . అమెరికా , చైనా , ఆక్స్ఫర్డ్ వాక్సిన్ లు ముందంజలో ఉన్నాయి . ఇటు ఇండియా లో భారత్ బయోటెక్ మనుషులపై పరీక్షలకు సిద్ధం అయ్యింది . ఇందులో ఏది ముందు వస్తుందో ఇప్పుడే చెప్పలేం . ఈ వాక్సిన్ లు అన్నీ సక్సెస్ అవుతాయన్న గ్యారంటీ లేదు . అలాగని అన్నీ ఫెయిల్ అవుతాయని చెప్పలేం . కనీసం ఒకటో , రెండో సక్సెస్ అయినా కరోనా మహమ్మారిపై మానవ విజయం సాధ్యమైనట్లే.