పెళ్లి పేరుతో యువతులకు వల…. డబ్బు తీసుకుని పరార్

  • Published By: murthy ,Published On : July 27, 2020 / 11:34 AM IST
పెళ్లి పేరుతో యువతులకు వల…. డబ్బు తీసుకుని పరార్

పెళ్లి సంబంధాల పేరుతో మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్లలో పేరు రిజిష్టర్ చేసుకుని యువతులను మోసం చేస్తున్న యువకుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా ఒక యువతినుంచి రూ.17 లక్షలు కాజేయటంతో ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకోగా ఈ విషయం వెలుగు చూసింది.

ముదిత్ చావ్లా(34) అనే వ్యక్తి తన వివరాలను పెళ్లి కోసం మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్ లో రిజిష్టర్ చేసుకున్నాడు. వేర్వేరు చిరునామాలతో వివిధ వెబ్ సైట్లలో తన పేరు రిజిష్టర్ చేసుకున్నాడు. పెళ్లి కావల్సిన యువతులు సంప్రదించగానే వారితో మాట్లాడి పరిచయం పెంచుకుంటాడు.

ఈ లోగా వారి వద్దనుంచి కట్నం పేరుతో అవకాశం ఉన్నంత వరకు డబ్బులు దండుకుని ప్రోఫైల్ డిలీట్ చేసి మోసం చేస్తాడు. ఈ రకంగా పలు మ్యాట్రిమోనీ సైట్లలో పేరు, అడ్రస్ మార్చుతూ యువతులను మోసం చేస్తూ డబ్బు కొట్టేస్తున్నాడు.

2018, డిసెంబర్ లో ఇతనికి షాదీ డాట్ కామ్ లో ఒక యువతి పరిచయం అయ్యింది. తనకు ఢిల్లీలోని పాలం ఏరియాలో బెడ్ షీట్లు తయారు చేసే స్వంత టెక్స్ టైల్స్ మిల్లు ఉందని చెప్పాడు. చెప్పిన హోదాకు తగ్గట్లు విలాసవంతమైన అద్దె కార్లతో తిరిగేవాడు.

ఆమెకు నమ్మకం కుదరటానికి ఆమె వద్దనుంచి చిన్న చిన్న మొత్తాల్లో డబ్బు చేబదులుగా తీసుకుని చెప్పిన టైమ్ కు తిరిగి ఇచ్చేసేవాడు. ఆమెకు తనపై నమ్మకం కుదిరిన తర్వాత డిసెంబర్ 2019 లోపు..ఆమెకు ఉన్న వివిధ బ్యాంకు ఎకౌంట్ల నుంచి రూ.17 లక్షల రూపాయలు పర్సనల్ లోనుగాను, వ్యాపార నిమిత్తం తీసుకున్నాడు. ఈలోగా ఆమె పెళ్లి ప్రస్తావన తీసుకురాగా, మాట దాటేయటం మొదలెట్టాడు. కొన్నాళ్లకు ముఖం చాటేసాడు.

దీంతో ఆ యువతి అశోక్ విహార్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న వాయువ్య ఢిల్లీ పోలీసులు ముదిత్ చావ్లాను గురుగావ్ లో శుక్రవారం అరెస్టు చేశారు. ఇంతకు మునుపే అతడిపై ఇలాంటివి నాలుగు కేసులున్నట్లు డీసీపీ విజయకాంత్ ఆర్య తెలిపారు. నిందితుడి వద్దనుంచి వివిధ పేర్లతో ఉన్న ఐడీ కార్డులు, ఆధార్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.