ఈ ఆయుర్వేద డాక్టర్ సీరియల్ కిల్లర్, వందమందిని హత్యచేశాడు, కిడ్నీలను అమ్ముకున్నాడు

  • Published By: murthy ,Published On : July 30, 2020 / 11:11 AM IST
ఈ ఆయుర్వేద డాక్టర్ సీరియల్ కిల్లర్, వందమందిని హత్యచేశాడు, కిడ్నీలను అమ్ముకున్నాడు

అతనొక ఆయుర్వేద డాక్టర్. ప్రాణాలు పోసి రోగులను రక్షించాల్సిన వాడు నేరాల చేయటంలో డాక్టరేట్ సంపాదించాడు. ఎవరికీ చిక్కకుండా నేరం చేయటానికి వేసే ప్లాన్లలో అతనిది మాస్టర్ మైండ్. ఢిల్లీ దాని పొరుగు రాష్ట్రాలు ఉత్తర ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్లలో అతను చేసిన నేరాల చిట్టా లెక్క తేలకపోయినా ఇప్పటి వరకు పోలీసులు గుర్తించిన వాటిలో కనీసం 50 మందిని హత్య చేసి శవాలు మాయం చేసినట్లు తెలుసుకున్నారు.

ఇవి కాక కిడ్నీ రాకెట్ కేసులోనూ, నకిలీ గ్యాస్ ఏజెన్సీ కేసులోనూ అరెస్టయ్యాడు. ఒక హత్య కేసులో 16 సంవత్సరాల జీవిత ఖైదు అనుభవిస్తూ జనవరిలో పెరోల్ పై విడుదలయ్యాడు. తప్పించుకు తిరుగుతున్న అతడిని ఇటీవల ఢిల్లీలోని బాప్రోలా ప్రాంతంలో పోలీసులు తిరిగి అరెస్ట్ చేశారు.

ఉత్తర ప్రదేశ్ లోని అలీగ్రా జిల్లాలోని పురేని కి చెందిన దేవందర్ శర్మ(62) BAMS ఆయుర్వేద పట్టభద్రుడు. బీహార్ లోని సివాన్ నుండి ఆయుర్వేద డాక్టర్ గా పట్టా పుచ్చుకున్నతర్వాత 1984లో క్లినిక్ ప్రారంభించాడు. కొన్నాళ్లు ప్రాక్టీస్ చేసిన శర్మ 1992 లో గ్యాస్ కంపెనీ డీలర్ షిప్ తీసుకుని 11 లక్షల రూపాయలతో కొత్తగా వ్యాపారం ప్రారంభించాడు. ఆ వ్యాపారంలో నష్టపోయాడు. దాంతో ఆర్ధికంగా కష్టాలు మొదలయ్యాయి.

డాక్టరుగా వచ్చే సంపాదన సరిపోవటంలేదు. ఆర్దికంగా నష్టపోయాడు ఏం చేయాలా అని ఆలోచించాడు. 1995 లో ఆలీఘర్ లోని చారా గ్రామంలో గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్ వ్యాపారం చేసేందుకు ఒక నకిలీ గ్యాస్ ఏజెన్సీ ప్రారంభించాడు.

అక్కడి నుంచి అతని నేర జీవితం మొదలైంది. కొంత మందితో ఒక ముఠాగా ఏర్పడ్డాడు. అతను చెప్పినట్లు ముఠా సభ్యులు చేసేవారు. గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసే లారీలను దోచుకోవటం మొదలెట్టారు. ముఠా సభ్యులు జాతీయ రహాదారిపై కాపు కాసేవారు. గ్యాస్ సిలిండర్ల లారీలు వెళుతుంటే ప్రయాణికుల్లాగా  అడిగి లారి ఎక్కేవారు. నిర్మానుష్యమైన ప్రాంతం రాగానే లారీ సిబ్బందిని హత్యచేసి సిలిండర్లను శర్మ నిర్వహిస్తున్న నకిలీ గ్యాస్ ఏజెన్సీలో దింపేవారు.

దోచుకున్న లారీలను మీరట్లోని కొండలపై నుంచి లోయలోకి కూల్చి వేస్తారు. హత్య చేసిన డ్రైవర్లు, క్లీనర్ల శవాలను మొసళ్లు ఉన్న కష్టంజ్ లోని కాలువలో పడేసేవారు. మొసళ్లు మృతదేహాలను పీక్కు తినటంతో వాటి ఆనవాళ్లు తెలిసేవి కావు. కొన్ని సార్లు దోచుకున్నలారీలను పార్ట్ లు వూడతీసి విడి భాగాలుగా అమ్మేసే వారు.

ఇది కాక 1994 లో జైపూర్ , భల్లాబగ్రా, గురుగావ్ లలో జరిగిన అంతరాష్ట్ర కిడ్నీ రాకెట్ ముఠా కుడా నిర్వహించాడు. అప్పట్లో కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కు ఒక్కో కేసులో రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల రూపాయల వరకు రోగులనుంచి వసూలు చేశాడు. 2004 లో శర్మను అరెస్టు చేసినప్పుడు పదేళ్ల కాలంలో 125 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేయించినట్లు ఒప్పుకున్నాడు.

అప్పుడే శర్మ చేసిన నేరాల చిట్టా ఒక్కోక్కటి వెలుగుచూశాయి. లారీ డ్రైవర్ల హత్య, గ్యాస్ సిలిండర్ల దొంగతనాలు వంటి కేసుల్లో పోలీసులు విచారణ చేశారు. శర్మ చేసిన నేరాల చిట్టా తెలుసుకున్న భార్య పిల్లలు 2004 లో అతడ్ని విడిచి పెట్టి దూరంగా బతకసాగారు. ఢిల్లీ చుట్టు పక్కల రాష్ట్రాల్లోని పోలీసు స్టేషన్లలో నమోదైన 45-50 కేసుల్లో తన ప్రమేయం గురించి నేరం ఒప్పుకున్నాడు.

16 ఏళ్ళుగా జైలు జీవితం గడుపుతున్న శర్మ జనవరిలో పెరోల్ పై విడుదలయి స్వగ్రామం చేరుకున్నాడు. తిరిగి మార్చి లో అతను తిరిగి జైలుకు వెళ్లాల్సి ఉంది. కానీ జైలుకు వెళ్ళకుండా, పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. స్వగ్రామం నుంచి వచ్చి తన స్నేహితుడి ఇంట్లో కొన్నాళ్లు ఉన్నాడు.

ఆతర్వాత బాప్రోలా వెళ్లి ఒక వితంతువును వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అతని గురించి విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు మంగళవారం జులై 28న అతడిని అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు.