లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

హైదరాబాద్‌ చేరుకున్న కోవిడ్‌ వ్యాక్సిన్‌..పుణె నుంచి ప్రత్యేక విమానంలో

Published

on

covid vaccine reached Hyderabad on a special flight from Pune : కోవిడ్‌ వ్యాక్సిన్‌ హైదరాబాద్‌ చేరుకుంది. పుణె నుంచి స్పైస్‌ జెట్‌ కార్గోలో వ్యాక్సిన్‌ వచ్చింది. శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంది. ముందుగా హైదరాబాద్‌లోని కోఠి వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్దనున్న కోల్డ్‌ స్టోరేజీకి డోసులు చేరుకోనున్నాయి. ఆ తర్వాత అక్కడి నుంచి జిల్లాలకు వాటిని రవాణా చేయనున్నారు. తెలంగాణకు 31 బాక్సుల్లో 3 లక్షల72 వేల డోసులు, ఏపీకి 34 బాక్సుల్లో 4 లక్షల 8 వేల డోసులు వచ్చాయి. గన్నవరానికి మధ్యాహ్నం 1:15 నిమిషాలుకు చేరుకోనుంది. మరోవైపు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కోల్డ్‌ స్టోరేజీలను సిద్ధం చేశారు.

తెలంగాణలో జనవరి 16 నుంచి టీకా కార్యక్రమం ప్రారంభం కానుంది. తొలివిడతగా రాష్ట్రంలో 2లక్షల 90 వేల మంది ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్ వేయనున్నారు. రాష్ట్రంలో మొత్తం 5 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసుల నిల్వకు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌లో 3 కోట్లు, జిల్లాల్లో 2 కోట్ల డోసులను నిల్వ చేసుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. వైద్య సిబ్బందికి ఇచ్చే రెండు విడతల డోసులను ఒకేసారి కేంద్రం పంపనుంది. ప్రస్తుతం అందించేది కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌. టీకా కార్యక్రమం మొదటి రోజున రాష్ట్రంలోని రెండు వ్యాక్సిన్‌ కేంద్రాల సిబ్బంది, పలువురు ఆరోగ్య కార్యకర్తలతో ప్రధాని మోదీ వర్చువల్‌గా సంభాషించనున్నారు.

తొలి రోజున.. 13వేల 900 మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఈ నెల 16న రాష్ట్రంలోని 139 టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. మొదటి రోజున ప్రతి జిల్లాలో సగటున రెండు, మూడు టీకా కేంద్రాల్లో హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని అత్యధిక కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ జరుగుతుంది. ఇదే రోజున 45 ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ టీకా కార్యక్రమం ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. ఇక మిగిలినవన్నీ సర్కారీ టీచింగ్‌ ఆస్పత్రులు, జిల్లా, పీహెచ్‌సీ ఆస్పత్రులే. గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌ లాంటి ఆస్పత్రుల్లో నాలుగు చొప్పున టీకా కేంద్రాలను ఏర్పాటు చేయగా, వాటిలో తొలిరోజే 400 మందికి చొప్పున టీకాలు వేస్తారు.

18 నుంచి తెలంగాణవ్యాప్తంగా కరోనా టీకా కేంద్రాలను 12వందలకు పెంచుతామని అధికారులు వెల్లడించారు. జనవరి 22లోగా వైద్య సిబ్బందికి టీకాలివ్వడం పూర్తి చేస్తామన్నారు. వైద్య సిబ్బందికి టీకాలు వేయడం పూర్తయిన వెంటనే ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు వ్యాక్సినేషన్‌ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్‌ను ప్రారంభించిన వారం రోజుల్లోనే తొలివిడతను పూర్తి చేస్తామని వైద్య వర్గాలంటున్నాయి. వారంలోనూ నాలుగు రోజులు మాత్రమే టీకాలివ్వనున్నారు.

టీకా తొలి డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోసు ఇవ్వాల్సి ఉన్నందున వైద్య సిబ్బందికి ఫిబ్రవరి 16 నుంచి రెండో డోసును ఇస్తామని అధికారులు చెబుతున్నారు. మార్చి మూడో వారం నాటికి రాష్ట్రంలో వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు రెండు విడతల డోసు ఇవ్వడం పూర్తి అవుతుందని తెలిపారు. కొవిడ్‌ టీకా తీసుకోవాలంటే ముందుగా కొవిన్‌ సాఫ్ట్‌వేర్‌లో పేరు నమోదు చేసుకునే మార్గ దర్శకాలను రూపొందించారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేస్తున్న 2 లక్షల 90వేల మంది వైద్య సిబ్బంది వివరాలను కొవిన్‌లో నమోదు చేసే ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది.ఆ మేరకు టీకా డోసులు రాష్ట్రానికి రానున్నాయి. అయితే రవాణా, ఇతర కారణాల వల్ల టీకా వయల్స్‌ దెబ్బతినే అవకాశం ఉండటంతో అదనంగా 10 శాతం డోసులను కేంద్రం పంపనుంది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *