పోలీసులే డబ్బు తీసుకొచ్చి పెట్టారనేది అవాస్తవం, 20మంది దాడి చేసి పోలీసుల నుంచి డబ్బు లాక్కున్నారు..సీపీ జోయల్ డేవిస్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

cp joyal davis: దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు నివాసంతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో పోలీసుల సోదాలు, నోట్ల కట్టలు లభించిన అంశాలపై సీపీ జోయల్ డేవిస్ స్పష్టత ఇచ్చారు. సిద్దిపేటలో ముగ్గురి ఇళ్లలో సోదాలు చేశామని ఆయన తెలిపారు. మున్సిపల్ చైర్మన్ రాజనర్స్, సురభి రాంగోపాలరావు, అంజన్‌రావు ఇళ్లలో తనిఖీలు నిర్వహించామన్నారు. సురభి అంజన్‌రావు ఇంట్లో రూ.18 లక్షల నగదు దొరికిందని చెప్పారు.

అంజన్‌రావు బంధువు జితేందర్‌రావు డ్రైవర్ ద్వారా డబ్బు పంపారని తెలిపారు. పంచనామా తర్వాత పోలీసులు డబ్బు బయటకు తెచ్చే సమయంలో 20 నుంచి 30మంది బీజేపీ కార్యకర్తలు పోలీసులపై దాడి రూ.5.87 లక్షలు ఎత్తుకెళ్లారన్నారు. మిగిలిన రూ.12.80 లక్షలను సీజ్ చేశామని, డబ్బు ఎత్తుకెళ్లినవారిని గుర్తించి అరెస్ట్‌ చేస్తామని సీపీ జోయల్ డేవిస్ తెలిపారు.

పోలీసులే డబ్బు తీసుకొచ్చి పెట్టారనేది అవాస్తవం అని సీపీ స్పష్టం చేశారు. డబ్బులు సీజ్ చేసే ప్రక్రియను వీడియో తీశామన్నారు. సిద్దిపేట ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ సమక్షంలోనే డబ్బులు సీజ్ చేశామని ఆయన వెల్లడించారు.

బీజేపీ అభ్యర్థి బంధువు ఇంట్లో రూ.18లక్షలు లభ్యం:
సోదాలు.. అరెస్టులు.. లాఠీచార్జిలతో సిద్దిపేట అట్టుడికింది. దాదాపు పది గంటలపాటు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ రావు బంధువుల ఇంట్లో పోలీసుల సోదాల నుంచి బీజేపీ అధ్యక్షుడు సంజయ్‌ అరెస్టు వరకూ హైడ్రామా చోటు చేసుకుంది. సోమవారం(అక్టోబర్ 26,2020) మధ్యాహ్నం.. పోలీస్‌, రెవెన్యూ అధికారులు కలిసి రఘునందన్‌రావు బంధువులు సురభి రాంగోపాల్‌రావు, సురభి అంజన్‌రావు ఇళ్లలో తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో రఘునందన్‌రావు మామ రాంగోపాల్‌రావు ఇంట్లో ఎటువంటి నగదు లభ్యం కాకపోగా.. సురభి అంజన్‌రావు ఇంట్లో రూ.18.67 లక్షల నగదు లభ్యమైనట్లు ప్రకటించారు. ఆ నగదుతో బయటకు వస్తుండగా.. బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పోలీసులే ఇంట్లో డబ్బులు పెట్టి.. లభ్యమైనట్లు చెబుతున్నారంటూ వాగ్వాదానికి దిగారు.

మరోవైపు తనిఖీల విషయం తెలుసుకున్న బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు కూడా అక్కడికి చేరుకొని.. నోటీసులివ్వకుండా తనిఖీలు చేయడమేంటని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేయడంతో ఉద్రిక్తతకు దారితీసింది. పలువురు బీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు.

బట్ట కాల్చి మీదేస్తున్నారు: రఘునందన్‌
దేశంలో ఎవరి ఇళ్లలో డబ్బులు దొరికినా తనకు సంబంధించినవేననడం సమంజసం కాదని దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు అన్నారు. తనను వందసార్లు చెక్‌ చేశారని, ఇంకా వందసార్లు చెక్‌ చేసినా తాను ఫెయిర్‌గానే ఉన్నానని తెలిపారు. బట్ట కాల్చి మీదేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని తన ఇంట్లో కూడా తనిఖీలు చేసుకోవచ్చని సూచించారు. తన కూతురు, అల్లుడు ఇద్దరు డాక్టర్లేనని, వారిని కూడా పని చేసుకోకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తనిఖీలు చేస్తున్నట్లు పోలీసులు నోటీసు ఇవ్వలేదని, పైగా డబ్బులను బీజేపీ కార్యకర్తలు అపహరించారంటూ ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తనకు సంబంధం లేని ఇంట్లో తనిఖీలు చేశారని, పోటీ చేయకుండా తప్పించేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు.

అడ్డంగా దొరికినా డ్రామాలు చేస్తున్నారు:
బీజేపీ నేతలపై మంత్రి హరీశ్‌ రావు ఫైర్‌ అయ్యారు. బీజేపీ నోట్ల కట్టలతో అడ్డంగా దొరికినా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు నిరసన కార్యక్రమాలు చేస్తోందని విమర్శించారు. మద్యం, నోట్ల కట్టలతో ఓట్లను కొనాలనుకుంటున్నారని మండిపడ్డారు హరీశ్‌రావు. ఓడిపోతామనే భయంతో బీజేపీ ఎన్నికలు వాయిదా వేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. బీజేపీ గోబెల్స్ ప్రచారాన్ని జనం నమ్మరని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండో స్థానం కోసం పోటీ పడుతున్నాయని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు దుబ్బాకలో డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితి లేదని హరీష్ రావు జోస్యం చెప్పారు.

Related Tags :

Related Posts :